3031* వ రోజు.... ... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3031* వ నాటి గ్రామ శ్రమదాన చరిత్ర!

         అది 15-2-24 - గురువారం నాటిది. పనిలో దిగి చేసేందుకు కష్టమైనా, ఆసక్తి ఉన్నవాళ్లెవరైనా అనుమాన నివృత్తి కోసమూ, ఆదర్శ సామాజిక శ్రమదానానికి సాక్షీభూతంగానూ, వచ్చి, చూసి, మెచ్చదగినదే!

         వేకువ 4.14 కే దట్టంగా కురిసే మంచులో సంత లోతట్టులో 28 మంది నిర్వహించిన రకరకాల శ్రమవిన్యాసాలతో నిన్న మిగిలిపోయిన చెట్లూ, గడ్డీ, పిచ్చి మొక్కలూ చాల వరకు అదృశ్యమైన ఘట్టం! నేటి కార్యకర్తల పనులు నాకు చాల రోజులెందుకు గుర్తుండి పోతాయంటే:

- అదంతా పశువుల త్రొక్కిడితోగాబోలు ఎత్తు పల్లాల చోటు,

- గత నెలలో వర్షాలకు బాగా పెరిగిన గడ్డి, పిచ్చి తీగలూ క్రమ్మేసిన భాగం,

- పిచ్చి మేడి తెగ పెరిగి చిట్టడవిగా మారిన ప్రాంతం,

- పంచాయతీ తాలూకువి కాబోలు – పనికిరాని వాహనాలు చిందరవందరగా పడున్న స్థలం,

- మంచు విజృంభించిన వేళ - పైన వివరించిన క్లిష్ట పరిస్థితిలో ఇందరి శ్రమ దర్శనీయం కాదూ?

         కత్తుల బ్యాచ్ ఒకటి వెలుతురానని సినిమా హాలు ప్రహరీ ప్రక్కన పిచ్చి చెట్ల గుబుళ్లను నరుకుతుంటే-

         వేప మొక్కల్ని మాత్రం వదలి, మిగిలిన సంత తూర్పు భాగపు పిచ్చి చెట్ల పని ఏడెనిమిది మంది వంతైతే,

         కూర్చొని గడ్డి కోస్తున్నది నలుగురైదుగురైతే –

         వ్యర్ధాలన్నిటిని దంతెల్తో లాగుతున్నది నలుగురూ –

         డిప్పలకెత్తి ట్రాక్టర్ దగ్గరకు చేరవేస్తున్నది కొందరూ –

         ఆ తుక్కును పై నుండి అందుకొని – 2 ట్రక్కుల చెత్తను ఒక్క దాన్లో సర్ది, త్రొక్కినది మాత్రం ఒకే ఒక్కడు!

         చుట్టూ డిప్పలూ - మధ్య ఇద్దరు చెత్త విభజనా నిపుణులూ!

         6:30 సమయానికందరూ అర్థ చంద్రకారంలో నిలిచి, 2 నెలల పిదప పునః ప్రవేశించిన భోగాది వాసు నినాదాలూ, అనుభవాలూ విని,

         నేటి - రేపటి పనుల్ని DRK గారు కార్యకర్తల్తో చర్చించి,

         శుక్రవారం వేకువ అందరూ చిల్లలవాగు గట్టు శ్మశానం దగ్గర కలవాలని నిర్ణయించి, గృహోన్ముఖులైరి!

         దీర్ఘకాల ఉద్యమాలు

పనితత్త్వం తెలియక, తమ ప్రజల పట్ల మమత లేక

జన జీవన స్రవంతిలో స్నానం - పానం చేయక

మంచి - చెడుల మమేకమై మానవ విలువలు తెలియక

దీర్ఘకాల ఉద్యమాలు జయప్రదం కాగలవా?

- నల్లూరి రామారావు

   15.02.2024