3032* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

శుక్రవారం (16-2-24) నాటి సంక్లిష్ట శ్రమదానం - @3032*

         సమయం వేకువ 4:26 - 6.30; స్థలం ఊరి చెత్త కేంద్రం: అక్కడ సంసిద్ధులైన 29 మంది స్వచ్ఛ సైన్యం; చేయబోతున్న పని 99 శాతం ప్రజలు నీచ నికృష్టంగా భావించే పారిశుద్ధ్యం; మొన్న మొన్నటి దాక వాళ్ళెక్కువగా చేసింది వీధి పారిశుద్ధ్యం - గ్రామ సుందరీకరణం – పచ్చదనం; గత ఐదారు నాళ్లుగా వాళ్ల శ్రమ మరింత కష్టతరం!

         నేను చూసిన తొలి దశ్యం - చుట్టూ డిప్పలతో నడుమ పెద్ద చెత్త గుట్టతో 10 మంది బృందం! 10 గజాల దూరంగా ఉన్న నా ముక్కు పుటాలు భరించలేని దుర్గంధం! గ్రామ ప్రయోజనం కోసం బాధ్యతగా తాము చేస్తున్న చెత్త కంపు పని పట్ల వాళ్లకు మాత్రం సంతోషం!

         అక్కడికి కాస్త దూరంగా - మూసేసిన చెత్త కేంద్ర ద్వారం దగ్గర చెత్త ట్రక్కులోనే ఏడెనిమిది రకాల వ్యర్ధాల్ని విడగొట్టి ఒక్కోటి ఒక్కొక్క పెద్ద సంచుల్లో నింపుతున్న కార్యకర్తల పంచకం!

         ఇంత క్రుళ్లు కంపుని తట్టుకోలేని ఒకరిద్దరు మరికాస్త దూరంలో పచ్చి - ఎండు గడ్డిని చెక్కుతూ, ప్రోగులు చేస్తూ ఇంకొక సన్నివేశం!

         5 గురు మహిళలైతే – ఎక్కడే పని అవసరమనుకొంటే – అక్కడికి పరవళ్ళు త్రొక్కుతున్న వైనం! మొత్తమ్మీద –

         వేకువ పూట శ్మశానమంటే భయపడని - క్రుళ్లిన ఆహార వ్యర్ధాల్ని చేతుల్తో తిరగేసేందుకు వెనుకాడిని – తమ సామాజిక హోదాలు గుర్తుండని - చిల్లర చెత్త పనులకు సిగ్గుపడని - తమ ఊరును 4 నెలల్లోగా దేశానికంతటికీ మార్గదర్శకం చేసి చూపాలనే తపన గల అరుదైన కార్యకర్తల సమూహాన్ని గంటసేపు అలా చూస్తుండిపోయాను!

         పదేళ్లుగా ఎన్నో కఠిన సవాళ్ళనెదుర్కొన్న చరిత్రవేఱు, ఈ నాలుగైదు నెలల క్రొత్త బాధ్యతల అగ్ని పరీక్ష వేఱు! చెత్త విభజన క్రొత్త బాధ్యతనెదుర్కొంటున్న కార్యకర్తల తీరు, ,మంచూ – చలీ వంటి ప్రతికూల వాతావరణం మధ్య చకచకా జరిగిపోతున్న పనీ చూస్తుంటే - ఈ చివరి సవాలును కూడ తేలికగా అధిగమిస్తారనే అనిపిస్తున్నది!

         6:45 కు సమీక్షా సభలో కోడూరు వేంకటేశ్వర కార్యకర్త శ్మశానం అదిరిపడేలా కసిగా పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలూ, షణ్ముఖ శ్రీనివాసన్ సమర్పించిన 500/- విరాళమూ,

         ‘శనివారం వేకువ సైతం మన శ్రమదాన క్షేత్రం చెత్త సంపద కేంద్రం వద్ద’ అనే నిర్ణయమూ!

         ఆత్మన్యూనత సైతం

గ్రామ వీధి శ్రమకు దిగిన కార్యకర్త ఏ ఒకరిని

పరిశీలించిన చాలును వికసిస్తది మానసం

వారి ముందు చిన్నబోవు పరిస్థితికి జారిపోయి

ఆత్మన్యూనత సైతం ఆవహించు నాక్షణం!

- నల్లూరి రామారావు

   16.02.2024