3046* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

సందడి సందడిగా 3046* వ నాటి వీధి పారిశుద్ధ్యం!

         అది శోభకృత నామ సంవత్సర మాఘ షష్టి - శుక్రవారం వేకువ 4:17 మొదలు 6:28 వరకూ గ్రామ సామాజిక ప్రయోజనార్థం చల్లపల్లి - వక్కలగడ్డ ఊళ్ల సరిహద్దులో నెలకొన్న శ్రమ సందడి! చిల్లలవాగు వంతెన నుండి వక్కలగడ్డ దిశగా రహదారికిరు ప్రక్కలా 20+3 గ్గురి శ్రమ సౌజన్యం! సందడికి కి ముఖ్య కారణం షెడ్దర్ యంత్రం!

         వీధి దీపాల కాంతినీ, చంద్రుని శీతలాతపాన్నీ దిగమ్రింగేస్తున్న మంచొక ప్రక్క, హడావిడిగా వచ్చిపోతున్న ద్వి-త్రి-చతుశ్చక్రవాహన రొద ఇంకో వంక, మెడలో గంటల్లేని ఎడ్ల బళ్ళ కదలికల నడుమ – వీటన్నిటినీ కాచుకొంటూ, చాకచక్యంగా తమ పని తాము చేసుకుపోతున్న కార్యకర్తల శ్రమ నాకొక మనోహర దృశ్యం!

         అసలేమిటీ 20 మంది పట్టుదల? ఎందుకీ చలీ మంచు వేకువ వేళ – ఊరికి దూరంగా లోతైన సైడు కాల్వల్లో, చెట్ల క్రీ నీడల్లో స్వచ్ఛ కార్యకర్తల శ్రమ విన్యాసాలు? పేపర్లో ఫోటోలూ ప్రచారాలకా? No.; ధన ప్రాప్తికా? కానే కాదు; కేవలం ‘తమ గ్రామ ప్రజల సౌకర్యాలు పెంపొందిస్తున్నామనే ఒక చిన్న ఆత్మ సంతృప్తి కోసమే! ఇదేదో ఒక రోజుకో-నెలకో పరిమితమా అంటే అదీ కాదు - 3046 రోజులుగా ఇదే పట్టుదల!

         శ్మశానాల్ని సముద్ధరించడానికీ, ఊరి వ్యర్ధాల విభజింపుకూ, మురుగుకాల్వల సంస్కరణకూ, రహదార్ల హరిత సౌందర్య నిర్వహణకూ ఈ స్వచ్ఛ కార్యకర్తలు 10 ఏళ్లుగా పాటుబడుతూనే ఉన్నారు! వీళ్ల పనులు గ్రామస్తులకైతే అలవాటు పడ్డవిగాని, క్రొత్త వాళ్లకు మాత్రం సందేహాస్పదాలూ, హాస్యాస్పదాలూ!

         5 గురు మహిళల్తో సహా - వంచిన నడుములెత్తక కత్తుల్తో రోడ్డు మార్జిన్ల గడ్డి చెక్కతున్న రైతు కార్యకర్తల్తో బాటు - ప్రస్తుత/విశ్రాంత ఉద్యోగులూ, వృత్తికారులూ పరవళ్లతో పనిచేసి, ఎండూ – పచ్చీ మొక్కల్నీ, కొమ్మల్నీ, తుక్కునీ మోసుకెళ్లి షెడ్దర్ వద్దకు చేర్చడమూ,

         అక్కడి ట్రస్టు ఉద్యోగులిద్దరవి అందుకొని వాటిని యంత్రభూతం కోరలకందించడమూ,

         క్షణాల్లో సదరు యాంత్రికుడు వాటిని తుత్తునియలు చేయడమూ,

         వచ్చేపోయే వారు ఆసక్తిగా గమనించడమూ జరిగిపోయి,

         ఆ తుక్కు పొడి మొత్తం సేంద్రియ ఎరువుగా త్వరలో మారనుండడమూ....  

         ఇదీ - నేటి స్వచ్ఛ కార్యకర్తల కృషి సారాంశం!

         ఇక – 6:40 కి అందరూ అర్ధవలయంగా నిలిస్తే గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ సందేశ నినాదాలు పలికే వంతు నాది!

         మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా తదుపరి 7 రోజులూ పెదకళ్లేపల్లి రోడ్డు సుందరీకరణకు పూనికలో భాగంగా

         రేపటి వేకువ మనం కలసి శ్రమించే స్థలం వేంకటాపురం గ్రామంలోని శివాలయం వద్దనే!

         అంకితులు మన చల్లపల్లికి - 8

చుట్టం చూపుగ వచ్చిన జాస్తి జ్ఞాన ప్రసాదు

స్వచ్చోద్యమ మందెంతగ కూరుకు పోయెనొ చూడు

శ్రమ జీవన సౌందర్యం రుచి మరిగిన లక్షణమూ

సజాతీయ పక్షుల సత్సాంగత్యం మహిమా ఇది?     

- నల్లూరి రామారావు

   01.03.2024