3093* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

3093* వ నాటి వీధి పారిశుద్ధ్య వివరాలు!

         బుధవారం 17-4-24 - శ్రీరామనవమి పర్వదినాన - చల్లపల్లి నుండి విజయవాడ రహదారిలో - పద్మప్రియ దుకాణం - వినాయక ఏజెన్సీల నడుమ గంటా 45 నిముషాల పాటు నెరవేరిన సామాజిక బాధ్యతలవి! ఈనాటి పనిపాటుల సోదరులు 23 మంది. వారిలో ఎనమండుగురు మినహా మిగిలిన 15 గురూ నిర్ణీత సమయం ముందుగానే విజయవాడ రహదారి పైకి చేరుకొనిరి!

         ఒక అంచనా ప్రకారం కార్యకర్తల్లో సగం మంది ఇంటి బాధ్యతల్ని కూడా ఇంతగా పూర్తి చెయ్యరు, ఎంతో తప్పని సరైతే గాని ఒక్క వేకువయినా శ్రమదానాన్ని మానరు; ఈ పండగ వేళైనా - మురికి, మురుగు, దుమ్ము ఒంటికంటించుకొనే పని వదులుకోరు; ఇక ఈ వేసవి ఉక్క తడాఖా చెప్పేదేముంది. దుమ్మూ - ధూళీ చెమటతో కలిసి అందరి మంచి పేస్టు తయారీ తప్పదు!     

         ఈ ఉదయం తెల్లారాక - పరిశీలిస్తే కనీసం నలుగురి బట్టలూ, తలలూ చెమటతో తడిసి ముద్దై కనిపించాయి; మరో నలుగురి చొక్కాలు సహజమైన రంగులు పోగొట్టుకొని, మట్టీ - బూడిద అలముకొన్నాయి!

         చీకటి సమయాన డ్రైన్లో దిగినపుడు ముళ్ళే బట్టలకి పట్టుకొన్నవో - ప్లాస్టిక్ కవర్లలో పనికిరాని – పారేసిన పచ్చళ్లే కంపు కొట్టినవో - ఎండు కొమ్మలే ఒంటికి గీసుకున్నవో - వాళ్ళు పెద్దగా పట్టించుకొంటే గదా! ఊరి పట్ల బాధ్యత, పని పట్ల నిబద్ధత, మరికాస్త చిత్తశుద్ధి ఉంటే జరిగే పనులిట్లాగే ఉంటాయి మరి!

         రోడ్డును ఊడ్చిన, ప్లాస్టిక్కులు ఏరి, 2 గోతాల్లో నింపిన, నాలుగైదు చెట్లను సుందరీకరించిన పనులట్లా ఉంచి నేటి పని సమయం మించిపోతుందని ఇద్దరు మరో నలుగుర్ని ఉషారు చేస్తూ, పనలు పట్టి - డిప్పల్నింపి - ట్రక్కు పైకి చకచకా విసురుతున్న దృశ్యమూ, చాకచక్యంగా పైనున్న కార్యకర్త అందుకొని, 2 ట్రాక్టర్ల వ్యర్ధాల్ని   ఒకదాంట్లోనే త్రొక్కి, సర్దుతున్న ఒడుపూ నేను ఇంటికి వెళ్లాక కూడా గుర్తొస్తున్నవి!

         3093* వ నాటి నినాదాల్ని BSNL నరసింహారావు ప్రకటించగా - డాక్టరు గారు నేటి పనుల్ని సమీక్షించగా – శంకర శాస్త్రి గారు 17 ఏళ్ల నాడు తనను వీడి వెళ్లిన తన అదృష్టం (లక్ష్మీ కల్యాణి గారి) జ్ఞాపకార్ధం ట్రస్టుకు 5000/- విరాళమూ, కార్యకర్తలకు రవ్వ లడ్డుల పంపకాలతో –

         నేటి కార్యక్రమం పరిసమాప్తి!

         రేపటి వేకువ శ్రమ గమ్యస్థానం బెజవాడ రోడ్డులోని వినాయక ఏజెన్సీ వద్దనే!

         అంకితులు మన చల్లపల్లికి 64

పని వినోదం – తను ప్రశాంతం – గ్రామ మునకది అంకితం  

ఎవరెవరొ బలవంతపెడితే ఈమె చీపురు పట్టెనా?

అంతరాత్మ ప్రబోధమే తన అడుగు నిచటకు కదిపెనా?

పెద్ద కృష్ణకుమారి సేవలు స్థిరముగా కొనసాగునా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  17.04.2024

శంకర శాస్త్రి గారు 17 ఏళ్ల నాడు తనను వీడి వెళ్లిన తన అదృష్టం (లక్ష్మీ కల్యాణి గారి) జ్ఞాపకార్ధం ట్రస్టుకు 5000/- విరాళమూ, కార్యకర్తలకు రవ్వ లడ్డుల పంపకం