ఒకానొక త్యాగ బ్రహ్మ!....

 ఒకానొక త్యాగ బ్రహ్మ!

            స్వచ్చ - సుందర చల్లపల్లి కోసం దశాబ్దకాలంగా జరుగుతున్నది ద్విముఖ ఉద్యమం. అది అచ్చంగా శ్రమదానమే కాదు - ఖర్చుతో గూడుకొన్నది గూడ. తమ ఊరి సంస్కరణ కోసం లక్షల కొద్దీ గంటలు శ్రమంచే వందల కొద్దీ స్వచ్ఛ కార్యకర్తలుండడం ఒక విశేషమైతే - ఆర్థికంగా ఆదుకొనే దాతలుండడం మరొక విశేషం!

            అంతకన్న పెద్ద విశేషం అవసరాన్ని బట్టి శ్రమదాతలే అర్ధదాతలుగా మారుతుండడం! అలా ఉభయ దాతృత్వాలు ప్రదర్శించిన ఒకానొక సాధారణ వ్యక్తి....

* అది పాగోలు గ్రామం. అక్కడి శ్మశానంలో కొన్ని సౌకర్యాలు కావలసి వచ్చాయి. ఆ ఖర్చులకు సిద్ధపడింది సదరు సాదాసీదా విశ్రాంత చిరుద్యోగే!

* పాగోలు పంచాయతీ పరిధిలోని నాగాయలంక రోడ్డులో మనకోసం మనంట్రస్టు వారు చల్లపల్లికి ప్రతిష్టాత్మకమైన స్వచ్చ సుందర పబ్లిక్ టాయిలెట్లు కట్టించదలచుకొన్నప్పుడు 50 వేల చందాదారుడూ ఆ రిటైర్డ్ పంచాయితి బిల్ కలెక్టర్ గారే!

* చల్లపల్లి ప్రజలకు కాని, సందర్శకులకు గాని సౌకర్యవంతంగా ఉండాలని ట్రస్టు వారు మళ్ళీ బందరు రోడ్డులో - బంకు ప్రక్కన అలాంటివే నిర్మిస్తున్నపుడూ అయాచితంగా మళ్ళీ 50,000/- ఆర్థిక సహకారమూ అతనిదే!

* బహిరంగ మల విసర్జనా కేంద్రంగా ఉన్న పాగోలు - చల్లపల్లి రహదారిని స్వచ్చ - సుందరంగా మార్చేందుకూ, హరిత బంధురంగా తీర్చిదిద్దేందుకూ శ్రమిస్తున్న స్వచ్ఛ కార్యకర్తలకు పాగోలు నుండి కొందరు వాలంటీర్లను సమీకరించిన - దాతల్ని ప్రోత్సహించిన వ్యక్తీ అతగాడే!

* తన సొంతూరు పాగోలులో కంఠంనేని వంశీయులు నిర్మించిన కల్యాణ మండపం ఖర్చులో కొంత ఆయనదే!

* సుమారైన తన పెన్షన్ నుండి నెలనెలా మిగిల్చిన  పొదుపును 30 వేలు గానో - 50 వేలు గానో కూడబెట్టి, గతంలో తాను ఉద్యోగించిన చల్లపల్లి శుభ్ర - సుందరీకరణ కోసమో, పాగోలు ప్రజల అవసరానికో ఖర్చు చేస్తూ తన వంతు సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్న ఒక ఆదర్శ విశ్రాంత చిరుద్యోగే ఆ త్యాగబ్రహ్మం!

            వస్తుతః ధనికుడూ కాదు, తాత తండ్రులిచ్చిన కోటానుకోట్ల సంపదా లేదు; తన జీవన భాగస్వామి చాలకాలం క్రిందటే ఒంటరితనాన్నిచ్చి వెళ్లిపోయారు; 73 ఏళ్ల వయస్సు మిగిల్చిన అరోగ్య సమస్యలు సరేసరి!

            ఇతరత్రా అతని విరాళాలు కాక, కేవలం మనకోసం మనంట్రస్టుకు ఇప్పటి వరకూ వారిచ్చిన విరాళమే 4,72,000/-

            ఇలాంటి ఒక దిగువ మధ్య తరగతి వ్యక్తి తన సమస్యలకన్నా తన సామాజిక అవసరాల పట్లనే ఎక్కువగా స్పందించడమూ, పదిమందికి అనుసరణీయ వ్యక్తిగా నిలవడమూ ఈ రోజుల్లో విశేషమే మరి!

            వయోభారం వల్ల ఇటీవల కొన్నాళ్ళుగా స్వచ్ఛ కార్యకర్తలతో కలిసి శారీరకంగా శ్రమించడం లేదు గాని, వేకువ ఏ 3 గంటలకో లేచి, 3-4 కిలోమీటర్లు సైకిలు మీద వెళ్లి, కత్తితో-దంతెతో పనిచేస్తుండేవాడు!

            తీర్ధయాత్రలన్నా, సత్సంగాలన్నా ఆయనకిష్టం!

            తన చుట్టూ ఉన్న వారిని మరి కాస్త సంతోషంగా, సౌకర్యంగా ఉంచాలనే సామాజిక బాధ్యత పాటిస్తున్నందుకు తనను గూర్చి ఇలా వ్రాయడం ఆయనకు బొత్తిగా నచ్చని విషయం! ఐతే మనమున్న గడ్డు కాలంలో ఈ మాత్రం సామాజిక కర్తవ్య పరాయణతనూ, నిరాడంబరతనూ, నీతి - నిజాయితీని గుర్తించడం, కీర్తించడం నా ధర్మం!

            అసలింతకీ కృష్ణా జిల్లా - పాగోలు గ్రామస్తుడైన ఆ వ్యక్తే కంఠమనేని రామబ్రహ్మం!

- నల్లూరి రామారావు

   13.03.2024