3025వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3025* వ నాటి గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమం!

          ఉద్యమ సంఘటనం శుక్రవారం (9.2.24) వేకువ కాలానిది, పూనుకొన్న కారకర్తలు 23 మంది, సంఘటనా స్థలం బెజవాడ రోడ్డులోని అగ్రహారం ప్రధాన వీధి దగ్గరగా సుమారు 200 గజాల దాక, కాలంలో సదరు శ్రమదాన కొలత 2 గంటలు!

          ఐదుగురు గట్టి పిండాలైతే - అక్కణ్ణుంచి తూర్పుగా కిలోమీటరు దాక దుమ్మునూ, ఇసుకనూ, రాతి ముక్కల్నీ సేకరిస్తూ కనిపించారు. (వీరిలో ఇద్దరైతే తమ పని గురించి 3 నిముషాల పాటు అనర్గళంగా ఇంగ్లీషులో నాకొక వివరణ ఇచ్చారు కూడ!)

          మిగిలిన వారి వీధి పారిశుద్ధ్య ప్రయత్నమంతా విజయవాడ దారిలో నిన్ననే శుభ్రపరిచిన కోట మలుపు నుండి చెరువు దాక జరిగింది. ముఖ్యంగా పాల విక్రయకేంద్రం, పంచాయతి భవనం వెనుక, స్వగృహ హోటల్ ప్రాంతాల్లో ఇసుక - దుమ్ము ఎక్కువగా వచ్చింది.

          ‘గరిష్ఠ సామాజిక ప్రయోజనం’ అనే సూత్రమొకటి ఎకనమిక్స్ లో ఉందట – ఏ పని వల్లనైనాగాని తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి ఎక్కువ లబ్ది జరగాలని! కార్యకర్తల శ్రమదానంలో తరుచూ ఆ సూత్రం అమలు జరుగుతుంటుంది!

          కార్యకర్తలు సమీకరించేది ఎందుకూ పనికిరాని - వీధి ఆహ్లాదాన్ని నష్టపరిచే దుమ్మూ - ఇసుకా, రాళ్లూ రప్పలనుకొంటే - అందులో చాల భాగం అగ్రహారం వీధి సిమెంటు రోడ్డు మార్జిన్ గుంటల పూడికకు అక్కరకొచ్చింది!

          నేటి కార్యకర్తల్లో మరీ తక్కువ వయస్కురాలు ‘మీసేవ’ నిరంజన్ గారి ఎనిమిదేళ్ల కుమార్తె కావ్య మహిక!

          వచ్చేపోయే వాళ్ళు గాని, దగ్గరి షాపుల వారు గాని శ్రమదానంలో పాల్గొనలేదుగాని, కార్యకర్తల శ్రమ పట్ల గౌరవాభిమానాలు మాత్రం కనపడినవి!

          నేటి సమక్షా సమయంలో సింహభాగం నిన్న చల్లపల్లికి వచ్చిన పర్యావరణవేత్త, చెత్త నుండి సంపద శిక్షణానిపుణుడు, 24 రాష్ట్రాలకు సలహాదారు - శ్రీనివాసన్ గురించే! చల్లపల్లిని శీఘ్రమేవ ఒక ఆదర్శ గ్రామంగా మార్చాలనే ఆతని పట్టుదల గురించే!

          నేటి స్వచ్చోద్యమ నినాద ప్రదాత వేముల శ్రీనివాస్.

          రేపటి వేకువ మనం కలువదగిన చోటు - విజయవాడ రోడ్డులోని శివాలయ ప్రాంతం!

          జయం సూచన తెలుస్తున్నది!

స్వచ్ఛ - శుభ్రత నిలుపుకొంటూ ఊరు కొంచెం మారుతున్నది

కార్యకర్తల శ్రమకు గ్రామం కృతజ్ఞత చూపించుచున్నది

“శ్రమ మూల మిదం జగత్” అను సామెతకు గౌరవవం ఉంటది

స్పచ్ఛ - సుందర ఉద్యమానికి జయం సూచన తెలుస్తున్నది!

- నల్లూరి రామారావు

   09.02.2024