రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి!....

 రండి! “స్వచ్ఛ సుందర చల్లపల్లి” కోసం కదలి రండి!

పెద్దలకు, మిత్రులకు నమస్కారములు,

             అందరి సహకారంతో గత పదేళ్లుగా జరుగుతున్న “స్వచ్ఛ చల్లపల్లి” ఉద్యమం వలన గ్రామంలోని కొన్ని ప్రాంతాల రూపురేఖలు మారడం మనందరకూ తెలిసినదే. ఐతే పరిశుభ్రత విషయంలో మనం సాధించవలసినది ఎంతో ఉంది. నాగరీక సమాజంలో ఇంకా రోడ్ల ప్రక్కన చెత్త చూడడం దుర్భరం కదా!   

            ప్రతి ఇంటి నుండి తడిచెత్త, పొడి చెత్త విడివిడిగా సేకరించవలసిందే. తడిచెత్తను కంపోస్ట్ గా చేసి ఎరువుగా వాడాలి. పొడి చెత్తను మళ్ళీ అనేక రకాలుగా విభజించి రీసైకిలింగ్ కు పంపాలి. దీని వలన గ్రామం అంతా శుభ్రంగా ఉండడమే కాకుండా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చి వారి కుటుంబాల ఆదాయం, పంచాయితీ ఆదాయం కూడా పెరుగుతుంది.

            చల్లపల్లి గ్రామాన్ని “Zero waste” గ్రామంగా చేయడానికి సహకరించవలసిందిగా ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. పంచాయతీ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారైన “రాజశేఖర్ IAS” గారు, స్వచ్చాంధ్ర కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన “గంధం చంద్రుడు IAS” గారు వెంటనే స్పందించి Clean Andhrapradesh కోసం రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడైన ప్రఖ్యాత పర్యావరణవేత్త “వెల్లూరు శ్రీనివాసన్” గారిని పంపినారు. వారి ఆధ్వర్యంలో గత 3 రోజులుగా చెత్త సేకరణ, నిర్వహణలో సమూలమైన మార్పులను గ్రామ పంచాయతీ చేపడుతోంది. మనకోసం మనం ట్రస్టు, స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు సహకరిస్తునారు.

            ప్రతి వార్డులోనూ ఖాళీగా ఉన్న భవనాలలో గానీ, స్థలాలలో గానీ ఆ వార్డులో సేకరించిన చెత్తను విభజించి రీసైకిలింగ్ కి పంపే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలి. దీనివలన డంపింగ్ యార్డు యొక్క అవసరం కూడా ఉండదు. ప్రతి రోజూ ప్రతి ఇంటి నుండీ ఉదయం, సాయంత్రం రెండు సార్లు చెత్తను విడివిడిగా సేకరించే కార్యక్రమాన్ని చేపట్టాలి. ప్రతి ఇంటి వారు బాధ్యతగా తడి చెత్త, పొడి చెత్త విడివిడిగా పంచాయతీ వారికి అందజేయాలి. ఇది శ్రీనివాసన్ గారు చత్తీస్ ఘడ్ లోని “అంబికాపూర్” లో విజయవంతంగా చేపట్టిన కార్యక్రమం. పది లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో “అంబికాపూర్” Cleanest City గా ఎన్నికైనది.   

            ఇవన్నీ చేయాలంటే కేవలం గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులు సరిపోరు. అదనంగా దాదాపు 140 మంది ఉద్యోగస్తులు కావాలట. రీసైకిలింగ్ కు పంపవలసిన చెత్తను అమ్మడం ద్వారా ఈ ఉద్యోగస్తులకు నెలకు 9 వేలు వరకు జీతం ఇవ్వవచ్చని వారు చెబుతున్నారు.

            మనందరం బాధ్యతగా మన ఇళ్ళ నుండి విడివిడిగా చెత్తను ఇవ్వడం ఈరోజే ప్రారంభిద్దాం. మన వార్డులలో ఉన్న ఇంటి వారందరికీ ఏ బుట్టలో ఏది వేయాలో అవగాహన కల్పిద్దాం. అన్నీ కలిపి ట్రాక్టర్లో తీసుకొచ్చిన చెత్తను ఇప్పుడు డంపింగ్ యార్డులో పంచాయతీ ఉద్యోగస్తులు, స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలు, మనకోసంమనం ట్రస్టు ఉద్యోగులు మళ్ళీ విడివిడిగా విభజిస్తున్నారు. కుళ్ళిపోయిన ఆహార పదార్ధాలు కంపు కొడుతుంటే ఇలా చేయడం చాలా కష్టమైన పని. ఈ పని చేస్తున్న వారందరికీ నమస్కారములు.

            రెండు పూటలా చెత్త సేకరిస్తే వాసన వచ్చే అవకాశం లేదని శ్రీనివాసన్ గారు చెబ్తున్నారు.12 గంటల తర్వాత మాత్రమే కూరగాయలు, ఆహార పదార్ధాలు కుళ్లటం మొదలై వాసన వస్తుందట. ఈ కార్యక్రమం ఒక గాడిన పడడానికి పట్టే సమయంలో అన్ని తరగతుల ప్రజల సహకారం కావాలి. చదువుకున్న వారమంతా వాలంటీర్లమవుదాం.

            Zero waste management”గురించి మేము మాట్లాడుతుంటే శ్రీనివాసన్ గారు “No! No! Eco Friendly Challapalli” కావాలి అన్నారు. అంటే ఏమిటని మేము అడిగాం. ఒక్క దోమ కూడా ఊళ్ళో ఉండకూడదు. అప్పుడు Eco Friendly అనే మాట వాడాలి అన్నారు. సాధ్యమేనా అని అడిగితే ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ఎదురు ప్రశ్న వేశారు. ప్రతి మురుగు కాల్వలో మురుగు నిల్వ కాకుండా చూస్తే దోమలు పెరగవని చెప్తున్నారు. ఇబ్రహీంపట్నం వద్ద గల ‘జూపూడి’ అనే గ్రామంలో మురుగు కాల్వలన్నింటినీ తోటలు వలె చేసిన ఫొటోలను, వీడియోలను చూపించారు. Waste Management ఒక గాడిన పడిన తర్వాత ఈ మురుగు కాల్వల సంగతి చూద్దాం అన్నారు.

Now or Never :           

మిత్రులారా,

            ఈగలు, దోమలు, రోడ్ల ప్రక్కన చెత్త లేకుండా ఇరువైపులా పచ్చని చెట్లతో, రంగురంగుల పూలతో అలరారే చల్లపల్లిని ఊహిద్దాం.    

            ఇప్పుడు కనుక మనం ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటే మళ్ళీ ఎప్పటికీ వస్తుందో తెలియదు కనుక మనందరం వలంటీర్లమవుదాం. “స్వచ్ఛ సుందర చల్లపల్లి”ని సాధిద్దాం 🙏🙏🙏                                       

            “ఎంత అద్భుతంగా రచించబడిన కార్యక్రమమైనా ప్రజల పాత్ర లేకుండా విజయవంతం కాదు” – మెగసెసే అవార్డు గ్రహీత అయిన డా. రజనీ కాంత్ అరోలీ చెప్పిన మాట ఇది.

- డా. డి.ఆర్.కె. ప్రసాదు

   డా. పద్మావతి

   10.02.2024.