3042* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3042*వ మారు కూడ చెత్త కేంద్రం వద్దనే!

         సోమవారం (26.2.24) నాడు తమ వేకువ సమయాన్ని తలా 100 నిముషాలు సొంతూరి కోసం శ్రమించిన వారు 23 మంది! శ్రమించడమంటే మరీ కండలు కరిగే బరువు పనులని కాదు గాని, చాల మంది దృష్టిలో పరువు తక్కువ పనులూ, ఘాటు ఘూటు క్రుళ్లు కంపు పనులూ, ఊరికి దూరంగా శ్మశానాన్ని దాటుకెళ్లి చేస్తున్న పనులూ!

         ఐతే ట్రస్టు కార్మికులూ, క్రొత్తగా ఈ పనుల్లో చేరిన వారూ కాక స్వచ్ఛ కార్యకర్తలు గత రెండు వారాలుగా శ్రమించకపోతే చెత్త కేంద్రాన్ని మూసేయడం సాధ్యపడకపోను! రోజుకు 2 మార్లు వార్డుల్నుండి సేకరిస్తున్న చెత్త కొండలుగా పేరుకు పోను! ఘన - ద్రవ వ్యర్ధాల్నుండి సంపదను పిండే ఒక తొలి పైలట్ ప్రాజెక్టు విజయం మీద ఈ మాత్రం నమ్మకం కుదరకపోను!

         ఇంతటి శ్రమ త్యాగమూర్తులు 5 వేల మంది గృహస్తుల్ని ఏం కోరుకుంటున్నారు? తమలాగే చెత్త కేంద్రానికి వచ్చి ఊరి పనుల్లో సహాకరించమనా? వీధుల్ని ఊడ్చి, చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడమనా? సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండమనా?... ఇవన్నీ ఆచరణీయాలే గాని, ఆదర్శ స్వచ్ఛ సుందర చల్లపల్లి పౌరులుగా వారి తక్షణ సహకారం కోరుతున్నది మాత్రం ఒక్కటే!

         హోటళ్ళ వారూ, త్రోపుడు బండ్ల వ్యాపారులూ, గృహస్తులూ తమ వ్యర్ధ పదార్ధాలను నాలుగైదు రకాలుగా విభజించి చెత్త బళ్ల కందిస్తే చాలు - ట్రస్టు ఉద్యోగుల, పంచాయతి కార్మికుల, స్వచ్ఛ కార్యకర్తల శ్రమను అమాంతం 50 శాతం తగ్గించిన వారౌతారు!

         అటు పంచాయతి అధికార - పాలక వర్గీయులూ, ఇటు స్వచ్ఛ కార్యకర్తలూ ఈ మేరకు గృహస్తుల్నీ, వ్యాపారుల్నీ కలిసి విన్నవించాలని ప్రయత్నిస్తున్నారు! ఈ వేకువ శ్రమ విశేషం సంగతి:

- ఇద్దరు తక్కిన చెత్త పనికి దూరంగా – చిల్లలవాగు గట్టు పైనా, లోపలి అంచు బాటనూ బాగుచేశారు;

- ఒకాయన నడుం నొప్పినీ, మరొకామె తలనొప్పినీ భరిస్తూనే క్రుళ్లు కంపు చెత్త పనులు చేసుకుపోయారు;

- అందరి వల్లా ఏడెనిమిది రకాలుగా విడిపోయిన చెత్త ఒక ట్రక్కు!

         రోజుటికన్న కాస్త ముందుగా - అంటే 6 గంటలకే ఠంచనుగా పని ముగించి, జరిపిన సమావేశంలో :

         తమ కిష్టమైన చల్లపల్లి సంస్కరణకు 9 రోజులు దూరమైన DRK గారు శ్రీలంక దేశవ్యాప్త పరిశుభ్రతను, చెత్త సేకరణ పద్ధతినీ వివరించి, గత 9 నాళ్ల కార్యకర్తల నిబద్ధతకు అంజలించి, ఇక ముందు జరగవలసిన శ్రమదానం గురించి సుదీర్ఘంగా చర్చించి,

         రేపటి వేకువ మాత్రం అందరం డంపింగ్ కేంద్రం వద్దనే పని చేయాలని నిర్ణయించారు!

         అంకితులు మన చల్లపల్లికి -4

స్వచ్ఛ - సుందరోద్యమానికాతడు నర్తించగలడు

వ్రాయగలడు – పాడగలడు - కాఫీ త్రాగించగలడు

నందేటి శ్రీనుడు - స్పందనలో ఘటికుడు

ఉద్యమాన్నతని గొంతుక ఊపేస్తుందెప్పుడూ!

- నల్లూరి రామారావు

   26.02.2024