3101* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమయ్యే - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

సంఖ్యాపరంగా మరొక మైలురాయినధిగమించి – 3101* వ నాడు

          ఈ గురువారం (25.4.24) వేకువ గంటా 50 నిముషాల పాటు సదరు మైలురాయిని దాటించిన స్వచ్ఛ కార్యకర్తలు 5+17+3 = 25 మంది! ఆ స్థలం బెజవాడ వెళ్ళే బాటకు చెందిన 6 వ నంబరు పంట కాల్వ వంతెన ప్రాంతం! సమయం కొలత 4.20 - 6.10! పొందగలిగితే - ఆ సత్కార్యాచరణ స్ఫూర్తి వెలకట్టలేనిది!

          ఏ గ్రామస్తులైనా - ఏకాస్త స్వచ్ఛ – పరిశుభ్ర స్ఫురణ ఉన్నా - ఆ బాటలో వెళ్లేప్పుడు కొంచెం నిదానించి, పరిశీలించి, 2 వారాల క్రితం ఆ రహదారీ, దాని ఉభయ బోదె కాలువలూ, వాటి గట్లూ ఎంత నికృష్టంగా ఉన్నవో - ఇప్పుడెందుకిలా ఆహ్లాద జనకంగా మారినవో గ్రహించగలరు.

          అయాచితంగా, పైసా ఖర్చు లేకుండా, ఎవరు - ఎందుకు ఎంతగా శ్రమిస్తే ఈ మాత్రం రహదారి హరిత సౌందర్యం ఉట్టిపడెనో ఆలోచించగలరు! ఇదొక్క వీధే కాదు – గ్రామంలోని ముఖ్య వీధులూ, చుట్టూ నాలుగైదు కిలోమీటర్ల దాక 9 రహదారులూ తీర్చిదిద్దినట్లు మారిన వైనమేదో – ఏ త్యాగధనుల చెమట చలువో తెలుసుకోగలరు!

          శ్రమదానం జరుగుచున్న చోటు గుండా చూసీ - చూడనట్లు వెళ్ళిపోయేవారు కాస్త అగి, వాకబు చేస్తే - పంట కాల్వ వంతెన దగ్గర - ఏడడుగుల లోతున తడిసిన చెమట బట్టల్తో 10 మందీ, వంతెన తూర్పు పడమర గట్ల మీద గోతాల కొద్దీ వ్యర్ధాల్ని ప్రోగులు చేస్తున్న ఆరేడుగురూ, రోడ్డు పడమర డ్రైన్ లో ఏడెనిమిది మంది కత్తుల - దంతెల - చీపుళ్ళ - డిప్పల వాళ్ళూ ఏం ఖర్మ పట్టి వేకువ 4.15 కే వచ్చి, శక్తి కొద్దీ ఊరి మంచికి పాటుబడుతున్నారో అవగతం చేసుకోగలరు!

          ఒకవేళ అట్టి వారికి మంచి సాహిత్య సంగీతాభిలాష గనుక ఉంటే - పనిలో పనిగా మైకు నుండి సామాజిక ప్రయోజనకరమైన పాటలూ వినగలరు!

          చివర్లో 6.30 కు మంచి కాఫీగూడ సేవించి, ఆ పాతిక మంది శ్రామికులతోపాటు పల్నాటి అన్నపూర్ణ ప్రకటించిన గ్రామ స్వచ్ఛ - సుందరోద్యమ నినాదాలతో గొంతు కలపనూవచ్చు! DRK గారి సమీక్షా వచనాలూ వినొచ్చు!

          ఐతే – ఒక చిన్న ఇబ్బంది ఉంటే ఉండవచ్చు – అలా ఆగి, పరిశీలించన వాళ్లలో ఒకరిద్దరు స్వచ్ఛ కార్యకర్తలుగా మారినా మారవచ్చు! తస్మాత్ జాగ్రత్త!

          రేపటి వేకువ మనం కలుసుకోదగింది కూడా ఇదే బెజవాడ బాటలోని పంట కాల్వ వంతెన వద్దనేనట!    

     అంకితులు మన చల్లపల్లికి – 72

అడుగో భోగాది వాసు - లౌక్యానికి భలే బాసు

అతని కరాటే శిక్షణ - ఆతని సభ్య ప్రవర్తన

పరిస్థితుల పరిశీలన – స్వచ్చోద్యమ అనుశీలన

అనూహ్యముగనే ఇప్పటి అందోళన - ఆవేదన!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

  25.04.2024