3076* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఆదివారం - మార్చి మాసాంతపు శ్రమ 24+4 మందిది - @3076*

         వారిలో డజను మందైతే మరీ 4:16 కే సంసిద్ధులైపోయారు. పని చోటు నిన్నటిదే - విజయవాడ రహదారి ప్రక్కన ఒకప్పటి ఆటోనగర్ ప్రాంతం. వసంతమాసపు లేత వెన్నెల ఉన్నది గాని, పని జరిగే చోట్ల ముళ్ళ గుబురు చెట్ల దగ్గర కత్తులకు పని చెప్పే వాళ్లకు ఆ వెలుగు చాల్లేదు.

         పైగా అదేమో రోడ్డు మార్జిను - డ్రైనూ, దాని తూర్పు గట్టూ అంతా ఎగుడుదిగుడు చోటు – ఎక్కడ కాలు బెసుకుతుందో తెలియదు. ఎవరి చేతులకు ఈత ముళ్లు దిగుతాయో – ఎవరి కాళ్లకు దురద గొండాకులు తగుల్తాయో కనిపించని చోట - అష్టా దశ కార్యకర్తల పని! తమ ఊరి సుస్థితి కోసం వేకువ సమయాన్నెంచుకొని మొండి పట్టుదల పట్టి శ్రమిస్తున్న సామాజిక బాధ్యుల్ని అలా చూస్తూండిపోయాను!

         ఆటోనగర్ రోడ్డు దక్షిణం మార్జిన్ కాస్త గడ్డీ - పిచ్చి మొక్కలూ మిగిలిపోతే - ఒక పెద్దాయనా, ఒక నర్సూ, సర్పంచీ శుభ్రపరుస్తుండిపోయారు. ఇదే రోడ్డుకు ఉత్తరాన కూడ ముగ్గుర్నలుగురు ముమ్మరంగా పనిలో ఉన్నారు.

         విదేశాల్లోని, స్వదేశంలోని కొన్ని చోట్లలోని చల్లపల్లి శ్రేయోభిలాషులు ప్రతి దినమూ ఇక్కడ నిస్వార్థంగా జరుగుతున్న శ్రమదానాన్ని కీర్తిస్తున్నారు; తాము స్వయంగా పాల్గొనలేని నిస్సహాయతకు విచారిస్తున్నారు; ఈ గ్రామస్తులు కొందరు మాత్రం ఉన్న అవకాశాన్ని వదులుకొంటున్నారు.

         తన కోసం కాక – ఊరి కోసం ఇలా వేల రోజులు చిందించే చెమట సుగంధం ఆఘ్రాణించాలంటే - సమయ, శ్రమత్యాగాలను ప్రత్యక్షంగా చూడాలంటే – ఎక్కడికో పోవడమెందుకు? అది చల్లపల్లి వీధుల్లో అన్ని కాలాల్లోనూ అందుబాటులోనే ఉంటుంది!

         ఆదివారమైనందున – ఆనవాయితీ ప్రకారం ధ్వానమండలికి చెందిన గోళ్ల వెంకటరత్నం నుండి ఊరి స్వచ్ఛ -  సుందరోద్యమ నినాదాలు వినిపించాయి.

         మన సహచర స్వచ్ఛ కార్యకర్త ప్రేమానందంగారి తల్లి 89 ఏళ్ల మల్లంపాటి వసుమతి గారు కాలం చేసినందున కార్యకర్తలు శివరామపురం వెళ్లి, ఆ కుటంబాన్ని పరామర్శించారు.

         సోమ - మంగళవారాలు రెస్క్యూటీమ్ కు వదిలేసి, బుధవారం మనం మరొకమారు కలువదగింది ఈ ఆటోనగర్ దగ్గరే!

    అంకితులు మన చల్లపల్లికి – 39

అసలే ప్రేమానందుడు - ఆపైన శ్రమానందుడు

శ్రమ సైతం తనకు గాదు - చల్లపల్లి గ్రామమునకు

తనది గాని ఊరికతని త్యాగం గద గొప్పది

ఈ ప్రస్తుత సమాజానికీపాఠం మంచిది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  31.03.2024