3090* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

      ఇవి ఆదివారం (14-4-2024) నాటి శ్రమదాన విశేషాలు @ 3090*

         ఇవి బైపాస్- సామ్యవాద వీధుల కూడలిలో 4.19 నుండి 6.10 వరకూ జరిగినవి; 102 డిగ్రీల జ్వర పీడితుడైయ్యుండీ సామాజిక బాధ్యతా నిష్టాగరిష్టుడైన ఒక సుదీర్ఘ అనుభవశాలియైన వైద్యుడు తీసిన ఫొటోతో మొదలై నవి; తొట్ట తొలుత డజను మందీ,  నిముష క్రమాన మరొక 17 మందీ పాల్గొని నిర్వహించిన సామూహిక సత్కార్యాలు ! ఒకానొకదశలో ఆ 29 సంఖ్య 40 కి మించింది కూడ!

         అసలీ సమయం కాని వేకువ సమయమేమిటీ- ఇందరు ప్రముఖులూ, అప్రముఖులూ, అధికార- అనధి కారులూ పదేళ్లుగా చేసిన పనులే పదే పదే చేస్తూ చెప్పుకోదగ్గ సంఖ్యలో ఊరి నుండి కార్యకర్తలు వచ్చి కలవక పోయినా సరే, మరో పదేళ్ళకైనా ఈ ఊరిని స్వచ్ఛ- శుభ్ర - సౌందర్యాలతో నింపేయగలమనే విశ్వాసమేమిటీ?

         ఒక నిరాశామయ గ్రామ సమాజంలో గ్రామ సౌకర్య ఆశలు పెంచుతూ- ఇన్ని లక్షల పని గంటలు శ్రమించే కార్యకర్తల మూలతత్త్వమేమిటి? అటు ఊళ్ళో సగంమంది పౌరుల నిరాసక్తతకూ - ఇటు 30-40 మంది కార్యకర్తల లక్ష్య సిద్ధికీ పొంతన ఎప్పుడు?

         నిన్నటి దాక విజయవాడ రహదారి లో ప్రసరించిన శ్రమదానం ఈ సాగర్ టాకీస్ బైపాస్ వీధికి మారిన ముఖ్య కారణాలు దాసరి స్వర్ణలత గారి తృతీయ సంస్మరణమూ, ఆ సందర్భంగా ‘మనకోసం మనం’ ట్రస్టుకు ఆమె భర్త రామ మోహన రావు గారి 1 లక్ష భూరి విరాళమూ, ఆదర్శ జీవనులూ, పుణ్యదంపతులూ అని ఎక్కడో ఉండరు - ఇలా మన మధ్యే - సాదాసీదాగానే ఉంటారు!

         అసలు వేకువ 4.18 కే వచ్చి, నానారకాల శ్రమలూ చేయడం గాని, అల్పాహారం పేరుతో చాల గట్టి ఆహారాన్ని 6. 40 కే తిని నిభాయించుకోవడం గాని-స్వచ్ఛ చల్లపల్లి కార్యకర్తలకే చెల్లుతుంది!    

    బైపాస్ వీధి 150 గజాల పొడవునా గంటా 50 నిముషాల సందర్భోచిత శ్రమ ఎలా విస్తరించిందంటే : -    

 -  ఒక సుందరీకరణ నిపుణుడు చిందర వందరగా పెరిగిన చెట్టు కొమ్మలకు బాగా బుద్ధి చెప్పడమూ,      

  - రహదారి మార్జిన్ల, కుండీల మాటుల వ్యర్ధాల- తుక్కుల పని కొందరు పట్టడమూ,     - ఎత్తు వాహనాల కడ్డం పడుతున్న చెట్ల కొమ్మల్ని ఒకాయన నిర్దాక్షిణ్యంగానరకడమూ,

 - ఊడ్చే వాళ్ళు ఊడ్వడమూ, 20 నిముషాల్లోనే లోడింగు వారు తడాఖా చూపడమూ,

  - కోడూరు (చెక్ పోస్టు) వేంకటేశ్వర రావు గారి క్రమం తప్పని 520/- విరాళమూ,

 చివరగా క్రొత్త మైకుతో ప్రాత అంజయ్య గారు నినాదాల్ని గర్జించడమూ,

కాంపౌండరు శేషు గారు ‘స్వయం విరచిత ఓటు చైతన్య’ గీతమాలపించడమూ,

     బుధవారం వేకువ మన శ్రమదానం మళ్లీ విజయవాడ రోడ్డు కు మారిన సంగతీ....

 

          అంకితులు మన చల్లపల్లికి – 60 &61

 

మహత్తర సందేశమిచ్చుట మాకు కూడా సాధ్యమేనని

పెద్ద చదువులు, పెద్ద పదవులు గ్రామ సేవకు అక్కర్లేదని

మురికి పనులూ, చెత్తపనులూ మోజుపడి చేస్తున్న ఇద్దరు-

కనకదుర్గా, చిట్టూర్లక్ష్మీ క్రమం తప్పక ఋజువు పరచిరి!

 

 - ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త    

  14.04.2024