3091* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

చల్లపల్లి వెలుపల రెస్క్యూ టీమ్ సేవలు - @3091*

         సోమవారం (15.4.24) వేకువ బాధ్యతల వంతు గ్రామ భద్రతా దళానివి కనుక వేకువ 4.15 కే గస్తీ గది వద్దకు ఆ 5 గురూ చేరారు. చల్లపల్లి సంగతలా ఉంచి, 4 కిలోమీటర్ల దూరాన - పాగోలు పంచాయతీ పరిధిలోని రహదారిని చేరుకొన్నారు!

         సదరు రోడ్డు రెండు ప్రక్కలా సజ్జా ప్రసాదు గారి మంగళాపురం కార్మికులు అంతకు ముందే శుభ్రపరిచారు గాని, వెడల్పాటి డ్రైన్ లోకి వారు దిగినట్లు లేరు!

         చాలకాలంగా లేనిది ఈ ప్రాంతం వాగులూ, డ్రైన్లూ ఫిబ్రవరికి ముందే ఎండిపోయాయి! వాటిలోని చెప్పనలవి గాని వ్యర్ధ దరిద్రాలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ప్రాత గుడ్డలూ, ప్లాస్టిక్ లూ, ఎండు పుల్లలూ, కట్టెలూ, తాడి మొద్దులూ, ఆకులూ, సీసాలూ వీధి సౌందర్యాన్ని వెక్కిరిస్తున్నాయి.

         అది జాతీయ రహదారో - పాగోలు పంచాయతీ మురుగు కాల్వో - ఏదైతేనేం - చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తల కంటబడితే చచ్చాయనే అర్థం! నేను కాక మొత్తం 5 గురు కార్యకర్తలు - అందులో ఒక్కరు మినహా అందరూ లోతైన డ్రైన్లోకి దిగి, పైన చెప్పినంత పనీ - అంటే వ్యర్థాల సంహారం సాగించారు.

         6.12 దాక ఆ సంహారం సాగి, 150 గజాల డ్రైన్ బాగుపడింది గాని - అక్కడ ఏ దుమ్మూ - ధూళి - బూడిద ఉన్నాయో గాని అందరి బట్టలూ, మొహాలూ మసి కొట్టుకుపోయాయి!

         6.30 సమయంలో గంగులవారిపాలెం వీధి గస్తీ గది వద్ద తూములూరి లక్ష్మణరావు పలికిన స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలు ఇంకో 6 గురం ప్రతిధ్వనించి - ఇళ్లకు చేరాం.

        చినకళ్ళేపల్లికి చెందిన రైతు గుత్తికొండ రామారావు గారు ప్రతి సంవత్సరంలాగే ఒక ధాన్యం బస్తా విలువచేసే 1,550/- ను స్వచ్చోద్యమ ఖర్చుల కోసం సమర్పించారు.

          అంకితులు మన చల్లపల్లికి – 62

స్వచ్ఛ - సుందర ప్రక్రియలలో అలుపెరుంగని లక్ష్మణ

ఆడ - మగ పనులను వివక్షత అసలు లేని విలక్షణ

శ్రమించడమే తప్ప స్వార్థం జాడ తెలియని సులక్షణ

స్వచ్ఛ  - సుందర ఉద్యమానికి సలక్షణ మగు రక్షణ!

 - ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త    

     15.04.2024