3077* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

నాలుగైదు వారాల తర్వాత - రెస్క్యూటీమ్ రంగంలోకి! - @3077*

         ఐదారేళ్ళ నుండీ సోమ మంగళ వారంల్లో బరువైన, రిస్కీ పనుల్తో ఊరికుపయోగపడుతున్న 5-6-7 గురు డంపింగ్ యార్డూ - తిరనాళ్ళ సందర్భవశాత్తూ పెదకళ్లేపల్లి రోడ్డూ పనుల్లో ఇతర కార్యకర్తల్తో శ్రమించడంతో సరిపొయింది.  

         మరి, ఇంత పెద్ద ఊళ్లో కరెంటు తీగల్ని తాకుతున్న చెట్ల సంగతి? కొన్ని రోడ్లకు పడిన క్రొత్త గుంటలేం కావాలి?

         అందుకే ఈ ఏప్రిల్ మాసారంభ సోమవారం 4 గురు అసలు కార్యకర్తలూ, స్వచ్ఛ - సుందర టాయిలెట్ల పని చూసుకొనే కుర్రాడూ, వీళ్లకు అండా - దండా ఐన శాస్త్రీజీ, ఆలస్యంగా నేనూ పాగోలు పరిధిలోని – నాగాయలంక మార్గంలో గల పబ్లిక్ టాయిలెట్ల దగ్గర చేరాం!

         అక్కడ 20 అడుగుల బారు పెరిగి, విద్యుత్ తీగల్తో దూరిన కొమ్మల్తో కోనోకార్పస్ చెట్టూ, వేపచెట్టూ తొలగించడమే నేటి కారక్రమం.

         తొలగించడమంటే ఉన్న పళాన నరికేయడమైతే ½ గంట పని! ఆ వృక్షాలు టాయిలెట్ల మీద పడకుండానూ, కరెంటు షాకులు లేకుండానూ, తలకాయలుపయోగించి, ఓర్పుగా - నేర్పుగా - నైపుణ్యంగా – ఎంతవరకు తీసేయాలో ఆలోచించి పనిచేస్తే గంటా ఏభై నిముషాలు - పని!

         ఇందుగ్గాను ప్రణాళికలు రచిస్తున్న బృందావనుడూ, చాల రోజుల తర్వాత పనిలో దిగి, నిచ్చెన పైకెక్కుతున్న తూములూరి లక్ష్మణుడూ, కత్తీ, రంపం ప్రయోగిస్తున్న కస్తూరీ, BSNL ల చర్యల్ని ఫోటోల్లో చూడవచ్చు!

         “ఆ బాట మీద వెళ్లే - వచ్చే వారికి కాస్త తీరికుంటే - ఒక్క 5 నిముషాలు ఆగి ఆ పనుల్ని పరిశీలిస్తే – రిస్కీ పనులంటే ఏమిటో తెలుస్తుంది!

         6:30 కు తూములూరి లక్ష్మణుని నినాదాలతో వారి కార్యక్రమం ముగిసింది.

    అంకితులు మన చల్లపల్లికి – 40

అతని భావన విశాలంగా – గ్రామ సేవలు ఉధృతంగా

పేరు పలకలు ఊరి నిండా - పనుల వేగందుమారంగా

సమాజ సేవలు బహుముఖంగా - స్వచ్ఛ సేవలు ఉదారంగా

‘వాసిరెడ్డే’ పెద్ద సైన్యం - వానికిదెనా ప్రణామం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

  01.04.2024