3043* వ రోజు....... ....

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

నేటిది 3043* వ శ్రమ వేడుక!

          మంగళవారం (27-2-24) వేకువ సమయంలో తమ ఊరి దీర్ఘకాల శ్రమ వ్యూహంలో భాగంగా కష్టించిన కారకర్తలు – (అదీ శ్మశానం సమీప చెత్త కేంద్రంలో-) 20+3 గ్గురు! (+తరువాతి సంఖ్య ట్రస్టు కార్మిక సోదరులది).

          పదేళ్ల చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమకారులు ఎక్కడ బయల్దేరి ఎక్కడికి ప్రస్థానించారో అని వెనుదిరిగి చూసేవారు నిబిడాశ్చర్య చకితులు కాక తప్పదు! వీధుల్ని శుభ్ర పరచడం మొదలు, మురుగు కాల్వలకు నడక నేర్పడమూ, గ్రామం చుట్టూ 9 రహదారుల్ని హరిత సుందరీకరించడమూ, రోడ్ల గుంటల్ని సాపు చేయడమూ, 4 ముఖ్య ప్రదేశాల్లో సుందర టాయిలెట్ల ఏర్పాటూ - ఇదిగో చివరకు తెల్లార గట్ల రుద్ర భూమి ప్రక్క డంపింగ్ స్థలంలో ఊరి చెత్తను 6-7-8 రకాలుగా విభజించి, గోతాలకెత్తడం దాకా!

          ఎంతగా సొంతూరి పట్ల మమకారం లేకపోతే – ‘ఈ ఊరు, ఈ గ్రామస్తులు నా సొంతం అనుకోకపోతే - గ్రామ పంచాయతీకి చేయూతనివ్వాలనే సంకల్పం పూనకపోతే - ఈ సామాజిక కర్తవ్య పరాయణుల సేవ 3043* నాళ్లు నడుస్తుందా?

          ఉద్యమాల అనుభవజ్ఞులూ, తలపండిన సామాజిక పరివర్తనా సూక్ష్మ గ్రాహులూ, సున్నిత మనస్కులైన కవి-గాయక-కళామూర్తులూ ఈ స్వచ్ఛ - సుందరోద్యమాన్ని అద్భుతో అద్భుతఃఅనీ, “సూపరో సూపర్" అనీ కవితలల్లుతారు - గానం చేస్తారు విశ్లేషిస్తారు?

          అంతకు ముందు కాక ఈ దశాబ్దకాలంలో ఈ స్వచ్ఛ కార్యకర్తలెంత తపన చెందారో, ఎందరి సలహాలడిగారో, తమ అనుభవాలనెన్ని ఊళ్ళకు పంచారో, ఎందరి సహకారాన్నెంత అభ్యర్థించారో, సఫలతలూ విఫలతలూ ఎదుర్కొని స్థిరపడ్డారో.....అదంతా స్వర్ణాక్షరాలతో వ్రాయదగిన చరిత్ర!

          ఈ మంగళవారం వేకువ శ్రమదానమో - సామాజిక బాధ్యతో వేడుకో గాని - అది 3 లక్షల పని గంటల్లో కేవలం ఒక నీటి చుక్క! చాతనైతే ఆసక్తి ఉంటే స్వచ్ఛ సుందర కార్యకర్తల మనో నిబ్బరాన్ని కొలవాలి! ఆ నిబద్ధతను పరిగణించాలి! బిడియాన్ని గెలచి, బద్ధకాన్ని జయించి, ఈ సామాజిక-సామూహిక-సదాశయానికి రోజూ గంట సమయం కేటాయించాలి!

          చెత్త బండి ఇళ్ల వద్దకు వచ్చినపుడు వ్యర్ధాల్ని రెండో-మూడో-నాలుగో విధాలుగా విడగొట్టి అందిచండి మహా ప్రభోఅని మొత్తుకొనే పంచాయతీ మొరాలకించాలి! అంతిమంగా ఇది నా ఊరు - ఇది మురికిగా, కళాహీనంగా, నిస్తేజంగా ఉంటే అంగీకరించనుఅనే మార్పు ఋజువు కావాలి!

          నేటి స్వచ్ఛ సుందరోద్యమ నినాద ప్రవర్తకురాలూ, నిన్నంతా విజయవాడలోని వ్యర్ధాల వ్యాపారుల్తో సంప్రదింపులు జరిపిన వివరాల్ని తెలిపిందీ గ్రామ సర్పంచి కృష్ణకుమారి గారు.

          రేపటి వేకువ కూడ మన శ్రమదాన ప్రాంతం చిల్లలవాగు గట్టు చెత్త కేంద్రమేనట!

 

          అంకితులు మన చల్లపల్లికి -5

అన్నిటిని కూలంకషంగా ఆత్మ మథనం చేయుచుండుట,

విచక్షణగా - వివేకంగా - వినూత్నంగా అడుగు వేయుట,

గ్రామ హితముకు ప్రాకులాడుట, చెత్త ఏరుచు సంతసించుట

ఇదే షణ్ముఖ శ్రీనివాసుని ఇటీవలి ఒక మంచి ముచ్చట!

- నల్లూరి రామారావు

 

   27.02.2024