3094* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

ఇరవైముగ్గురి స్వచ్ఛంద శ్రమదానం - @3094*

         గురువారం (18.4.24) వేకువ సంగతన్నమాట! శ్రమ సంఘటనా కాలం 4.15 - 6.12; స్థలం బెజవాడ రాదారిలోనే - చిన్న కార్ల మరామత్తు షెడ్డుకు దగ్గరగా - రోడ్డుకు తూర్పు - పడమరల వీధి మార్జిన్లూ, డ్రైన్లూ!

         వాటితో బాటు ఘనత వహించిన కొందరు పౌరుల బాధ్యతా విముఖతకు గుర్తుగా - నిన్న కారకర్తలు కష్టించిన కొంత చోటు కూడ! పనికట్టుకొని కార్యకర్తల సహనానికి పరీక్ష పెట్టే వాళ్లు పెటుతూనే ఉన్నారు, పదేళ్లుగా వాలంటీర్లు కొందరు గ్రామస్తులు విధించే పరీక్షల్లో ఇప్పటి దాకఉత్తీర్ణులౌతూనే ఉన్నారు!

         నేనేదో కాగితం మీద ఇలాంటి సంగతులు బరుకుతుంటాను గాని – వచ్చీ రావడంతోనే చేతులకు తొడుగులూ, హస్త భూషణాలుగా కత్తులో, గొర్రులో, చీపుళ్లో, గోకుడు పారలో ధరించి, మురుగు కాల్వల్లో దిగి, అసహ్యకర కాలుష్యాల్ని తొలగించే కార్యకర్తల కివన్నీ పట్టవు.

         క్రింద సీసా పెంకులు కాళ్ళలో దిగకుండానూ, ముళ్ల చెట్ల కొమ్మలు చేతులకు గీసుకుపోకుండానూ, చెమటలు తుడుచుకొంటూనూ - వాళ్లది తీరికలేని పరిస్థితి!

ఈపూట చెప్పుకోదగ్గ శ్రమ విశేషాలేవనగా :

- నిన్నటి, నేటి డ్రైన్లలో పడున్న వ్యర్ధాల గుట్టల్ని ట్రాక్టర్ లో కేక్కించే క్రమంలో నేటి నినాద కర్తైన ఒక చెత్త లోడింగు ఎక్స్ పర్టుని కార్యకర్తలు పిలవడం,

- ఒక కన్ను నీరు గారుతుంటే తాను తీసుకొంటున్న విశ్రాంతిని భగ్నం చేస్తూ అతడు వచ్చి చెత్త బండెక్కేయడం,

- ఏ బాధ్యతారహితులో నరికి డ్రైన్లో పడేసిన 5 నిలువుల తాడి చెట్లును ముగ్గురు కార్యకర్తలు పైకి లాగి, రోడ్డు వార చెట్ల కానించి, అందంగా సర్దడం,

- ఇంకా, 2 గోతాల 2 రకాల సీసాలేరడమూ, రహదారి వాహనాల్ని కాచుకొంటూ వీధిని ఊడ్వడమూ,

- ట్రక్కు పట్టక చిన్న కార్ల షెడ్డు దగ్గర ఇంకొన్ని వ్యర్ధాలు రేపటికి మిగిలిపోవడమూ,

- నాయుడు మోహనరావు ఊరి స్వచ్ఛ - శుభ్ర – సౌందర్య సాధనా సంకల్ప నినాదాల్ని మూడు మార్లు దంచడమూ,

- రేపటి వేకువ కూడ మన కృషి 6 వ నంబరు కాల్వ చిన్న కార్ల షెడ్డుల మధ్యేనే సమష్టి నిర్ణయమూ.....!

         అంకితులు మన చల్లపల్లికి 65

అతడు గంధం వెంకటేశ్వరధ్యానమండలి కర్మవీరుడు

చల్లపల్లి స్వచ్ఛ శుభ్రత సాధనకు నిలబడిన ధీరుడు

కత్తి, గొర్రూ పట్టినప్పుడు కలుషితంపై పోరునాపడు

గ్రామ కార్యం – ఇంటి క్షేమ సమన్వయంతో సాగు నాతడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

  18.04.2024