3104* వ రోజు....... ....

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

    చూసి తీరవలసిన ఆదివారం (28-4-24) నాటిశ్రమ వేడుక ! --@3104*

సదరు వేడుక 33+3+1 = 37 మంది జరుపుకొన్నది. వీరిలో  మొదటి సంఖ్య - 6 గురు మహిళల్తో సహా అసలు కార్యకర్తల్దీ, రెండోది  ట్రస్టు కార్మికుల్దీ, చివరిది పురిటి గడ్డ నుండి వచ్చి మరీ సామాజిక శ్రమ సౌందర్యాన్ని వీక్షించిన అతిధి కార్యకర్తదీ!

         అసలిది ఇందరిలో ఏ ఒక్కరి ఇంటి శుభకార్యం సందడీ కాదు - బొత్తిగా స్వార్థం వాసనే లేనిది – సొంత గ్రామ సామాజిక ప్రయోజనాన్ని ఆశించినది మాత్రమే!

         మనమున్న ఈ పాడు కాలంలో నేను ప్రతి రోజూ ఈ గ్రామంలో జరిగే ఒక సామాజిక- సామూహిక సత్కార్యం గురించి ఇలా వర్ణిస్తే- అది చల్లపల్లి కాబట్టి సరిపోయింది గాని, కొట్టేసే వాళ్లు, ఈ నిజాన్ని ధృవపరచు కొనేందుకే - ఎందరో పొరుగూళ్ల పొరుగు రాష్ట్రాల పరిశీలకులు చల్లపల్లిని సందర్శిస్తుంటారు!

“ ఇంతకీ ఆ సందడేంటి – వేడుకేంటి – నేటి శ్రమదాన సమాచారమేంటి” అని ఆరాతీస్తే:

1) ఈ వేకువ 4.20 కే డజను మందీ, కాస్త వెనకా ముందుగా మిగిలినవారూ బెజవాడ రోడ్డులోని పంట కాల్వ వంతెన వద్దకు చేరుకొనుట,

2) చేతొడుగులు ధరించి, తలదీపాలమర్చుకొని, వీధి పారిశుద్ధ్య అవసరానుగుణంగా కత్తీ-గొర్రు - దంతె –చీపురు- డిప్ప- పలుగూ పారా వంటి ఆయుధ పాణులుగా పనిలో దిగుట,

3) వంతెనకు పడమటి 2 కాల్వ గట్ల వ్యర్ధాల్ని కసి తీరా సంహరించుట, తామే గతంలో నాటి పెంచిన పూల చెట్ల మొదళ్ళ కలుపు తీసి, ప్లాస్టిక్ లు ఏరి, కాల్వలోని ప్లాస్టిక్ మూటల్నీ,  ప్రాత గుడ్డల్నీ  బైటకు గుంజుట,

4) ఏడెనిమిదిమంది సారా బాట్లింగ్ కంపెనీ కాంపౌండ్  ఎదుట ఐదారు చెట్ల కొమ్మలు కరెంటు తీగల్లో  చొరబడితే- తొలగించుట,

5) చివరగా తమ శ్రమతో బాగుపడిన కాల్వ గట్లనూ, అందంగా మారిన బెజువాడ  వీధినీ పరికించి సంతసించుట - వారి సంతోషాన్ని చూసి ఈ ఉద్యమారంభకుడైన DRK వైద్యుని ఆనందం హర్ణవం గా మారుట.

  దాదాపు అందరి బట్టలూ, ముఖాలూ, చెమటకు తడిసి – దుమ్ము కొట్టుకొన్నవి గాని తమ ఊరి పట్ల బాధ్యత తీర్చుకొన్నందుకు అందరిలో సంతృప్తి కనిపిస్తున్నందునే ఇదొక వేడుక, సందడి అని పేర్కొన్నాను!

చివరగా మౌనమునీశ్వరుడు సాక్షిగా గోళ్ళ వేంకటరత్నం ఈ శ్రమదానోత్సవాన్ని – నినాద రూపంలో కీర్తించడమూ, కాంపౌండరు శేషూ, నందేటి శ్రీనూ పాటల్తో మరింత హుషారెక్కించడమూ,

         బుధవారం నాటి మన కలయిక కూడ ఇదే రోడ్డు లోననే ప్రకటనా......

   అంకితులు మన చల్లపల్లికి – 75

“ఎందరో మహానుభావు లందరికీ వందనాలు....”

అని గద త్యాగయ్య పలికె అప్పటి భక్తుల గురించి  

వందలాది శ్రమ వీరుల స్వచ్చంద శ్రమదానం

 ఎంతని వర్ణించగలను- ఇవిగో నాప్రణామాలు!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   28.04.2024