3047* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?                      

                       3047* వ శ్రమదానం వెంకటాపురం సెంటర్లో!

         సదరు శ్రమదానం కోసం భారీ మంచూ,  చలీ వేళ వేకువ 4.00 కే- 4-5-6 కిలో మీటర్ల దూరం ప్రయాణించిన స్వచ్ఛ కార్యకర్తలు 20 మందీ, స్థానిక సానుభూతి పరులు నలుగురూ గ్రామ ముఖ్య కూడలి నుండి శివరామపురం దిశగా 200 గజాల మేర చేసిన వీధి  పారిశుద్ధ్యం విజయవంతమైంది!

         “అనువుకాని వేళ - చోట అంతదూరం ఎందుకిందరి సాహస యాత్ర?” అంటే - అందుక్కారణం 'ఆ ఊరి లోని కోనేరు ఛారిటబుల్ సంస్థా, దాని నిర్వాహకుడు మారుతీ ప్రసాదు' అనే చెప్పాలి!

         DRK గారి సన్నిహిత పరిచయస్తుడైన మారుతి గారు స్వచ్ఛ వైద్యుని ప్రోద్భలంతోనే 2 గ్రామాల నడుమ రహదారి రూపును మార్చేస్తూ, ఇరు ప్రక్కలా పండ్ల మొక్కల్ని నాటించి, పెంచుతూ - అందుకిద్దరు ఉద్యోగుల్ని నియమించి ఆ ప్రాంతపు  స్వచ్ఛ- సౌందర్యాల్నీ, పర్యావరణాన్నీ రక్షించే ప్రయత్నం చేస్తున్నారు!

      అంతకు మునుపు కూడ గత ఆరేడేళ్లలో శివరాత్రుల సందర్భంగా స్వచ్ఛ కార్యకర్తలు అరడుజనుమార్లు ఈ గ్రామానికి వచ్చారు.

         ఉభయ శివరామపురాల రహదారి క్రమశిక్షణగా రెండు ప్రక్కలా నిలబడ్డ చెట్లతోను, అదుపులోఉన్న కాలుష్యాల తోను ముచ్చటగా కనిపిస్తున్నది!

         బహుశా ఆ గ్రామస్తుల పరిశుభ్ర స్పృహ,  మంగళాపురం నుండి వచ్చిన శ్రామికుల కృషీ  కారణం కావచ్చు!

        ఆ గ్రామాల రోడ్డుతో పోలిస్తే వెంకటాపురం సమీప రహదారి  కాస్త వెనకున్నట్లే !

         అందుకే నేమో – NH 216 నుండి కాక  ఈ రోజు స్వచ్ఛ కార్యకర్తల పారిశుద్ధ్య  పనులు వెంకటాపురం నుండి మొదలయ్యాయి!

         నేటి స్వచ్ఛ శుభ్రతలు పొందిన చోటులు :

- పేడ-పిడకలు- ప్లాస్టిక్ తుక్కులు వదలగొట్టిన 4 గురు సుందరీకర్తలు, (శివాలయం ప్రహరీ బారునా).

- ఊర చెరువు పడమర గట్టున పేరుకు పోయిన అనేకానేక వ్యర్థాల్ని  తెల్లారాక చూద్దామంటే కనుపించనీయని ఐదారుగురి కష్టం!

- రోడ్డుకు పడమరి మార్జిన్ వేకువ 4.30 కు ముందెలా ఉన్నదో, 6.30 పిదప ఎంత పద్ధతిగా ఉన్నదో పరిశీలించండి ! ఆ రోడ్డు చివరి ఇంటి దాకా సగం ఎండిన గడ్డీ, పిచ్చి మొక్కలూ మీకిప్పుడు కనిపించవు!

- స్వచ్ఛ కార్యకర్తల నేటి ఉపయుక్తమైన తుక్కు సేకరణ ఒక ట్రాక్టర్ నిండుగా !

6.40 కి DRK గారి సంతోష వ్యక్తీకరణ, కోడూరు వారి స్వచ్ఛ సుందరోద్యమ నినాద గర్జనా షరామామూలే!

'మరింత మందితో రేపటి వేకువ శ్రమదానం వెంకటాపురం దగ్గరి వంతెన వద్దనే!(చెరువుకు ఉత్తరం వైపున)

      అంకితులు మన చల్లపల్లికి – 9

అదిగో ముత్యాల లక్ష్మి - హోటల్ యజమానురాలు

ఊపిరి సలపని పనులతొ ఉంటున్నది చాలక

వీలున్నపుడెల్ల ఊరి విధులు నిర్వహించునే!

శ్రమదానంలోనే తన సంతోషం వెదకునే !

 

- నల్లూరి రామారావు

   02.03.2024