3106* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

ఏప్రిల్ మాసాంతపు రహదారి సేవ! - @3106*

         మంగళవారం(30.4.24) వేకువ 4.20 కే ఐదారుగురు రెస్క్యూ మనుషులు జాతీయ రహదారి 216 మీదికెక్కారు. కాసానగర్ కూడలి నుండి ఆ బాట దక్షిణాన మెరుగులు దిద్దపూనుకొన్నారు. మరో ముగ్గురు సీనియర్ సిటిజన్ కార్యకర్తలు సైతం తోడయ్యారు.

         ట్రస్టు ఉద్యోగులు పాదులు సవరించి, ట్యాంకర్ నీళ్లు పోయడం వల్ల కార్యకర్తలు నాటిన పూల – నీడ మొక్కలు పచ్చగా తలలూపుతున్నవి తప్ప, అక్కడి గడ్డీ, ఇతర మొక్కలూ ఎండలకూ వేడిగాలికీ ఎండిపోయాయి!

         10 రోజుల్నాడు సజ్జా ప్రసాదు గారు పిలిచిన మంగళాపురం కూలీలు తొలగించిన పనికిమాలిన మొక్కలూ, తుక్కులూ మాత్రం రోడ్డు ప్రక్కగా పడున్నాయి. వాటి కోసమే స్వచ్ఛ కార్యకర్తలు 6.00 దాక అక్కడ పని చేసింది.

         నిన్న హఠాత్తుగా చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలకు తగిలిన దెబ్బ నుండి వాళ్లింకా కోలుకోలేదు.

         చల్లపల్లి శ్రమదానోద్యమానికీ, గోపాళం వారి వైద్య శిబిరాలకూ, ఈ 2 గ్రామాలకూ ఆత్మీయుడైన 73 ఏళ్ల్ళ కంఠంనేని రామబ్రహ్మంగారి ఆకస్మిక మృతి ఒక పెద్ద షాకన్న మాట.

         స్వచ్ఛ కార్యకర్తలూ, విజయవాడ నుండి 6.00 కే వచ్చిన గోపాళం డాక్టరు గారూ తమ ఆత్మీయ సహకార్యకర్తకు నివాళులర్పించారు.

         అందరికీ సేవలందించడం తప్ప – చివరి నిముషాల్లోనూ ఏ ఒక్కరి – ఆఖరికి తన పిల్లల సేవలూ అవసరం లేని సుఖమరణం అతనిది!

         ఈతరమూ, రాబోవు తరమూ చల్లపల్లి రహదార్ల మీద, పాగోలు సిమెంటు బాటల మీద, శ్మశానాల సౌకర్యాల మీద చూపుపడిన ప్రతిసారీ ఈ ఆదర్శ - నిరాడంబర జీవనుని స్మరించుకోక తప్పదు!

         చల్లపల్లి స్వచ్ఛ - సుందర కార్యకర్తల రేపటి వేకువ పనులు బెజవాడ బాటలోని గాంధీ స్మృతి వన ప్రాంతంలోనే!

   అంకితులు మన చల్లపల్లికి – 77

తుమ్మల జనార్దనుండొక తొలి దినాల కార్యకర్త

అతని వయస్సెనుబది - ఆలోచన కడుదొడ్డది

తనే కాక తన ఊరూ స్వచ్ఛ - శుభ్ర మవ్వాలని

ఏళ్లతరబడీ శ్రమించిన విశాల హృదయం అతనిది!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   30.04.2024