3074* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఇది 3074* వ నాటి సమయోచిత శ్రమదానం!

         ఇది - మార్చి 29 - శుక్రవారం నాటి 19+2 మంది కొంచెం తక్కువగా 2 గంటల సమయం వెచ్చించి, బెజవాడ మార్గానికి తూర్పుగానూ, శ్మశానానికి దక్షిణంగానూ ఆటోనగర్ అనే చోట - నిన్నటి తరువాయిగా చేసిన శ్రమ వీరవిహారం!

         అందులో కొంత భాగమైతే - రహదారి ప్రక్క డ్రైనూ, దాని గట్టూ చిందరవందరగా పెరిగిన ముళ్ల రేగు చెట్లూ, ఇంగ్లీష్ తుమ్మ చెట్లూ, వాటికి అల్లుకొన్న తీగలూ, వీటన్నిటి మధ్యా పడి ఉన్న ప్రాత చీరలు, చున్నీలూ, అడుగడుగునా లెక్కలేనన్ని ప్లాస్టిక్ సీసాలూ, కప్పులూ, 100 ML, 200 ML, పావు లీటర్ల ఖాళీ మద్యం సీసాలూ – వీటన్నిటి సమాహారంగా ఆ10-12 సెంట్ల ఖాళీ జాగా ఎంత భీభత్సంగా ఉన్నదో వర్ణించలేను!

         ఏ 3:30 కో లేచి, 4:15 కే ఊరికి దూరంగా ఉత్తరాన శ్మశానం దగ్గరికి చేరుకొని, ఇంతటి భీభత్సాన్ని బాగుచేయ పూనుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? ఎంతటి నిబద్ధత ఉండాలి?

         ఆ ఎగుడు దిగుడుచోటున - మురుగు కాల్వలో దిగాలన్నా, తూముల్లో దూరి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తు దరిద్రాన్ని క్రీ నీడల్లో ఏరి, దురదగొండి చెట్లను నరికి, అష్ట దరిద్రాలనూ ప్రోగులు చేయడమంటే మాటలా?

         ఇలా ఒకటో - రెండో పూటలు కాదు - 3074 వేకువ సమయాలు తమ ఊరి ఆహ్లాదం కోసం – అదొక దిన తొలి చర్యగా మార్చుకొని, పాతిక – ముప్పై - నలభై మంది కష్టించడాన్ని మెచ్చుకోవాలనే ఉన్నది గాని – కార్యకర్తల్లో చాల మందికి మెచ్చుకోళ్ళంటేనే చిరాకు! ‘తమ సామాజిక బాధ్యతను నెరవేరుస్తున్నందుకే పొగడాలా?’ అని వారి అభిప్రాయం!

         ఇద్దరు ఆ రెండు రోడ్లను ఊడ్చారనీ, ఇంకొకరు పెద్ద గోతం నిండా ప్లాస్టిక్ లను నింపారనీ, ఒకాయనకు ఈత ముల్లు చర్మంలో దిగిందనీ, ఇంకొ ఇద్దరు పని ధ్యాసలో బడి నడుము ఎత్తడం మర్చిపోయారనీ...వ్రాయడమెందుకు? అలాంటివి ఇంచుమించు ప్రతి రోజూ జరిగేవే!

         నేటి స్వచ్ఛ సుందరోద్యమ సారాంశాన్ని ముమ్మారు నినదించినది లంకే సుభాషిణి, 2 జీవన సూక్తుల్ని వివరించింది అడపా గురవయ్య.

         రేపటి వేకువ కూడ ఇదే ఆటోనగర్లోనే శ్రమించాలని నిర్ణయించింది కార్యకర్తలందరూ!

    అంకితులు మన చల్లపల్లికి – 37

వైద్య సేవలందిస్తూ ఉద్యోగించుట తెలియును

స్వచ్ఛ సేవతో ఊరిని సుందరీకరించు టెరుగును

పాటలతో - ఈలలతో పరవశించుచుండగలదు

ఈ మట్టా మహాలక్ష్మి దేనికైన వెనుకాడదు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  29.03.2024