3071* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

బెజవాడ రహదారి పనులే 3071* వ వేకువ కూడ!

            ఇది మంగళవారం - 26.3.24 నాటి శ్రమ సంగతి! శ్రమైతే – 4:17 కే మొదలై, ముగ్గురు బరువు పనిమంతులు 6:14 కు అయిష్టంగా ఆపడంతో ముగిసింది.

            ఈ వేకువ నేను ముందుగా గమనించిన కష్టం అపార్ట్మెంట్ల దిశగా, ఒక పెద్దాయన కత్తి – గొర్రు - చీపుర్లందుబాటులో ఉంచుకొని, భారీ శరీరాన్ని వంచి, డ్రైను గట్టు మీది గడ్డీ, తుక్కూ ఖండించి, ఏరి, ప్రోగులుగా పేర్చడం! మొక్కల వేరులూ ఆయన వదల్లేదు.

            కాటాలకు ఉత్తరంగా లోతైన మురుక్కాల్వలో ఇద్దరూ, ఒక మహిళా కార్యకర్త ఎండీ ఎండని గడ్డినీ, తీగల్నీ నరికి కాల్వ గట్టు మీద పేరుస్తున్నారు. ఇదంతా బాలాజీ ఆపార్ట్మెంట్ల వారి మురుగు సాఫీగా చిల్లలవాగులో కలిసేందుకట!

            ఇద్దరు స్త్రీ మూర్తుల గంటకుపైగా శ్రమతో రోడ్డుమీది దుమ్మూ - ఇసుకా, మర్యాదగా తప్పుకొని, బాట అంచుల్లోకి వెళ్లిపోయింది. బెజవాడ బాట ఇప్పుడింకొంచెం విశాలంగా, శుభ్రంగా కనిపిస్తున్నది.

            మురుగు కొంత ఎండి, రోడ్డుకు పడమర డ్రైనులో ఆరేడుగురు దిగి, ఎండుటాకులూ, ప్లాస్టిక్ కవర్లూ, కాగితాలూ బైటపడితే ఐదారుగురి శ్రమ ఫలించి, ఆ డ్రైన్ కొంత బాగుపడినట్లే!

            కాటాల స్థల యజమానులు లారీల సౌకర్యార్థం వర్షాకాలంలో తోలిన ఎర్ర కంకర చెల్లా చెదురై రోడ్డు మీదకి 3 ½ అడుగుల్దాక చొచ్చుకొచ్చి, చట్టుగా మారితే – దాన్ని త్రవ్వి, డిప్పలకెత్తి గుట్టగా పోయడం ఎంత కష్టమో, అరగంట ఒళ్లొంచితే గాని నా కర్ధం కాలేదు!

            ఊరి మంచి కోసం సుదీర్ఘకాలంగా ఇందరు కార్యకర్తలు ఏ పరమార్ధం కోసం చెమట చిందిస్తున్నారో తెలియాలంటే మిగిలిన గ్రామస్తులు అప్పుడప్పుడైనా వచ్చి, స్వచ్ఛ కార్యకర్తలతో చేరక తప్పదు!

            6:30 కాలంలో వాలంటీర్లందరూ కాటాల ఎదుట నిలబడి, గ్రామ సర్పంచి ఉత్సాహంగా చెప్పిన నినాదాలను పునరుద్ఘాటించి పంచాయితీ 4 ట్రాక్టర్లు ఎలా చెత్త సేకరిస్తున్నదీ, గొర్రెపాటి ట్రస్టు వారి ఔదార్యమెంతటిదీ, మరొక అజ్ఞాత వదాన్యుడి వితరణ ఎలాంటిదీ అనే విషయాలు వివరంగా తెలుసుకుని –

          డాక్టర్ A.V. గురవారెడ్డి గారి తాజా దాతృత్వంతో ట్రస్టుకు మరొక వీడ్కోలు వాహన కొనుగోలునూ, దాత లభించక ముందే ట్రాక్టర్ కొనడాన్నీ DRK ప్రస్తావించగా –

 

            రేపు మనం కలిసేది ఆటో నగర్ వీధి C/o బెజవాడ రోడ్డు – అనే ప్రకటనతో నేటి కృషి ముగిసింది.

      అంకితులు మన చల్లపల్లికి - 31

లీనమైన పనిమంతుడు లేదస్సలు అలసట

పనేదైన అందంగా, పొందికగా చేయుట

అతని లక్షణం - అతడే ఆకుల దుర్గాప్రసాదు

ప్రతి రోజూ ఋణపడతది గ్రామ మెల్ల అతనికి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  26.03.2024