3095* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు వెంటనే మానేద్దాం!

జనాభా 25 వేలూ - శ్రమదానం 25+2 మందిది! @3095*

            ఇది శుక్రవారం 19/4/24 నాటిదే కాదు - 80% రోజుల్లోనూ దాదాపు - ఇదే నిష్పత్తి! ఊరెంత పెద్దదో - చల్లపల్లి వందలాది వీధి సమస్యలెంతటివో పరిష్కరిస్తే గ్రామ సమాజానికేపాటి మంచో పట్టించుకోక వదిలేస్తే వచ్చే కష్టనష్టాలేమిటో - ఈ ఊళ్లో కొన్ని వేలమందీ, పరిష్కార సత్కార్యాచరణకు దిగే రెండో మూడో వందల మందైనా ఉన్నారు!

            అసలిలాంటి ఆలోచన్లే లేని - ఉన్నా పనిలో దిగేవాళ్ళే లేని ఊళ్లెన్నో! మరి ఆ వేలాది గ్రామ వీధులకీ ప్రతినిత్యం ఏదోక చోట స్వచ్ఛ కార్యకర్తల చెమటతో పునీతమయ్యే చల్లపల్లి వీధుల స్వచ్ఛ - పరిశుభ్ర - హరిత  సౌందర్యాలకీ పోలికుందా?

            నరుల చెమటను తడిసి మూలం ధనం పంటలు పండవలెనోయ్.... మందగించక ముందుకడుగేయ్..అనే 140 ఏళ్ల నాటి గురజాడ స్వాప్నిక సూక్తుల్ని ఆచరిస్తున్నది మన ఊరైనందుకు మనం గర్వించవచ్చు! నిద్రా మైధున - భయోద్వేగాలు అందరికీ ఉంటాయి గాని సంఘజీవులైన మనుషులకు సామాజిక స్పృహ ఉండొద్దా?

            ఈ 3095* వ పూట చాల క్లిష్టమైన వాతావరణంలో - ఈ పాతిక మంది శ్రమవిన్యాసాలు చూస్తుంటే - ముఖ్యంగా 5.45 - 6.10 నడుమ డ్రైన్లలో వీధి మార్జిన్లలో జరిగే పనుల్ని వీక్షిస్తే విశేషించి చెత్తాచెదారాల లోడింగు చురుకుదనాన్ని గమనిస్తే - దుమ్ములేపుతూ రోడ్లూడ్చే వాళ్లని పరిశీలిస్తే

            ఒక సినిమా కవి ఒక ఇల్లాలి వివిధ దశల కర్తవ్య నిర్వహణల్ని వర్ణించిన సొగసు చూడతరమా! నీ సొగసు చూడతరమా?” అనే పాట పల్లవి గుర్తొచ్చింది! పాటలు, కవుల సూక్తులు వేఱూ, ఇలా ప్రతి వేకువ నిష్టగా తమ ఊరి మంచి కోరి, క్షేత్రస్థాయిలో చేసే శరీర శ్రమలు వేఱు!

            బెజవాడ రోడ్డులోని చిన్న కార్ల షెడ్డు - KCP వారి చెరకు తోటల ప్రాంతలో నేటి శరీర కష్టం పిదప -

            షణ్ముఖ శ్రీనివాసుని సుస్పష్ట త్రివిధ నినాదాలకూ పాతిక గొంతులు దీటుగా బదులిచ్చి, కారణం తెలీదు గాని తన పేరు చెప్పని దాత 1000/- విరాళాన్ని నేనే ట్రస్టుకు సమర్పించగా నేటి కార్యక్రమం ముగిసింది.

            రేపటి వేకువ కూడా మన శ్రమదానానికి పాత్రమయ్యే చోటు విజయవాడ రోడ్డులోని చిన్న కార్ల షెడ్డు నుండే!

      అంకితులు మన చల్లపల్లికి 66

శ్రమదానం సమయంలో చాల వరకు నిశ్శబ్దం

ఎప్పుడైన ఎచటనైన ప్రశాంతముగ ఆ వదనం

వైద్యశాల విధులలోన వృత్తి నిబద్ధత చూపే

చిన్న కృష్ణకుమారిది విశిష్టమైన ప్రయాణం!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త          

  19.04.2024

పేరు చెప్పని దాత 1000/- విరాళం