3069* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

       ఆదివారం(24-3-2024 ) నాటి వేకువ శ్రమదానం 3069* వది!

        అది 4-18 కి మొదలై 6.20 కి గాని ముగియలేదు. నేటి వీధి శుభ్ర- సుందరీకర్తలు 19 మంది (వీళ్లు కాక 10 మంది కార్యకర్తలు ఆ ప్రక్కన విజయ కాన్వెంట్లో ఈ కార్యక్రమానికి సమాంతరంగా జరుగుతున్న గోపాళం భ్రమరాంబ - రామస్వామి సంస్థ వారి వైద్య శిబిరంలో సేవలందిస్తున్నారు).

        ఈ కాస్త మంది 2 గంటలు అంకితభావంతో నెరవేర్చిన గ్రామ బాధ్యతల వల్లే కస్తుర్బాయి ప్రభుత్వాస్పత్రి వద్ద 100 గజాల వీధీ, కుడి - ఎడమల మురుగు కాల్వల్లోని వ్యర్థాలు క్షుణ్ణంగా బాగుపడ్డాయి. రోడ్డు మార్జిన్లు  ఆ భాగం వరకూ గడ్డి లేకుండ – పిచ్చి మొక్కల్లేకుండ ఎలా శుభ్ర పడిందీ చూడండి!

        మరి – 2 గంటల వ్యవధిలోనే బాగా రద్దీ వీధి ఇంత పొందికగా, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహితంగా, దుమ్మూ- ధూళీ రహితంగా ఎలా మారింది?  కేవలం మానవ శ్రమతో! ప్రతి పనిలో "నాకేంటి? " అని ఆలోచించక - కొందరు స్థితిమంతులూ, విద్యా వయోధికులూ, గృహిణులూ పదేళ్ళ నుండీ నిస్వార్థ శ్రమ చేస్తుంటేనే వేల కొద్దీ గ్రామాల్లో ఈ గ్రామం  “స్వచ్ఛ సుందర చల్లపల్లి” అనే పేరు తెచ్చుకుని ఒక ఆదర్శ  గ్రామంగా నిలుస్తున్నది!

        ఈ 3069* వ నాటి మన వాట్సాప్ లో కనిపిస్తున్న శ్రమ జీవన సన్నివేశాల ఛాయా చిత్రాలు గ్రాఫిక్స్ మాయాజాలం కాదు సుమా!  ‘వట్టి మాటలు కట్టి పెట్టి- తమ గ్రామ సమాజానికి గట్టి మేలు చేస్తున్న బాధ్యతామూర్తుల కష్టానికి సాక్ష్యాలు!

 

        వాళ్లు కత్తుల్లో గడ్డీ- పిచ్చి మొక్కల్నే నరికారో, చీపుళ్లతో ఊడ్చారో, దంతెల్లో డ్రైన్ల తుక్కులాగి, ప్రోగులే చేశారో, ఆ బురద తుక్కును పనల్తో వాటేసుకొని, ట్రాక్టర్లో నింపారో – ఎలా శ్రమిస్తేనేం – తమ బట్టలు బురదకొట్టుకు పోతేనేం - తాము తలపెట్టిన వీధి మెరుగుదల సాధించేశారు!

        తమ అంచనాలు పూర్తి చేసిన సంతృప్త వదనాలతో 6.30 కు ప్రభుత్వ వైద్యశాల సాక్షిగా క్రమశిక్షణ తో నిలిచి, నేటి తమ కృషిని సమీక్షించుకొని, గంధం లక్ష్మణ ప్రకటించిన చల్లపల్లి గ్రామ స్వచ్ఛ-సుందరోద్యమ ప్రతిజ్ఞల్ని పునరుద్ఘాటించి,

రేపటి వేకువ తమ కర్తవ్యం విజయవాడ రోడ్డులో నిన్న వదలిన కాటాల దగ్గరే అని గ్రహించి, ఇళ్లకే గారు!

      అంకితులు మన చల్లపల్లికి

 చల్లపల్లి వీధుల్లో శ్రమదానం వింతలు

బొత్తిగ పట్టించుకోని కొందరు గ్రామస్తులు

ఒకటో-రెండొ నాళ్ళు కాదు- 3 వేల రోజులు!

ఎవరయ్యా మొండివాళ్లు - ఎవరు వందనార్హులు ?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  24.03.2024