3103* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

3103* వ నాటిది 24+3 మంది కష్టం!

          ఆరోజు పేరు శనివారం, (తే)ది 27 వదీ, మాసం ఏప్రిల్, సమయం 4.15 - 6.10 కి పరిమితం, స్థలం 6 వ నంబరు కాల్వ మీద వంతెన కటూ - ఇటూగా!

         నారాయణరావునగర్ వైపుగా పంటకాల్వ ఉత్తరం గట్టు 50 గజాలూ, వంతెనకు దక్షిణ పశ్చిమంగా 50-60 గజాల వీధీ ఈ వేకువ కాలం కార్యకర్తల చెమటను రుచి చూశాయి! తత్ఫలితంగా నాలుగైదు  ముళ్ల - పూలచెట్ల 30-40 కొమ్మలకు ఎత్తైన కరెంటు తీగల మధ్య నుండి విముక్తి కలిగింది - కరెంటు షాకు తగిలే అవకాశమున్న ఆ పనిలో నిమగ్నుడైన ఒకానొక సుందరీకర్తను గమనించండి!

         బాటకు పశ్చిమ మురుగుకాల్వలో మరో నలుగురు చెత్తను పోగులు చేస్తూ, పిచ్చి మొక్కల పని బట్టడం కూడ చూడండి. ట్రాక్టర్ కు తగిలించిన గోతాల్లో డ్రైన్లోని, రోడ్డు ప్రక్కలా ఏరినవి 2 రకాల ఎంగిలి సీసాలు నిండిన సంగతీ పట్టించుకోండి!

         మరి - పంట కాల్వ ఉత్తరం గట్టున - ఎగుడుదిగుడుగా కాలు నిలవని చోట - ముళ్ళ మొక్కల్ని నరుకుతూ, చెత్తని ఊడుస్తూ, చెట్ల పాదుల్ని సరిజేస్తూ, ప్లాస్టిక్ తుక్కులేరుతూ డజను మంది ఎందుకు శ్రమించారో తప్పక ఆలోచించండి – ఆరా తీయండి!

         జోడు కత్తుల ఉపాధ్యాయుడీ పూట ఎందుకు రాలేదోగాని, జోడు చీపుళ్లతో వంతెన మీద ఊడుస్తున్న ఒక పెద్దాయన పట్టుదలేంటో వాకబు చేయండి!

         ఈ వారంలోనే 3 వ సారి అనుకొంటా - చీపుళ్ళతో తుడిచి, అక్కడి దుమ్మునూ - ఇసుకనూ పారల్తో, డిప్పల్తో మోసుకెళ్లి రోడ్డు మార్జిన్ గుంటలు నింపుతున్న ఐదారుగురి ప్రయత్నాన్ని అభినందించండి!

         యాక్సిడెంట్లో దెబ్బతిన్న కాలుతో ఒకామె, దెబ్బ తినకుండానే లోపమున్న కాలితో మరొకాయన ఎంత మొండిగా ప్రయత్నిస్తున్నారో గ్రహించండి!

         ఇక చివర్లో అందరూ అర్ధవలయంగా నిలబడినప్పుడు నమస్కార పూర్వకంగా కోట పద్మావతి ముమ్మారు కీర్తించిన గ్రామ స్వచ్ఛ – సుందరోద్యమ సంబంధిత నినాదాలను హర్షించండి!

         రేపటి వేకువ సైతం మన వీధి సంస్కరణ ప్రయత్నం బెజవాడ బాటలోని పంట కాలువ వంతెన వద్దనే అని

తెలుసుకోండి!

     అంకితులు మన చల్లపల్లికి – 74

ఈ మధ్యనే తగ్గెగాని భోగాది ప్రకాశరావు

గ్రామానికి అతని సేవ సామాన్యం అనుకొనేవు

ముఖ్యంగా బైపాస్ వీధి ముఖ చిత్రం మార్చునపుడు

గణనీయము అతని పాత్ర! - స్తవనీయము ఆ చరిత్ర !

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   27.04.2024