3041* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

                           3041* వ వేకువ శ్రమదాన సంగతులను చిత్తగించండి!

         అంటే- అది ఆదివారం(25.2.24) జరిగినది; కష్టాన్ని ఊరి కోసం ధారపోసిన 24 మందిలో ఆరేడుగురు ట్రస్టు లేదా ఆస్పత్రి ఉద్యోగులు కాక అత్యంత నిక్కచ్చి శ్రమదాతలు 17-18 మంది!

         శ్రమ సంఘటనా స్థలం నా ఇంటికి 3 కిలోమీటర్ల దవ్వున చిల్లల వాగు గట్టున మూతపడిన చెత్తకేంద్రం!  సమయం 4.20 - 6.20 కి పరిమితం!

         మరి - ఇందరి 45 కు పైగా పనిగంటల కంపుగొట్టే చెత్తపని ఏం ఒరగ బెట్టింది? ఎవరినెంత వరకు ఉద్దరించిందంటే:

- దశాబ్ద కాలంగా లక్షోప లక్షల పనిగంటల సముచిత సామాజిక శ్రమ వేడుక అడవిగాచిన వెన్నెలో, బూడిదలో దిమ్మరించిన పన్నీరో కానే కాదు- అది డజన్ల కొద్దీ గ్రామాల, వందల కొద్దీ చైతన్యవంతులకు స్ఫూర్తి నిచ్చింది;

-  కేవలం చల్లపల్లిలో తెచ్చిన పాక్షిక సామాజిక స్పృహే కాదు - జిల్లా- రాష్ట్ర- రాష్ట్రేతర వ్యాప్తంగా వేల రోజుల – మరికొన్ని లక్షల పని గంటల శ్రమతో శాశ్వతంగా కాకున్నా, పరిమిత కాల స్వచ్ఛ- పరిశుభ్రతల్ని ఆయా గ్రామాల్లో తెచ్చింది !

- ఒక సామూహిక శ్రమదానం విసుగు లేకుండ ప్రతి రోజూ గంటన్నర పాటు జరిగితే గ్రామంలో ఎన్నెన్ని మంచి మార్పులు జరిగేదీ తెలిపింది!

- ఒక మేజర్ పంచాయతీకి రాష్ట్ర – జాతీయ - అంతర్జాతీయ, అవార్డుల్నీ-రివార్డుల్నీ, గుర్తింపునీ తెచ్చింది!

- ఒక గ్రామంలో శ్మశానాలు, బస్ ప్రాంగణాలు, కర్మల భవనాలు, చుట్టూ 9 రహదారులు, ఊరి వీధులు, వీధి మార్జిన్లు చెత్త రహితంగా స్వచ్ఛ- హరిత- పరిశుభ్రంగా ఎలా మార్చవచ్చో ఈ 30- 40-50 మంది క్రమం తప్పని శ్రమత్యాగం నిరూపించింది!

          ఎందరెందరో రాష్ట్ర కేంద్ర మంత్రుల్ని, దేశ విదేశ ప్రముఖుల్నీ అనివార్యంగా చల్లపల్లిని దర్శించేలా చేసింది !

         ఈ ఆదివారం శ్రమదానానిదేముంది - ఎప్పటిలాగానే! స్వచ్ఛ కార్యకర్తల్లో చాలమంది ఈ వేకువ పూట శ్రమ ఎప్పుడాగిపోతుందో అనీ,  ఆగితే తమకు శారీరక – మానసికోల్లాసం దూరమౌతుందనీ సందేహిస్తుంటారు!

- ఈ వేకువ కూడ నాలుగైదు జట్లుగా కూర్చొని పరమ ఛండాలమైన కంపు చెత్తని ఏడెనిమిది రకాలుగా విభజించి, ఏరారు;

- అదేంటో ఒక రక్తదానవీరుడు పసిపిల్లల్ని పొదువుకొన్నట్లు దుమ్ము కొట్టుకున్న అరటి కాడల్ని హత్తుకున్నాడు చూడండి!

         - ఊరి ప్రథమ మహిళ ఏవో అంట్లు కడుగుతున్నట్లు కనిపిస్తుందా?

         అసలిందరు కార్యకర్తలకు ఉన్న ఊరి పట్ల ఎందుకంత నిబద్ధతో గ్రహించండి.

ఒక కాంపౌండరుడు నడుంనొప్పిని పంటి బిగువున భరిస్తూనే బరువు పని చేయడం గమనించండి!

ఈనాటి శ్రమదానోద్యమ ప్రతిజ్ఞ వినిపించింది ఆనంద రావు.

         రేపటి వేకువ మనం మరొకమారు కలువదగింది చెత్త కేంద్రంలోనే!

      అంకితులు మన చల్లపల్లికి -3

అయ్యా! బృందావనుడా! అలుపెరుగని శ్రమకారుడ!

వెనుకాడక ప్రతి పనికీ చొరవచూపు ఆద్యుడా!

"ఆల్ రౌండర్" అను బిరుదుకు అత్యంతం అర్హుడా!

ప్రతి పనిలో సొంత బుర్ర వాడుకొనే విజ్ఞుడా!

 

- నల్లూరి రామారావు

   25.02.2024