3108* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

4.17 AM నుండి జరిగిన 3108* వ నాటి శ్రమ.

         అది గురువారం (2.5.2024) నాటిది. తొలుత 10 మందీ, మొత్తంగా 24 మంది భౌతిక కష్టమన్న మాట! మరి ఈ 2 గంటల శ్రమవేడుక ఎట్లున్నదో – ఏ మాత్రం సఫలమైనదో చూద్దాం!

         పని మాత్రం - చిన్నచిన్న మార్పులతో నిన్నటి చోటనే జరిగింది. చల్లపల్లి స్వచ్ఛ కార్యకర్తలు కాబట్టి గాని - ఇంకెవరైనా ఇలా ఒకే చోట, ఒకే రకం పనులు, అవీ నూటికి 99 మంది సిగ్గుపడే వీధి - మురుగు కాల్వల బాగు చేత పనులు చేయవలసొస్తే ఎట్లుంటుందో ఊహించండి!

         అసలింతటి కఠోరమైన వేసవి ఉక్కపోతలో - ఊడుస్తున్న దుమ్ము మధ్య, చెమటతో తడుస్తున్న బట్టల్తో ఎంతటి దృఢ సంకల్పం లేకుంటే ఈ శ్రమదానం - అదీ ఒక పండుగగా జరుగుతుంది?

ఈ పూట జరిగిన కృషి 3 రకాలు.

మొదటిది – పంటకాల్వ గట్టు రోడ్డులో నిన్నటి తరువాయిగా డజను మంది కత్తులూ, దంతెలూ, ప్రయోగిస్తూ చేసినది. ఏ రెండొందల ముళ్ళ – పిచ్చి చెట్లో తెగిపడి, ఎవరో వదిలించుకొన్న దిండ్లూ, ప్రాత చొక్కాలూ ప్రోగులు చేయబడి, డజన్ల కొద్దీ మద్యం - నీళ్ల సీసాలూ, గ్లాసులూ, ప్లాస్టిక్ సంచులూ ఏరబడి - మరో 30-40 గజాల మేర మెచ్చదగినట్లుగా మెరుగుపడింది!

రెండవది  - షెడ్డర్ సందడి. అది ఇదే కాల్వ గట్టున జరిగిపోయింది. ఒక బండెడు కొమ్మ - రెమ్మలూ, గడ్డి తుక్కూ దాని పుణ్యమా అని పొడుంగా తేలినవి.

మూడవ రకం - బెజవాడ రోడ్డును ముగ్గర్నలుగురు చీపుళ్ళతో ఊడ్చిన సంగతి. ఇళ్ళ దగ్గర వాళ్లిదే శ్రద్ధతో - ఇంత కష్టంగా ఈ పని చేస్తారో లేదో చెప్పలేం.

 

6.10 దాటాక - 2 మార్లు పని విరమణ సూచకబూర మ్రోగాక

1) నూతక్కి శివబాబు గారు ముమ్మారు నినదించిన స్పచ్ఛ - సుందరోద్యమ విషయమూ, మాతృ దేవతల త్యాగ వృత్తాంతమూ -

2) మేడే గురించి కారల్ మార్క్స్ చెప్పిన శ్రమదాన సూక్తులను గురవయ్య గారు గుర్తు చేయడమూ,

3) పల్నాటి అన్నపూర్ణ కార్యకర్తలకు పంచిన పూర్ణాలూ, గారెలూ,

         ఇంకా చివరగా - రేపటి వేకువ కూడ ఇదే విజయవాడ రోడ్డులోని 6 వ నంబరు కాల్వ వంతెనే మన కలయికచోటనే విషయమూ.

        అంకితులు మన చల్లపల్లికి – 79

ఉండేదేమొ విజయవాడ - ఉరుకులు పరుగుల తోడుగ

వస్తున్నది చల్లపల్లి స్వచ్ఛ సుందరోద్యమానికి

ఎవరా వైద్య శిఖామణి - ఎందుకంత తెగింపో మరి!

గోపాళం శివుడి పట్ల వాలంటీర్ల కెంతటి గురి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   02.05.2024