3051* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు ఇంకా వాడాలా?

రహదారి శ్రామిక చరిత్ర - @3051*

         బుధవారం (6.3.24) వేకువ కూడ వెంకటాపురం సమీప రహదారే మరొకమారు పాతిక మంది సామాజిక బాధ్యుల శ్రమ విన్యాస వేదిక. ఈ ఉద్యమం తొలినాళ్ల ‘రోజుకొక గంట బాధ్యత’ అనే నియమం కాలక్రమాన గంటన్నరగానూ, గత నాలుగైదు నెలలుగా 2 గంటలుగానూ మారిపోయింది! నేటి శ్రమదాన కాలావధి 4:22 – 6:20!

         శ్రమదాన యోధులైన సజ్జా - అడపా - మల్లంపాటి – మాలెంపాటి - కోడూరు వంటి వారు రాలేదు గాని, వైద్య నిమిత్తం భాగ్యనగరంలో ఉండి వచ్చిన BSNL పునరాగమనంతో, సుభాషిణి సైన్యం 10 మందితో నేటి వీధి పరిశుభ్రతకు డోకాలేకపోయింది!

         ‘గంగిగోవు పాలు గరిటెడైనను చాలు’ అనిన వేమన పద్యంలాగా ఈ వేకువ రహదారి పారిశుద్ధ్యం రాశిలో కాస్త తక్కువైనా వాసిలో ఎక్కువే. ఇందరు కార్యకర్తల్లో ఎవరు సుందరీకర్తలో – రిస్కీ పనుల వారెవరో అనేది ముఖ్యం కాదు, తామెంచుకొన్న రకరకాల పనుల్లో ఎవరి ఏకాగ్రత, సంతృప్తి వాళ్లవి.

         ఉదాహరణకు 5 గురు మహిళల పనే చూడండి - వాళ్ళెంచుకొన్న చోటు వంతెన! పారతో, గోకుడు పారతో, చీపురుతో వంచిన నడుములెత్తక అక్కడ బిగుసుకుపోయిన మట్టినీ, తుక్కునూ వదలగొట్టి గంట పాటు వాళ్ల పోరాటం సాగింది.

         ఇటు పొలం గట్టునా, అటు డ్రైను అంచునా గునపంతో, కత్తుల్తో గడ్డీ, పిచ్చి మొక్కల్ని తొలగించి, పుట్టల్ని త్రవ్వి, మెరకను చదును చేసి, ‘రహదారంటే ఇలా ఉండాలి’ అనేట్లు అందగించిన – శుభ్రపరచిన శ్రమ సౌందర్యం మనసున్న వాళ్ళకు మరపు రానిది!

         షరా! అల్పమైన కీర్తిదురదా, ఐడెంటిటీ క్రైసిస్ (గుర్తింపు సంక్షోభం) వంటివే కనుక ఉంటే ఈ శ్రమదానం జరగదని మనవి! స్వచ్ఛ కార్యకర్తల విశాల దృక్పధమూ, కోనేరు ట్రస్టు ఔదార్యమూ తోడై జరుగుతున్న మంచి కార్యక్రమంలో వెంకటాపురం వారు మరింతమంది పాల్గొనాలని వినతి!

         తొమ్మిదో తరగతి గొరిపర్తి సాహితి నదురూ - బెదురూ లేకుండా సొంతూరి స్వచ్ఛ సుందర సంకల్ప నినాదాలను ప్రకటిస్తే,

         హృదయ కవాట శస్త్ర చికిత్సను గూర్చి డాక్టరు డి.ఆర్.కె. విశదీకరిస్తే,

         రేపటి వేకువ కూడా మనం ఆగి కృషి చేయవలసింది ఇదే వేంకటాపురం వంతెన వద్ద నుండే అని అందరంగీకరిస్తే,

         నేటి కార్యక్రమం ముగిసింది.

     అంకితులు మన చల్లపల్లికి – 13

అదిగొ ఆమె పసుపులేటి ధనలక్ష్మీ నామధేయ

గతంలోనె ఒక వార్డుకు ప్రతినిధిగా ఆమె సేవ

తన మౌలిక తత్త్వమసలు ఊరి స్వచ్ఛ శుభ్ర త్రోవ

అప్పుడైనా ఇపుడైనా అణకువగా ఆమె బాట!

- నల్లూరి రామారావు

   06.03.2024