3096* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

3096* వ శ్రమదానం కూడా...!

         మళ్లీ అదే బెజవాడ రహదారి, అదే ప్రాత కార్ల రిపేర్ల షెడ్డూ, ఆ పాతిక మందే శ్రమదాతలూ, సమయం కూడ వేకువ 4.20 - 6.12! కాకపోతే 6 వ నంబరు కాలువ దిశగా స్థలంలో కొంత పురోగతి!

         దశాబ్దకాలంగా గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ కష్ట జీవుల్ని – సామాజిక బాధ్యత గుర్తించని కొందరు గ్రామస్తుల్నీ – ప్రయాణికుల్నీ తలచుకొంటే మాత్రం ఆశ్చర్యం కలుగుతుంది - నవ్వొస్తుంటుంది.

         గత 10 రోజులుగా ప్రతి వేకువా పాతిక మంది చొప్పున ఇంత రద్దీ రహదారిని సుందరీకరిస్తుంటే మళ్లీ సీసాలు - ఎంగిలాహారాలు శుభ్రంగా ఉన్న డ్రైన్లలోకి విసిరే వాళ్లు మానలేదు; నేటి కార్యకర్తల్లో ముగ్గురు మళ్లీ వెనక్కి వెళ్లి వాటిని ఏరడం అపలేదు! వాళ్ళకి అలసట లేదు, వీళ్లకి వేసటా లేదు!

         ఈ పూట కూడ కత్తుల వాళ్లు బాటకు తూర్పు డ్రైనులోపలా, గట్టుపైనా కొరగాని పిచ్చి – ముళ్ళ మొక్కల్ని నరుక్కుంటూ పోయారు!

         అస్తవ్యస్తంగా విస్తరిస్తున్న, కరెంటు తీగల్లోకి చేతులు చాస్తున్న చెట్ల కొమ్మల్ని చూసి తట్టుకోలేని ఒక సుందరీకర్త నిచ్చెనెక్కి ఇద్దరి సాయంతో వాటి అంతుచూసి, భానూదయం కన్న ముందే పని పూర్తి చేసుకొన్నాడు! ఆ 2 3 చెట్ల శాఖలే  బండెడు గుట్టైనవి!

         KCP వ్యవసాయ క్షేత్రం గేటు వద్ద లోతు మురుగు కాల్వలో 11 మంది గంట పాటు శ్రమిస్తే గాని వ్యర్ధాలొక కొలిక్కి రాలేదు.

         ఈ తెల్లవారు జామున కూడ ఒక గోనె సంచీడు ప్లాస్టిక్ సీసాలూ – కప్పులూ, మరో గోతాం గాజు సీసాలూ ఏరడమైనది.

         ఈ శనివారం - (20-4-24) ప్రోగుబడ్డ తుక్కులో కొంత మాత్రమే ట్రాక్టర్లో నింపబడింది. సగం పైగా – ముఖ్యంగా పచ్చి తుక్కు వదిలేశారు. షెడ్డర్ నే ఇక్కడకు తరలించి, వాటిని పొడి చేస్తారని తెలిసింది.

         మార్చి నెల మాసపు ట్రస్టు జమా ఖర్చులు ప్రకటింపబడ్డాయి – గురవారెడ్డి గారి 5 లక్షల వితరణ,  కాకి మాధవరావు గారి లక్ష రూపాయల దాతృత ఇంకా ఇతరుల సహకారములు పోనూ నాలుగైదు లక్షల లోతు తేలింది. అంతకు ముందు పైడిపాముల కృష్ణకుమారి గారి గ్రామ బాధ్యతా సంకల్ప నినాదాలు విన్పించాయి.

         రేపటి శ్రమ కోసం మరొక మారు ఇదే చిన్న కార్ల షెడ్డు వద్దనే కలవాలని నిర్ణయమైనది.

      అంకితులు మన చల్లపల్లికి 67

వీధుల కాలుష్యంపై ఎక్కుపెట్టు బాణం వలె

పర్యావరణ ధ్వంసంపై పగబట్టిన సర్పం వలె

ఎన్ని బ్రహ్మముహుర్తాల ఎన్ని సేవలితనివి!

బాణావతు రమేష్ శ్రమలు పాటిచేయరానివా?

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త 

  20.04.2024