3030* వ రోజు.... .......

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

బుధవారం నాటి స్వచ్ఛ వీరుల పనికవళికల్ని గమనించండి - @3030*

         14 - ఫిబ్రవరి అదేదొ వాలంటైన్స్ ప్రేమ పండుగట! 33 గ్గురు చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకు మాత్రం 3030* వ సామాజిక శ్రమ పండగ! ప్రేమల్లో, ప్రేమికుల్లో సంగతేమో గాని - ఈ గ్రామ ప్రయోజనకర శ్రమలో మాత్రం బొత్తిగా స్వార్ధం లేదు!

         భారీ మంచు - చలిలో, సంతలో నిరుపయోగంగా పడున్న చేపల అమ్మకం బిల్డింగు ఎదుట, ఎగుడుదిగుడు చోట, పెద్ద గుంటలో, గుంట చుట్టూ, ఒకామైతే ఇరుకు సందుల్లో 4:20-6:20 మధ్య జరిపిన కృషిని ఎలా వర్ణించాలి?

         ఇళ్ళలో వెచ్చగా పడుకోక ఇందరు గృహిణులు, వయోధికులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపారులు తగుదుమమ్మా అని గడ్డి పీకడమూ, అన్ని రకాల చెత్త లేరడమూ, పిచ్చి చెట్ల పనిపట్టడమూ, వీటన్నిటిని పది రకాలుగా విభజించడమూ, గొర్రుల్తో ప్రోగు చేసిన వ్యర్థాల్ని ట్రాక్టర్లో నింపడమూ......అసలిదంతా పదేళ్లుగా చల్లపల్లికి జీడిపాకంలా పట్టిన అదృష్టమో, ఈ 30 కి పైగా మందికి గ్రామ సామాజిక సేవా అవకాశమో!

         డాక్టర్లైతే మాత్రం, గ్రామ సర్పంచైతే మాత్రం చేస్తున్నది పరమ చెత్త పనైతే - దాన్నింతగా గుణకారం చేసి వ్రాయాలా?” అని ప్రశ్నిస్తే ఏం చెప్పగలం? ‘ఇందరి లక్షోపలక్షల పని గంటల శ్రమతో ఊళ్లో వచ్చిన - వస్తున్న మంచి మార్పును గుర్తించండయ్యాఅంటాం! దయచేసి, ఇంటికొకరు చొప్పున - వార్డు మెంబర్లతో సహా - వీలైనప్పుడల్లా తలొక చెయ్యి వేయమని అభ్యర్థిస్తాం!

         సామాజిక శ్రమతో నిత్యమూ ఆనందించడం కార్యకర్తల వంతు; ఆ నిస్వార్థ శ్రమను దగ్గరగా చూస్తూ, ఉత్తేజం పొందుతూ, తోచిన నాలుగు మాటలు వ్రాయడం నా కర్తవ్యం!

- శ్రీనివాసన్ ను గుర్తుకుతెస్తూ, డిప్పల మద్య ఆశీనుడై వ్యర్ధాల్ని శాస్త్రీయంగా విభజిస్తున్న అదే పేరున్న కార్యకర్తను చూసినా, (ఈయన్ను జూనియర్ శ్రీనివాసన్ అని పేరుపెట్టారు!)

- ట్రాక్టరెక్కి తుక్కును త్రొక్కుతున్న ఒక సంచార వ్యాపారిని పరిశీలించినా,

- గంటసేపు పని చేసి, ఒంట్లో సుగర్ స్ధాయి తగ్గి చెమటలు పట్టి, తక్షణం చాక్లెట్లు చప్పరిస్తూ పని చేసుకుపోతున్న పోస్టల్ ఉద్యోగిని గమనించినా,

- పని విరమణ ఈల మ్రోగుతున్నా చెత్త పనిని మానని కొందర్ని చూస్తున్నా....

         కాస్తంత భావుకత ఉన్న కొంచెం భాషా పరిజ్ఞానం ఉన్న వాళ్లం ఇలా కాక ఇంకెలా వ్రాయగలం?

         కార్యక్రమంలో నేటి నినాదాలు విస్పష్టంగా పలికింది గంధం బృందావన్, ఇంత మంది శ్రమను సమర్పించడాన్ని మరొకమారు ఆశ్చర్యపడింది Dr. DRK,

         ఈ ఉదయం హిందూ శ్మశాన వాటిక ప్రహరీ నిర్మాణ ప్రారంభమట!

         తన వైవాహిక జ్ఞాపికగా కోడూరు వేంకటేశ్వరుని చందా 1520/- 

         ఏదో ఒక వంకతో ఎప్పుడూ స్వచ్చోద్యమానికి విరాళాలిస్తుండే ప్రాతూరి శాస్త్రి మహాశయుల వారు ఈరోజు శ్రమదాన సంఖ్యకు గుర్తుగా 3030/- చెక్కును 'మనకోసం మనంమేనేజింగ్ ట్రస్టీ గారికి అందజేశారు.

         రేపటి వేకువ కూడ మనం శ్రమించే చోటు - సంతలోనే!

         మరీ ఇంత త్యాగగుణము

ఊరి కొరకు వేలనాళ్ల ఉత్తమమగు శ్రమదానము

ఏ స్వార్ధము లేదంటే ఎవరూ నమ్మని కాలము

మరీ ఇంత త్యాగగుణము మన కాలములో ఎరుగము 

అందుకె ఇది జీర్ణించుట కాలస్యము జరుగునేమొ!

- నల్లూరి రామారావు

   14.02.2024

 

తన వైవాహిక జ్ఞాపికగా కోడూరు వేంకటేశ్వరుని చందా 1520/-
ప్రాతూరి శాస్త్రి గారి విరాళం