3092* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

పాగోలు సమీపంగానే 3092* వ శ్రమదానం!

            మంగళవారం (16.4.24) వేకువ క్రొత్తగా మళ్లీ కలిసిన BSNL కార్యకర్తతో సహా 4:20 కే గస్తీ గది వద్ద 6 గురి కలయిక; అక్కడి నుండి 3 కిలోమీటర్లకు పైగా దూరాన పాగోలు గ్రామం వెలుపలకు చేరిక; 6:10 దాక 6 ½ అడుగుల్లోతు డ్రైనులో దిగి, వాళ్ళు ప్రోగేసిన బళ్ల కొద్దీ వ్యర్ధాల కూడిక; ఇక పాగోలు గ్రామ స్వచ్ఛ కార్యకర్త కంఠంనేని రామబ్రహ్మం వాళ్లలో చేరిక!

            అంతేనా - తల్లి గారి శ్రాద్ద కర్మల వల్ల 2 వారాలకు పైగా శ్రమదానానికి దూరమైన మల్లంపాటి ప్రేమానందుడు 4 కిలోమీటర్లు వచ్చి, ఎకాఎకీ లోతు డ్రైన్ లో పనిలో వంగిన వైనం! నాతో సహా 5:30 కు డ్రైన్ లో కనిపించిన కార్యకర్తలు 7 గురూ, చీపురుకు పని చెప్పుతూ కంఠంనేనీ, శ్రమదాన దృశ్యాల్ని చిత్రీకరిస్తూ ప్రాతూరీ!

            వ్యర్ధాల సంగతికొస్తే - పాగోలు రోడ్డంతా వరి గడ్డి బళ్ళ నుండి జారిపడిన ఎండు పరకలూ, పచ్చని చెట్లకు తగులుకొని, ఇరుక్కొని వ్రేలాడుతున్న తెల్లని గడ్డి పీచులో!

            ఎండిన లోతు మురుగుకాల్వలో ప్రక్క పొలం గట్టు నుండి జారిన గడ్డీ, తాటాకులూ, ఎలా వచ్చాయో తెలియని తాడి బొందులూ, కొట్టి పడేసిన అరటి కాండాలూ, రకరకాల ప్లాస్టిక్ వస్తువులూ!

            నదీనాం సాగరో గతిఃఅన్నట్లు - దారినపోయే వాళ్ళు వాడేసిన సీసాలు, కాగితం పొట్లాలు, ఎంగిలాకులు, డ్రైను ఉత్పత్తులైన పిచ్చి ముళ్ల చెట్లూ వగైరాలూ ఎండిపోయిన ఉత్తరం డ్రైను.

            ఇలా చెప్పుకుపోతే ఏ ఒక్కనాటి శ్రమదానంలోనైనా తరగని విశేషాలే! కాలుష్య కారక వ్యర్ధాల మీద ఏ ఒక్కనాడూ అగని స్వచ్ఛ కార్యకర్తల దండయాత్రలే!

            కస్తూరి శ్రీనివాసుని క్రొత్త రకం నినాదాలను మిగిలిన వారు పునరుద్ఘాటించింది గస్తీ గది వద్ద 6:30 కు,

            రేపటి వేకువ విస్తృత కార్యకర్తలు కలుసుకోవలసింది విజయవాడ రహదారిలోనే!

            అంకితులు మన చల్లపల్లికి 63

సరిగా గమనింపుడు మన నాయుడు మోహనరావును

కాలుష్యము మీద అతని కదనకుతూహలమును

కత్తితొ - డిప్పతొ చేసే శ్రమ విన్యాసములను

చెత్త బండి నెక్కి తుక్కు సర్ది అమర్చుటను!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

  16.04.2024