3097* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

ఆదివారం (21-4-2024) నాటిది 3097* వ శ్రమదానం!

         వేకువ 4.15 కే బెజవాడ బాటలోని కె.సి.పి. వారి వ్యవసాయ సుక్షేత్రం వద్దకు చేరుకొని, దాన సన్నద్ధులైన వారు 15 మందీ, కాసేపటి తర్వాత లెక్కిస్తే 33 గ్గురూ, చివరికా సంఖ్య 38 గా తేలింది. బహుశా ఆదివారం ప్రభావమై ఉంటుంది!

         ధ్యాన మండలి వారి ప్రణాళికా, మరికొందరు సుందరీకర్తల పూనికా, ఉద్యోగ విధుల వల్ల ఇతర దినాల్లో రాలేని వారి కలయికా ఈ పెద్ద సంఖ్యకు కారణం కావచ్చు!

         చర్చిలూ, మసీదులూ, గుడుల్లో ప్రశాంతత, పరమార్థం వెతుక్కొనే పనులకు భిన్నంగా, ఇంటి పనుల పిలుపు స్పందనకు మినహాయింపుగా, బద్దకాలకు దూరంగా...... ఇలా ఊరి జనుల బాగోగుల దృష్ట్యా ఇందరు వేకువ నాలిగింటికే వీధుల్లోకి రావడమే స్వచ్ఛ చల్లపల్లి ప్రత్యేకత!

         చిన్న కార్ల షెడ్డూ – 6 వ నంబరు కాల్వ వంతెనల నడుమ గల రహదారి భాగాన్ని స్వచ్ఛ – శుభ్ర సుందరీకరించ పూనడమే ఈ కలికాలంలో వింత!

         ఇందులో ఎవరైనా గుర్తింపు కోసమో - మీడియా కంటబడేందుకో - కేవలం ఫొటోలకోసమో వచ్చిన వాళ్ళున్నారా అనీ,

         పని చేస్తున్నట్లు నటించే తెలివైన వాళ్లున్నారా అనీ,

         అరగంట పని తర్వాత చెమట కార్చనిదెవరనీ,

         చీపుళ్ళతో ఊడ్చి ఊడ్చి, చేతులూ, గూళ్లూ నొప్పిరానిదెవరికనీ, సీసాలేరుతూ, ప్లాస్టిక్ తుక్కులు ప్రోగేస్తూ పొలం లోతట్టుక్కూడా వెళ్ళిన దెవరనీ....పరిశీలించాను!

         నిన్న - మొన్న శుభ్రం చేసిన చోట్ల మళ్లీ వ్యర్ధాలు పడేసిన వారిని కార్యకర్తలు విసుక్కోలేదనీ, తిట్టుకోలేదనీ గమనించాను!

         రహదారికి తూర్పు - పడమర డ్రైన్లు - అటు డజను మందీ, ఇటు డజను మందీ ఎంత ఓర్పుగా, నేర్పుగా బాగుచేశాక ఎంత ముచ్చటగా మారిందీ కనిపెట్టాను. వేసవి ఉక్కనూ, కారే చెమట వల్ల తమలో లోపించే నీటిని భర్తీ చేయడానికి ఎన్నిమార్లు నీళ్లు త్రాగారో చూశాను!

         6.30 సమయంలో అందరూ పాలంలో దిగి, మోహనరావు నాయుడు గారి సక్రమ గ్రామోన్నత నినాదాలకు వంతపలకడమూ విన్నాను!

         పనిలో పనిగా శేషు కాంపౌండరు పాడిన పాటనూ అందరితో బాటు ఆస్వాదించాను.

         మళ్లీ బుధవారం వేకువ మనం కలుసుకోదగిన చోటు బెజవాడ దారి మీది 6 వ నెంబరు కాలువ వంతెన అని గ్రహించాను.

      అంకితులు మన చల్లపల్లికి 68

అసుపత్రి ల్యాబులోన అందరి రుధిరం పిండే –

అందులోన లోపాలను ఆమూలం శోధించే –

బత్తుల రవి వీధికెక్కి శ్రమదానం చేస్తుంటే

సామాజిక స్పృహకర్ధం చప్పున తెలిసొస్తుంటది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   21.04.2024