3070* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

17+3 మంది వీధి బాధ్యతల్ని పరిశీలించండి - @3070*

            సోమవారం (25.3.24) వేకువ 4:176:15 వేళకు పరిమితమైన 2 గంటల సదరు బాధ్యతలు చల్లపల్లి - బెజవాడ రహదారి మీద కాటాల సమీపంలో నెరవేరినవి. ఈ కొద్ది మంది సామాజిక కార్యశీలురూ ఆ 100 - 150 గజాల రోడ్డు బాగుదలకు చేసిన పనులేవనగా :

            - మళ్లీ శనివారం పని స్థలంలోనే - అంటే చిల్లలవాగు దగ్గర్లోనే రోడ్డు పడమర పెద్ద నీడ చెట్లు, బోగన్ విలియా వంటి పూల మొక్కల కొమ్మల క్రమబద్ధీకరణంలో 5 గురూ,

- గ్రామం దిశగా, శనివారం పని తరువాయిగా ఆరేడుగురూ,

- కాటాలలోన - అపార్ట్మెంట్ మురుగు నీటి కంపు దగ్గర మరో ఇద్దరూ,

- ఇక చివరగా కాటాల వద్ద రోడ్డు మార్జిన్ ఎగుడు దిగుడు మట్టి మేటల్ని సవరిస్తూ 3 గ్గురూ,

- ప్లాస్టిక్ లు ఏరుతూ, 100 గజాల రహదారిని ఊడుస్తూ మహిళ లిద్దరూ

            ఎవరి పనిలో వాళ్లు ఒదిగి పోయారు!

            చల్లపల్లి, రామానగరం ఊళ్ల కార్యకర్తలు తమ ఊరి వీధుల పారిశుద్ధ్య నిర్వహణకు శ్రమించారంటే అర్ధం చేసుకోవచ్చుగాని - శ్రీకాకుళం గ్రామ పరిధిలో పుట్టి పెరిగి, ఎక్కడెక్కడో ప్రభుత్వ పాఠశాలోపాధ్యాయునిగా ఉద్యోగించి, రిటైరైన రామచంద్రరావు గారు - ప్రస్తుతం బెజవాడ  కానూరు నివాసులు ఇంత దూరం వచ్చి చల్లపల్లి వీధి శుభ్రతకు పూనుకోవడమంటే? స్వచ్ఛ కార్యకర్తల కష్టాల్ని పరిశీలిస్తూ, సహానుభూతి చెందడమంటే?

            ఎక్కడున్నా ఏ వయసొచ్చినా, సామాజిక కర్తవ్యాన్ని పాటించడమన్నమాట!

            ½ గంట పాటు ఇద్దరు చాదస్తపు కార్యకర్తలు బరువైన సుత్తితో కాలం చెల్లిన ట్రీ గార్డుల్ని మోది, సిమెంటు - ఇసుకను రోడ్డు మార్జిన్ పల్లానికి సర్ది, ఇనుప ఊచల్ని ఊడగొట్టి ఏరి, కట్టగట్టిన వైనం చూస్తే ఔరా!అనిపిస్తుంది!

            6:30 సమయాన పిండి జ్యోతి గ్రామ స్వచ్ఛ - సుందర - సుదీర్ఘ ఉద్యమాన్ని కీర్తిస్తూ నినాదాలు చెప్పగా

            DRK గారు ఫిబ్రవరి మాసపు ట్రస్టు జమా ఖర్చుల్ని ప్రకటించి,

            రేపటి వేకువ కూడ మనం కలిసి శ్రమించే చోటు బెజవాడ రోడ్డులోని కాటాల వద్దేనని వివరించగా

            ఈ శ్రమదానం రేపటికి వాయిదా పడింది!

      అంకితులు మన చల్లపల్లికి - 30

చల్లపల్లి శ్రమదానం తాతినేని రమణలూ

విడిగా ఉండరు వారికి మొక్కలతో బంధము

ఊళ్లూ - రహదారుల్లో పెరుగు నితని మొక్కలు

శ్రమ తోడై విరగ బూసి సౌందర్యం మెరుపులు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  25.03.2024