3045* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

మీరు చదవబోతున్నది 3045* వ వేకువ శ్రమ విషయం!

         అది గురువారం - అనగా ఈ 2024 ఫిబ్రవరి మాసాంతానిది; ఇద్దరు ట్రస్టు ఉద్యోగులతో సహా 25 మంది ఔత్సాహికులది; చెత్త విభజనకు విరామమిచ్చి, చల్లపల్లి-వక్కలగడ్డ పంచాయతీల సరిహద్దులోని రహదారి పరిశుభ్రతా చర్య అది!

         కార్యకర్తల్లో విశ్రాంత ఔద్యోగిక పెద్దలతో బాటు అస్పత్రి విధులకు హాజరు కావలసిన కాంపౌండర్లు, నర్సులు, ఉపాధ్యాయులు, రైతులు, వైద్యుడు వగైరాలు! పదేళ్లు గానీ, పాతికేళ్లే పట్టనీ - తమ ఊరి స్వచ్ఛ శుభ్రతలు పెంపొందే దాకా, చెత్త రహితంగా, ఈగలు దోమలకందకుండా, హరిత సుందరంగా, ఆహ్లాదకరంగా, దేశమంతటికొక మోడల్ గా మారే దాకా పట్టు సడలని శ్రమకు సంసిద్ధులు!

         దశాబ్దకాలంగా – వేల రోజుల్నుండీ ఊరి మంచి కోసం జరిగిన కష్టం ఒకెత్తు, ఊరి వార్డుల్నుండి ఇళ్ల వద్దే వ్యర్ధాల్ని 90% విడగొట్టి సేకరించే ఈ 4 వారాల ప్రయుత్న౦ ఇంకొక ఎత్తు! ఎందుకంటే - తన గ్రామస్తుల చైతన్యాన్ని నమ్ముకొని, పంచాయతీ కార్మికుల - ట్రస్టు కష్టజీవుల - స్వచ్ఛ కార్యకర్తల అండజూచుకొని గ్రామ సర్పంచి నలుగురు కలెక్టర్ల, ఉన్నతాధికారుల సమక్షంలో చెత్త కేంద్రానికి శాశ్వత ప్రాతిపదికన మంగళం పాడేశారు గనుక!

         5000 మంది గృహస్తులు తలా మూడ్నాలుగు నిముషాలు జాగ్రత్త పడితే తీరి పోయే చెత్త సమస్య మీద 30  మందికి పైగా క్రొత్త ఉద్యోగులు, పంచాయతి సిబ్బంది, స్వచ్ఛ కార్యకర్తలు రోజంతా శ్రమించడం న్యాయమా?

         అందుకే గ్రామ కార్యదర్శి, శానిటరీ ఇన్స్పెక్టరు, సర్పంచి, స్వచ్ఛ కార్యకర్తలు పగలు వీధులు పట్టుకు తిరుగుతూ, కొబ్బరి బొండాల వారినీ - హోటళ్ల వారినీ దుకాణదారుల్నీ కలిసి చర్చిస్తున్నారు, ఒప్పిస్తున్నారు!

         అందరి సహాయ సహకారాల్లేకుండానే చెత్త నిర్వహణలో గ్రామీణభారతానికి చల్లపల్లి ఆదర్శమౌతుందా?

ఇంతకీ నేటి వీధి పారిశుద్ధ్య వ్యసనపరులు చిల్లలవాగు వంతెన కేంద్రంగా ఏం సాధించారంటే :

- ఏడెనిమిది డిప్పల దుమ్మూ - ఇసుకా - మట్టీ ఊడ్చారు.

- రకరకాల చెత్తల్ని ప్రోగులు చేశారు, వంతెన మీద మట్టి బిగుసుకుపోతే పారలకు పని చెప్పారు.

- తామే నాటి, పెంచిన చెట్ల, పూల మొక్కల నడుమ కలుపుంటే పీకీశారు.

- తమ శత్రువైన ప్లాస్టిక్ వస్తువులే రూపంలో ఎక్కడ పడి ఉన్నా వదల్లేదు.

- వాగు లోతట్టున కూడ పిచ్చి మొక్కల పని పట్టారు.

- ఇద్దరు ముగ్గురు వ్యర్ధాలన్నిటిని డిప్పల్తో మోసి, వంతెన దక్షిణాన గండి పడకుండా పోసి, సర్దారు.

         కాఫీల తర్వాత - 4 కిలోమీటర్ల దూరం నుండి చల్లపల్లి బాధ్యతలకై వచ్చిన మల్లంపాటి ప్రేమానందుని స్వచ్ఛ - సుందర నినాదాలకు బదులిచ్చారు.

         రేపటి వేకువ కూడ ఈ వాగు గట్టుల పరిశుభ్రత కోసం వచ్చి శ్రమించాలనే సంకల్పించారు!

        అంకితులు మన చల్లపల్లికి -7

ఎక్కడైన చూశారా – ఏ గ్రామం సర్పంచైనా

వేకువనే చీపురుతో వీధులూడ్చు విచిత్రాన్ని?

స్వచ్చోద్యమ పల్లకీని సమర్థంగ మోయుచున్న

ఆమే కృష్ణకుమారి - ఆ ఊరే చల్లపల్లి!

- నల్లూరి రామారావు

   29.02.2024