1858 * వ రోజు....

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!  

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1858* వ నాటి కృషి.

ఈ వేకువ 4.15-6.15 నిముషాల నడుమ నిన్న-మొన్నటి – 6 వ నంబరు కాలువ వంతెన కేంద్రంగానే కొనసాగిన కృషిలో 26 మంది పాల్గొన్నారు.

 

KCP వారి వ్యవసాయ క్షేత్రం ప్రక్క లోతైన డ్రైను లో రెండు రోజుల పాటు తొలగించి, లాగుతున్నా పూర్తికాని ఎండు కొమ్మల్ని, గడ్డిని, పిచ్చి మొక్కల్ని, ఇతర వ్యర్ధాలన్నిటినీ ట్రాక్టరు ట్రక్కు నిండా ఈ రోజు నింపి, చెత్త కేంద్రానికి తరలించారు.

 

విజయవాడ దారికి పడమర దిక్కున కూడ మరికొంత తుక్కును, వ్యర్ధాలను సేకరించారు. తెల్లవారిన తర్వాత మరో ముగ్గురు కార్యకర్తలు వంతెనకు పడమర దిశగా ఉన్న కాల్వ గట్టు మీద-గతంలో పెట్టి-పెంచిన అశోక చెట్ల పాదుల్ని బాగు చేసి, ఆ గట్టు ను నడవదగ్గదిగా మార్చారు.

 

ఇద్దరు నీళ్ల టాంకు కార్మికులు యధా ప్రకారం ఊరి రహదార్ల వెంట మొక్కల పాదుల్ని నింపారు.

 

రోడ్లు ఊడ్చి, శుభ్ర పరిచే మహిళా కార్యకర్తలు తమ విధిలో తాము లీనమయ్యారు.

 

సుందరీకరణ బృందం వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖ భవనాల ప్రహరీలకు ఈ రోజు రెండవ విడత రంగు పూశారు. ఒక మహిళా కార్యకర్త ఒక ప్రక్కన పూల బొమ్మలు, చెక్కుతూ గడిపారు.

 

రేపటి  203-204 వ నెలల వైద్య శిబిరంలో సేవలందించేందుకు పాత వారితో బాటు ముగ్గురు స్వచ్చ కార్యకర్తలు కూడ  హాజరు కావలసి ఉన్నది.

 

కొద్ది మంది వేకువ 4.00 కు ముందే వైద్య శిబిరం గదులు కొన్నిటిని ఊడ్చి-శుభ్రం చేయవలసి ఉన్నది. అందుకు గాను, విజయవాడ మార్గం దగ్గర అందుబాటులో ఉండే విధంగా రేపటి మన స్వచ్చ శ్రమదానం విజయా కాన్వెంటు, ప్రభుత్వ ఆసుపత్రి మధ్య రోడ్డు లో ఉంటుంది.

అడపా గురవయ్య దంచి కొట్టిన గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ సంకల్ప నినాదాలతో 6.35 నిముషాలకు నేటి ఈ శ్రమదాన వేడుక ముగిసింది.

 

             స్వచ్చ సుందర పానశాలగ

ఎంత ఉద్ధృతి –ఎంత విస్తృతి – ఎంత మాదక ద్రవ్య సంస్కృతి!

దారులన్నీ బారులైతే “బారు” లే రహదారులైనవి

పిన్న-పెద్దల గురుల శిష్యుల భేదమన్నది మృగ్యమైనది

స్వచ్చ సుందర చల్లపల్లే పాన శాలగ మారుచున్నది!

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శుక్రవారం – 13/12/2019

చల్లపల్లి.