3029* వ రోజు.... ....

  పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

కార్యకర్తల నేటి పనిలో మార్పు - @3029*

         మంగళవారం వేకువ పని వేళలో మార్పులేదు గాని, పని రాక్షసుడి తర్ఫీదు వల్ల ఒంటికి పని తగ్గి, చెవులకూ –తలకూ శ్రమ పెరిగింది. శ్రీనివాసన్ డెమో ముగిసేప్పటికే 6:20 దాటింది.

         ఎక్కడో రాయవెల్లూరుకు చెందిన ఒక తమిళ వీరుడు దేశవ్యాప్తంగా కాలికి బలపం కట్టుకొని తిరుగుతూ తిండీ తిప్పలు పట్టక - దేశానికి పట్టిన వేస్ట్ (వ్యర్ధాలు) అనే శని విరగడ చేస్తూ - ఆ శనినే రిసోర్స్ (ఆదాయ వనరు) గా మారుస్తూ - సదరు ప్రయత్నంలో చల్లపల్లిని ఒక మోడల్ గ్రామంగా - గ్రామీణ భారతానికి తొలి ఆదర్శ గ్రామంగా మార్చే పట్టుదలను ఈ వేకువ చూశాను.

         దేశంలోని అత్యధిక (24) రాష్ట్రాలకు సలహాదారుడేంటీ - ఈ రాష్ట్రంలో ఒక మారుమూల గ్రామంలో - శ్మశానంలో, డంపింగ్ కేంద్రంలో వేకువ 4:30 కే ఇంత చలీ - మంచులో కూర్చొని వ్యర్ధాలను విభజించి, సంపద సృష్టించడంలో స్వచ్ఛ కార్యకర్తలకు శిక్షణ నీయడమేమిటీ?

         చల్లపల్లిలో గత ఐదారు రోజులుగా పరిణామాలను చూస్తుంటే – స్వచ్ఛ చల్లపల్లి నిర్మాణం ఒక నిర్ణయాత్మక దశకు చేరినట్లనిపిస్తున్నది!

         దీని దుంప తెగ - చల్లపల్లి ప్రత్యేకత ఎప్పుడూ ముందు వరసలోనే ఉంటున్నది చూడండి!

- ఎక్కడైనా కష్టపడి ఊళ్లలో డింపింగ్ యార్డులు నిర్మించి ప్రారంభిస్తారు, కాని ఈ ఊళ్ళోని చెత్త కేంద్రాన్ని పెద్ద పెద్ద జిల్లా-రాష్ట్ర అధికారుల సాక్షిగా ఈ ఊరి సర్పంచే స్వయంగా-శాశ్వతంగా మూసేశారు!

- ఇక్కడేవో కోలారు గనులున్నట్లుగా ఒకప్పటి ముఖ్యమంత్రీ, కేంద్రమంత్రులూ, ఇతర ప్రముఖులూ సందర్శించారు!

- అదేంటో తీర్ధయాత్రలకన్నట్లుగా 3030 రోజులపాటు వేకువ శ్రమదానానికి 30-40-50 మంది సామాజిక శ్రమదాతలు నిష్టగా వెళ్తారు!

         ఇక ఇప్పుడైతే – పదేళ్ల శ్రమదానోద్యమం తర్వాత – చెత్తకేంద్రరహిత గ్రామంగా, పశువులు వీధుల్లో కనిపించని – పేడలేని – మురుగు లేని – దోమలు ఈగలు కనిపించని - పనికిరాని చెత్త నుండి సంపదను పిండుకొనే మోడల్ విలేజిగా ఈ కార్యకర్తలూ, ఆ తమిళ స్వాప్నికుడూ చల్లపల్లిని మారుస్తారట!

         ఇవన్నీ స్వప్నాలనుకొనేరు - శ్రీనివాసన్ ఛత్తీస్ ఘడ్ కు చెందిన ‘అంబికా పూర్’ ను చేసి చూపించి, చల్లపల్లిని పరిశీలించి, ఇదే ఇక తన ప్రయోగకేంద్రంగా ఎన్నుకొన్న యదార్ధం సుమా!

         కాస్త సంకోచంగా పైడిపాముల రాజేంద్ర ముమ్మారు చెప్పిన శ్రమదానోద్యమ నినాదాలతోనూ,

         రేపటి వేకువ సంతలోని చేపల దుకాణాల వద్ద మన శ్రమదానమనే నిర్ణయంతోనూ - నేటి ఉషోదయ కార్యక్రమ పరిసమాప్తి!

         ఆ మహాత్ముల కంజలిస్తాం

ఊరి వెతలకు సకాలంలో ఉద్యమించిన బాధ్యులెవ్వరొ

పాయిఖానా బజార్లను పూదోటలుగ మార్చినది ఎవ్వరొ

క్రమం తప్పక హరిత సంపద పెంచి పోషిస్తున్నదెవ్వరొ

ఆ మహాత్ముల కంజలిస్తాం గ్రామ భవితను స్వాగతిస్తాం!

- నల్లూరి రామారావు

   13.02.2024