3026వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

29+13 మందితో చెత్త కేంద్రంలో పని - @3026*

            శనివారం( 10.2.24) వేకువ 2గంటల పాటు - ఊరికి 2-3 కిలోమీటర్ల దూరాన చిల్లల వాగు ఒడ్డున - కదల్చక ముందే క్రుళ్లు కంపు వేస్తున్న డంపింగ్ కేంద్రంలో  చెత్త విభజన కృషిని చూస్తుంటే ఒళ్లు జలదరించింది! (అక్కడ గుట్టల కొద్దీ డైపర్లు, కుళ్ళుతున్న మాంసపు ముక్కలూ వగైరా)

            ఏడెనిమిదేళ్ళ క్రితం ఇక్కడ నెలల తరబడి జరిగిన చెత్త- శ్మశాన పునరుద్ధరణ కృషిని కొందరు  గుర్తు చేసుకొన్నారు. ‘దాంతో పోలిస్తే ఇదేమంత కష్టంలే’  అని కూడ అన్నారు తప్ప విసుగూ, నిస్పృహ, ఎవరిలోనూ కనపడలేదు!

            ఆరేడుగురు గౌరవనీయ మహిళలు వరుసలో కూర్చొని, ఇంటి వద్ద ఏ పిండి వంటలో చేస్తున్న ఊహ! నా చిన్నతనంలో-   మా పొలంలో పొగాకును ఇలాగే దండగా గుదిగుచ్చే సన్నివేశం గుర్తొచ్చింది!  ఎక్కడైనా - ఎవరైనా తమ ఊరి అవసరార్థం ఇంత నిష్టగా పని చేస్తారా?  అనే సందేహమూ కలిగింది!

            సామాజిక అభ్యుదయ కరమైన చల్లపల్లి శ్రమదానం ఎందుకు అనితర సాధ్యమయిందో నేటి 2 గంటల  పనులు చూస్తే ఎవరికైనా ఇట్టే తెలిసిపోతుంది!

            +13 మంది - అంటే? వాళ్ళు పంచాయతీ కార్మిక సోదరీ సోదరులు, అధికారులు, పాలకులు అన్నమాట!

            - చెట్లను సుందరీకరించారన్నా,

            - రోడ్లపైకి చొచ్చుకొస్తున్న చెత్తను నెట్టి క్రమపరచారన్నా,

            - కొందరు చెత్త సంపద కేంద్రం ప్రక్క గడ్డీ - పిచ్చికంపా - కసవుల్ని శుభ్ర పరచినా,

            అందరి ఉమ్మడి లక్ష్యమూ ఒక్కటే- తమ ఊరు మరింత సౌకర్యవంతంగా,  ప్రజల మనసులు ఆహ్లాద భరితంగా వర్ధిల్లాలనే!

నేటి సమీక్షా సమయంలో:

            ముమ్మారు స్థిమితంగా స్పచ్ఛ – సుందరోద్యమ నినాదాలు చేసిన నాయుడు మోహనుల వారే స్వకష్టార్జితమైన 500/- ట్రస్టు ఖర్చుల నిమిత్తం సమర్పించిరి.

            శ్రీనివాసన్ గారి పని వేగమూ, చల్లపల్లిని మరింత సమూలంగా మార్చి,‘అంబికాపూర్’ వలే తీర్చిదిద్దాలనే తపనా చర్చనీయాంశము లైనవి!

            రేపటి వేకువ కూడ ఈ క్రుళ్ళు కంపు పనుల కోసం ఇదే చెత్త కేంద్రం వద్దనే కలవాలని సంకల్పించుకొనిరి !

    శ్రమ మూల్యాంకన మెవరిది?

ఎవ్వరు రోడ్లెక్కగలరు వేకువ నాల్గింటికే?

ఏమహిళలు శ్మశానమున ఇంతగా శ్రమిస్తుందురు?

ఉమ్మడి జనహితం కోరు ఉద్యమాలు ఎవరివి?

3వేల నాళ్ళ శ్రమ మూల్యాంకన మెవరిది?

- నల్లూరి రామారావు

   10.02.2024