3028* వ రోజు.... ....

 

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

                              3028 * వ విడత సామూహిక శ్రమ సందడి!

         సోమవారం (12-2-24) కూడ 30(+14) మంది శ్రమ దాతల పెను ప్రయత్నం శ్మశానం దగ్గరి దహన వాటికల ప్రక్కన జరిగింది. వేకువ 4. 15 - 6.15 ల మధ్యస్థ 2 గంటల (మొత్తం 60 కి పై బడిన పనిగంటల) కష్టం ఇందులో ఏ ఒక్కరి సొంతానికీ  కాదు -  కేవలం గ్రామ సౌకర్య - సౌభాగ్యాల కోసమే!  కాస్త రూపు మార్చుకొన్నది గాని, పదేళ్ళ నుండీ – లక్షల కొద్దీ శ్రమ గంటల ఈ బృహత్ప్రయత్నం చల్లపల్లిలో ఒక నిర్విరామ ప్రక్రియే!

         గత 3 రోజుల క్రుళ్లు కంపు వ్యర్థాల విభజన కార్యక్రమం కాక - ఈ వేకువ జరిగింది  పచ్చి, ఎండుటాకుల – సన్న పుల్లల సేకరణా, వాటిని 4 x 6 x 12 అడుగుల దిమ్మెలుగా మార్చే పని.

         దానికదనంగా ఆరేడుగురు చిందర వందరగా పడి ఉన్న పేవర్ రంగు రాళ్లను అందంగా పేర్చుట. (ఈ పని ముగిసి, అక్కడ చీపుళ్లతో ఊడ్చి గాని వాళ్లు 6.25 కు మాత్రమే తమ శ్రమ విరమించారు!)

         ఇతర వ్యర్థాలైతే 10 మంది డిప్పల్తో అందించడమూ, ట్రాక్టర్లో గంటన్నర పాటు ఒక 62 ఏళ్ల యువకుడు వాటిని అణగ ద్రొక్కి  సర్దడమూ (- అతని కాళ్లకు ఎండు పుల్లలూ, ముళ్లూ గ్రుచ్చుకొనడం షరా మామూలే!)  

         ఒకే చోట బోర్లించిన డిప్పలే సముచితాసనాలుగా ఇద్దరు మహిళలు గంటకు పైగా కూర్చొని పనిచేయడం చూశాను!

         స్వచ్ఛ కార్యకర్తల సంగతలా ఉంచి, నిన్నా- మొన్నా పంచాయతీ అధికారులూ, కార్మికులూ ఎంత తెగించి కష్టిస్తే అక్కడ డంప్ చేయబడిన వ్యర్ధాల గుట్టలు కొలిక్కి వచ్చాయో ఊహించండి.

         ఇంత మంది శ్రమ వీరుల్లో ఎవరి కృషి తక్కువని ? ఎవరి పట్టుదల ఆదర్శం కాదని? ఎంత అభినివేశం లేకపోతే, గ్రామ సామాజిక బాధ్యత లేకుంటే ఈ 31 మంది ఇంత చలిలో-  మంచులో వేకువ 3.30 కే  మంచాలు దిగి 4.15 కే 3 కిలోమీటర్ల దూరాన శ్మశానం దగ్గరికి వచ్చి శ్రమిస్తారు?

         6.40 కి స్వచ్ఛ కార్యకర్తల తరపున ఊరి స్వచ్ఛ- సుందరీకరణ నినాదాలను ప్రకటించిన వారు తూము వేంకటేశ్వర మహాదయులు, మన శ్రమదాన పంథాను రాబోవు 10-20 – 30  రోజులకూ వివరించిన వారు DRK మహాశయులు!

         ఈ సాయంత్రం 4:00 కు విజయవాడ నుండి ముగ్గుర్నలుగురు పంచాయతి రాజ్ కార్యదర్శులు, కలెక్టర్ లు  వచ్చి పాల్గొనే - గ్రామానికత్యంత కీలకమైన సమావేశానికి - కనీసం ఇంటి కొక్కరు గ్రామస్తులైనా రావాలని ఆహ్వానించిన వారు కార్యకర్తలు!

         చల్లపల్లి ప్రత్యేకతను, చైతన్యాన్నీ రాష్ట్ర స్థాయికి చాటి చెప్పేందుకు అందరమూ ఈ సాయంత్రం చిల్లల వాగు వద్ద కలుద్దాం!

         రేపటి మరింత మందిమి కలిసి  శ్రమించి, చెత్త నుండి సంపద సృష్టించే ప్రదేశం చిల్లల వాగు ప్రక్క తరిగోపుల ప్రాంగణమే!

       స్పందించని వారి కొరకు

జనం విశ్రమించు వేళ శ్రమ జీవన విలాసమా!

స్పందించని వారి కొరకు పారిశుద్ధ్య వినోదమా!

3 వేల దినాలుగా ఒక మొక్క వోని ధైర్యమా!

స్వచ్చోద్యమ చల్లపల్లి సాధించిన విజయమా!

- నల్లూరి రామారావు

   12.02.2024