3027 వ రోజు.... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

రాష్ట్రమంతా కదలి వచ్చి చూడదగిన శ్రమదానం! - @3027*

         అది 11-2-24 ఆదివారం వేకువ సమయానిది; ఎక్కడంటే - చల్లపల్లి డంపింగ్ కేంద్రం దగ్గరది; ఆడా - మగా, చిన్నా పెద్దా తమ స్థాయిని వదులుకొని, ‘తమ ఊరి అత్యుత్తమ భవితవ్యం అనే ఒకేఒక ఎజెండాతో – చాలా చోట్ల పారిశుద్ధ్య కార్మికులే ఇష్టపడని – కడపుల్లో దేవే కంపుల మధ్య 44 మంది ఇష్టపడి నెరవేర్చిన సామాజిక బాధ్యత అది!

         శ్రీనివాసన్ గారు దగ్గరుండి చూసి, ఆశ్చర్చపడి చెప్పినట్లు – ‘ఉదయం 8 లోపు నిద్రమంచాలే దిగని ఈరోజుల్లో -ఇందరు శ్మశానం దగ్గర – 4:20 – 6:20 నడుమ ఇంతటి ఆదర్శ శ్రమదానం జరగడం ఒక అద్భుత పరిణామం కాదా?

         క్రుళ్లు దుర్గంధంలో - ఈగల, దోమల హడావిడి నడుమ -  10 రకాల ప్లాస్టిక్, బయోవ్యర్ధాల్ని – అదేదో పెళ్ళి పనుల్లాగా విడగొట్టి ఏరుతున్న దృశ్యం సమాజం పట్ల ఏకొంచెమైనా పట్టింపున్న వాళ్లకెంత ఆకర్షణీయమో కదా!

         ఈ 40 మంది స్వచ్ఛ కార్యకర్తలు పని ముగించాక - ట్రస్టు కార్మికులో, ఈ వాలంటీర్లలోనే కొందరో మళ్ళీ వస్తారు - ఈ చెత్త కేంద్రం దగ్గర వేకువ 4.10 నుండి రాత్రి 7-8 దాక పని ఆగదు.

         ఈ పూట పని ముగించి, ఇళ్లకెళుతూ “అసలీ చల్లపల్లికి స్వచ్ఛ దేవ దూతల్లాగా ఇద్దరు డాక్టర్లు దొరకడమే అదృష్టం అనుకొంటే - ఈ శ్రీనివాసన్ చూపు ఈ ఊరి మీద పడటం మరీ అదృష్టం” అని ఇద్దరు కార్యకర్తలనుకోవడం విన్నాను!

         ఐతే - ఈడాక్టర్లేమో “అదృష్టం చల్లపల్లిది కాదు - సమాజం పట్ల బాధ్యత ఈ మాత్రం తీర్చుకొనడమూ, ఇందరు కార్యకర్తల అభిమానమూ మా అదృష్టం” అనుకొంటున్నారు!

         శ్రీనివాసన్ సంగతంటే – “చెత్త నుండి సంపద సృష్టించే, అవకాశమున్న – బాధ్యత గల ఇందరు గ్రామస్తులున్న చోటు దొరకడమే తన అదృష్టమనుకొంటున్నట్లున్నది. 100 మైళ్ళ వేగంతో పని చేసుకుపోవడం తప్ప – అతడివన్నీ ఆలోచిస్తాడా?

         6:30 దాటాక - తుది సమావేశం నాందిగా రిటైర్డ్ టీచర్ రమ గారు స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలిచ్చి, నేటి శ్రమదానం పట్ల, ఆశావహమైన గ్రామ భవితంవ్యం పట్ల కాస్త భావోద్వేగం పొందారు.

“శ్రీనివాసన్ గారైతే – తన 4 నిముషాల ప్రసంగంలోనే –

- రేపు మధ్యాహ్నం పంచాయతిరాజ్ రాష్ట్ర పాలకవర్గం చల్లపల్లి వస్తున్న సంగతినీ,

- చెత్త నిర్వహణలో దేశం మొత్తం మీద పట్టణ ప్రాంతంలో అంబికాపూరు, గ్రామీణ భారతంలో చల్లపల్లి తనకు అనువైనవిగానూ తెల్పి, 6 నెలల్లో చల్లపల్లి ముఖ చిత్రమెలా మారబోతున్నదో చెప్పారు.

         ప్రతి నెలా వలెనే ఫిబ్రవరి మాసానికి కూడా శంకర శాస్త్రి గారి 5,000/- విరాళం ‘మనకోసం మనం’ ట్రస్టుకు అందినది.  

         నేడూ, రేపూ, పగటి వేళ కూడా మన కర్మక్షేత్రం చెత్త కేంద్రమే అని ప్రకటించారు.

         ఎందుకు ఈ ఒక్కచోటె

ఎందుకు ఈ ఒక్కచోటె ఇన్నేళ్లుగా శ్రమ వింతలు?

మరెక్కడా లేనంతగ మానవ విలువల జాడలు?

ప్రతి వేకువ గ్రామ ప్రగతి రాచబాటలో పరుగులు?

చెమట క్రక్కు ముఖాలలో చిదానంద సరిహద్దులు?

- నల్లూరి రామారావు

   11.02.2024