3105* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

29-4-24 వ నాటి ప్రత్యేక శ్రమ - @3105*

         అవి ఏప్రిల్ - మే మాసాల ఠారెత్తించే ఎండలైనా – జోరు మురుగు వానలైనా - డిసెంబరు, జనవరి నెలల వణికించే చలైనా – ఆగక పదేళ్లుగా కొనసాగుతున్న చల్లపల్లి స్వచ్ఛ - సుందరోద్యమంలో నేటిది పరిమిత శ్రమదానం! అంటే 4+3 గ్గురి శ్రమార్పణమన్న మాట!

         ఒక గట్టి కార్యకర్త మోకాలు వాచి, కదల్నీయక పోగా రెస్క్యూ పనుల్లో బాగా ఢక్కా – మొక్కీలు తినీ తినీ రాటుతేలిన నలుగురు అసలీ రోజు వెళ్లవలసింది పాగోలు రహదారి బాగుసేతకైనా - SBI దగ్గర ఉడత్తు వారి రద్దు కనిపిస్తే – మనసు మార్చుకొని, దాన్ని తమ ట్రక్కులోకి ఎత్తి, గంగులవారిపాలెం రోడ్డు మార్జిన్ల మెరకగా వినియోగించారు!

         లోడింగు వేళ నేను లేను గాని, కొంతసేపటి తర్వాత కొలిమి మేస్త్రీ (కీ॥శే॥ దాసరి పూర్ణ చంద్రరావు) గారి డైరీ వద్ద చూశాను వాళ్ల అవతారాలు – సిమెంటూ - దుమ్మూ వంటికీ, బట్టలకీ  అంటుకొని, పని పూర్తైయేప్పటికి చప్పున గుర్తు పట్టలేనట్లు మారిపోయారు!

         30 గజాల వీధి దుమ్మూ - ధూళీ చీపురుతో ఊడ్చేసిన ఒక సీనియర్ వైద్యుని ఒంటికీ , బట్టలకు కూడ ఆ అదృష్టం కొంత అంటుకొన్నది! (ఈ అదృష్టాల మాటకేం గాని - ఆ రోడ్డు మరి కొన్నేళ్ళు భద్రంగా ఉండబోతున్నది!)

         అసలీ కార్యకర్తలు వేకువ 4.20 కే అచటికి పోనేల? పోయిననూ సదరు రద్దు వారి కంట బడనేల? పడెనుబో - వీళ్లడగ్గానే ఉడత్తు రామారావు గారు అంగీకరించనేల? అంగీకరించెనుబో - గంటన్నరకు పైగా శ్రమించి, అందర్లా వీధి గుంటల్ని పట్టించుకోక - ఈ నలుగురైదుగురే తెల్లారకముందే సరిజేయనేల?

         ఎందుకనగా – వీళ్ళు సీతయ్యలు మరి! ఎవరు వారించినా ఆగరు! 6.20 కి పద్మాభిరామం వద్ద 3105* రోజుల బ్యానర్ సాక్షిగా తూములూరి లక్ష్మణుని నాయకత్వాన స్వచ్ఛ – సుందరోద్యమ ప్రతిజ్ఞలు కూడ చేసేశారు!

   అంకితులు మన చల్లపల్లికి – 76

వీధి శుభ్రత నిమిత్తం చీపుళ్లను చేతబట్టి

రాజసాన్ని దాచి పెట్టి రావూరి ప్రకాశరావు

ఎంతెంత శ్రమించారో – ఎంత దానమిచ్చారో!

స్వచ్ఛ - సుందరోద్యమాన సముచిత స్థానం వారిది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   29.04.2024