3048* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?               

                                3048* వ నాటి శ్రమ సందేశం!

         ఆదివారం (3-3-2024) వేకువ 2 గంటల పాటు వెంకటాపురం ప్రాత శివరామపురం గ్రామాల మధ్య 34 మందికి సంబంధించిన శుభ్ర సుందరీకరణ కృషి అటుగా వచ్చే- వెళ్లే వారికి గాని-గ్రామస్తులకు కాని కొందరికయోమయం, కొందరికజ్ఞాతం, ఇంకొందరికాశ్చర్యం, ఏకొద్ది మందికో స్ఫూర్తిదాయకం!

         అసలీ కాలంలో 90 శాతం మంది దేన్ని గురించైనా స్థిమితంగా ఆలోచించేట్లుగా ఉన్నారా? ఎవరైనా చెప్పినా వినేట్లున్నారా? తనలాభం - తప్ప ఇతరుల్ని పట్టించుకొనేట్లున్నారా? 60 ఏళ్ల నాడు శ్రీశీ ఒక సినిమా గీతం (వెలుగు నీడలు) - లో వ్రాసినట్లు – 

ప్రతి ఒకడూ మరియొకడిని దోచుకొనే వాడే

తన లాభం తన సౌఖ్యం చూసుకొనేవాడే...

స్వార్ధమీ అనర్ధ కారణం- అది చంపుకొనుటే క్షేమదాయకం....

         గత 10 ఏళ్లుగా చల్లపల్లిలో స్వచ్ఛ – సుందరోద్యమం సాగిస్తున్న కార్యకర్తలు మన సమాజం లో మిగిలిన 10% లోని వారన్నమాట!

         ఎక్కడ చల్లపల్లి - ఎక్కడ వెంకటాపురం ? ఒక్కొకళ్లు 4-5-6 కిలోమీటర్లు చలిలో- మంచువేకువలో ప్రయాణించి, 200 గజాల పెదకళ్లేపల్లి రోడ్డు భాగాన్ని ఒళ్ళొంచి, శుభ్రపరచడమూ- ఈ పాతిక మందికి 6 గురు పాఠశాల పిల్లలూ, వెంకటాపురం నుండి ఐదారుగురూ సహకరించడమూ చూస్తుంటే- స్వార్ధానికే గాదు, త్యాగానికీ, వివేచనకూ చోటు మిగిలే ఉందనిపించడం లేదూ?

         ఈ పూట శ్రమదాతలు కనీసం 5 ఊళ్లకు చెందినవారు ! అందరూ ఉత్సాహంతో పనిచేశారు! సామూహిక సత్కార్యంలో ఉండే గొప్పతనమది! రెండు వంతెనల నడుమ కొందరు చీపుళ్లతో ఊడ్చి, అడ్డదిడ్డంగా ఉన్న తాడి మొద్దుల్ని క్రమబద్దీకరించీ, పిచ్చిమొక్కల్ని సమూలంగా నరికీ, ప్లాస్టిక్ తుక్కుల్ని ఏరీ ఎవరికి తోచిన పని వాళ్లు చేశారు!

         వంతెన ప్రక్క కాలువ గట్టు వద్ద అర్థచంద్రాకారంలో నిలబడి, 8వ తరగతి చదివే గొరిపర్తి సాహితి “జై స్వచ్ఛ వెంకటాపురం  “స్వచ్ఛ వెంకటాపురాన్ని సాధిస్తాం” అనీ మూడేసి మార్లు నినదించగా, అద్భుతమైన జెండా గీతాన్ని నందేటి శ్రీనివాసు పాడగా,

         రేపటి వేకువ కూడ ఇదేచోట మరింత ఉత్సాహంతో కలుద్దామని సంకల్పించుకొని, గృహోన్ముఖులయ్యారు!

     అంకితులు మన చల్లపల్లికి 10 

ట్రస్టేతను- తనే ట్రస్టు-ట్రస్టు కార్యకలాపమున

విలీనమై ఏడెనిమిది వసంతాల సమయం

గడుపు కర్మవీరుడు ఈ కస్తూరి శ్రీనుడు

స్వచ్ఛ కార్యకర్తకు ఒక స్పష్టమైన నమూనా !

 

- నల్లూరి రామారావు

   03.03.2024