3044* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

3044* వ నాడు కూడ చెత్త కేంద్రం వద్దనే!

         బుధవారం(28.2.14) వేకువ సైతం ఊరికి దూరంగా, చిల్లలవాగు గట్టున గల చెత్త సంపద కేంద్రపు 4 రోడ్ల కూడలిలోనే 24+2 మంది శ్రమ సమర్పితం! వీరు కాక చెత్త కొనుగోలుదారులిద్దరు చివరికక్కడ ప్రత్యక్షం!

         చల్లపల్లిలో తప్ప - ఊరికింతదూరాన - ఇంత వేకువ జామున - మంచూ, చలీ పోటీపడుతున్న సమయాన – అదీ భీతి గొలిపే శ్మశానాన్ని దాటుకొని, కంపుగొట్టే డంపింగ్ యార్డు వద్ద ఇందరి ఉనికిని ఏ ఊర్లో చూడగలరు? ఫొటోల కోసమైతే ఏదో ఒకరోజు ఎక్కడైనా ఇలాంటి దృశ్యాలు కనిపిస్తాయేమో గాని, 3 వారాలకు పైగా - పాతిక ముప్పై మంది శ్రద్ధగా చెత్త పనిచేయడం ఈ ఊళ్లోనే – స్వచ్ఛ కార్యకర్తల్తోనే సాధ్యం!

         స్వచ్ఛ – పరిశుభ్ర - సుందరీకరణమో, ఊరి వెలుపల చాల రహదార్లను పుష్ప  హరితాలంకృతం చేయడమో, మురుగు కాల్వల మరామత్తుకు పూనుకోవడమో, ఊరి మేలుకై పంచాయతీకీ, స్వచ్ఛ కార్యకర్తలకీ కాస్త సహకరించమని గ్రామస్తుల్ని అభ్యర్ధించడమో......ఇలాంటివి స్వచ్ఛ చల్లపల్లిలో నిరంతర ప్రక్రియలు! – అదీ దశాబ్దకాలంగా, వేల రోజులుగా, లక్షల పనిగంటలుగా!

         “జై స్వచ్ఛ చల్లపల్లి సైన్యం” వాట్సప్ పాఠక మహాశయులు నేటి వేకువ చెత్త పనుల శ్రమదానం గురించి తెలుసుకొనే ముందుగా, పని ప్రారంభంలో Dr. DRK గారు తీసిన నేటి ‘చెత్త కొండ’, ఫోటోనొకమారు చూడాలని మనవి! స్వచ్ఛ కార్యకర్తలు 3 వారాలుగా చేస్తున్న క్రుళ్లు వ్యర్ధాల విభజన కృషికదొక ఉదాహరణ!

         కార్యకర్తలు ఆ చెత్త అనకొండను చూసి భయపడలేదు. ముగ్గురు తప్ప సుమారిరవైమంది 2 గంటలు శ్రమించి, వ్యర్ధాల గుట్టను కరిగించేశారు. నాలుగైదు బృందాలుగా విడిపోయి, చుట్టూ పీటల పైన కూర్చొని, మధ్యలో ఇద్దరు తెచ్చి పోస్తున్న డిప్పల కొద్దీ చెత్తను తడీ - పొడీ – ప్లాస్టిక్  - గాజు - ప్రాత వస్త్ర – చిత్తు కాగిత - అట్టల వంటి వ్యర్ధాలను విడగొట్టి ఒక్కో డిప్పలో సర్దడం, మరో ఇద్దరా విభజిత వ్యర్ధాల్ని పెద్ద గోనె సంచుల్లో కుక్కడం!

         కొందరదృష్టవంతుల వాటాకైతే బాగా క్రుళ్ళిన కూరల, ఆహార వ్యర్ధాలూ, డైపర్లూ దక్కాయి కూడ!

         తుది సమావేశంలో స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలను గట్టిగా విన్పించింది చల్లపల్లి రక్తదాన కర్ణుడైన కస్తూరి విజయుడు!

         “చెత్తను కనీసం 3 గా విభజించి అందించేందుకు గ్రామస్తుల్నెలా ఒప్పించాలీ, పెరిగిపోతున్న కూలీ ఖర్చుల భారాన్నెలా దించుకోవాలీ, కార్యకర్తల - పంచాయతీ కార్మికుల శ్రమభారాన్నెంత వరకు తగ్గించాలీ” అనే సమస్యల గురించి నిన్న రాత్రి సమావేశపు వివరాల్ని తెలిపింది డాక్టర్ DRK!

         రేపటి వేకువ - చెత్తేతర - రహదారి సుందరీకరణ కృషి కోసం మనం కలువదగింది చిల్లలవాగు దగ్గరి తరిగోపుల ఆవరణంలోనే!

         విజయా కాన్వెంట్ టీచర్ కోటేశ్వరమ్మ గారి (సాగర్ టాకీసు వెనుక) తల్లి గారు వేమూరి జనక మహాలక్ష్మి (93) గారి పెద్దకర్మ కాండలకు (పగలు 12.00) స్వచ్ఛ కార్యకర్తల్ని పిలిచిన వారు గొల్లపూడి ఉదయలక్ష్మి గారు! 

   అంకితులు మన చల్లపల్లికి -6

చల్లపల్లికొక కోడలు స్వచ్ఛ అన్నపూర్ణ

స్వచ్ఛ కుటుంబం గురించి – వాళ్ల తిండి గురించి

స్వచ్ఛోద్యమ అతిథులకు స్వాగతం గురించీ

కాలు దెబ్బతిని కూడా కలవరించుటవసరమా!

- నల్లూరి రామారావు

   28.02.2024