3073* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

నేటి (గురువారం) పని దినం వరుస సంఖ్య - 3073*

         మార్చి నెల 28 వ నాటి వేకువ 4:18 కే మొదలైన శ్రమ 6:10 దాక ఆగలేదు. 20 మంది గ్రామ బాధ్యులు శ్మశానానికి దగ్గర్లో - అప్పటిదాక చంద్రుని సాక్షిగానూ, 6:00 తరువాత సూర్యుని సమక్షంలోనూ తమ అంచనాల మేరకు పాతిక సెంట్ల ఖాళీ స్థలంలో స్వచ్ఛ – శుభ్ర – సౌందర్య సాధన చేశారు.

         నేటి పని సాధనాలు ఎక్కువగా కత్తులే! ఐదారుగురి చేతులు తప్ప ఇంచుమించు అందరి చేతులూ కత్తులు పట్టినవే!

         పోనీ – పని చోటేమన్నా చదునుగా, సాఫీగా ఉన్నదా అంటే – అదేం లేదు, కొంత మట్టి దిబ్బలూ, కొంత పల్లం చోటులూ! వాటిలో ఖాళీ వదలకుండా ఏడెనిమిది రకాల ముళ్ల, పేరు తెలియని పిచ్చి చెట్లూ!

         అక్కడికీ అనుభవజ్ఞులైన కార్యకర్తలు 2 రకాల ముళ్ల చెట్లను సమూలంగా నరకక – కొన్ని ముళ్ళ మట్టలు చెలిగి సుందరీకరించారు. కత్తుల్తో నిర్విరామంగా పనిచేసే వాళ్లు చేసుకుపోతుంటే - ఆ నరికిన వ్యర్ధాల్ని గొర్రుల్తో లాగి, డిప్పల్లో నింపి, గుట్టలుగా పేర్చే వాళ్ళు పేరుస్తున్నారు.

         ఇద్దరు మాత్రం ప్రత్యేకించి ఆటోనగర్ తొలి రోడ్డు ఉత్తరం ప్రక్క మార్జిన్లో గడ్డినీ, చిన్నా - చితకా పనికి రాని మొక్కల్నీ పనిబట్టారు!

         పనిలో పనిగా ఇద్దరు ప్లాస్టిక్ సంచులూ, సీసాలూ, ఏకమాత్ర ప్రయోజనకర ప్లాస్టిక్ వస్తువులూ ఏరి గోతాంలో నింపారు! ఒక నర్సు గారైతే అంత పెద్ద రోడ్డునూ ఊడుస్తూనే ఉన్నారు!

         సాంతం తెల్లారాక చూస్తే – ఆ స్థలమంతా క్రొత్తగా కనిపించింది!

         అది సరే “మరి వీళ్లంతా ఎవ్వరు? తిన్నదరక్క, వేకువ 3:00 కే నిద్ర పట్టక, నా అనే ఆదరణ దొరక్క మూడేసి కిలోమీటర్ల దూరం వచ్చి, మురుగు - దుమ్ము పనుల ఖర్మేంటి వీళ్లకీ?” అంటే - కేవలం ‘కృతజ్ఞత’ అనే మానవ విలువే వీళ్లని సామాజిక బాధ్యత కోసం లాక్కొచ్చిందని చెప్పాలి?

         లేకపోతే - ఐదార్రోజులుగా నడుం పట్టేస్తున్న పాటల శ్రీను ఇక్కడి కొచ్చేవాడా?

         6:25 కు కార్యకర్తలు అర్థవలయంగా నిలిచినప్పుడు దోనేపూడి కోమల్ చంద్ కాస్త తడబడి చెప్పిన గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలతోబాటు –

         రేపటి వేకువ కూడ ఆటోనగర్ దగ్గరే మన బాధ్యత కొనసాగించాలని నిర్ణయించారు!

 అంకితులు మన చల్లపల్లి కి – 36

వచ్చుట అరుదేగానీ వచ్చినపుడు ఆతని పని

వంకబెట్ట లేనిదనే వాక్రుచ్చుట వింటిని

మనస్పూర్తి శ్రమదానం తనలో గమనిస్తిని

మందులు కొట్లో ఉండే మన కోమల్ చందుని!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  28.03.2024