3110* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

నాలుగూ - ఐదూ - 20 నాలుగూ నాటి శ్రమ సంగతులు – 3110*

        శ్రామికులు 26 మంది, శ్రమ కేంద్రాలు - బెజవాడ బాటలోని 1) పంటకాల్వ గట్టు వీధి, 2) ప్రభుత్వోన్నత పాఠశాల పడమర 3) గాంధీ విగ్రహం ఎదుటి అపార్ట్మెంట్ల రోడ్డు. సమయం 4.20 6.10

        3 వ భాగంలో ఇద్దరు కత్తివీరులూ, ఒక దంతె, ప్రయోగశాలీ, మరొక డిప్ప పనిమంతుడూ అక్కడ గడ్డీ, పిచ్చి మొక్కల పనిబట్టింది చాలక రాతి ముక్కల గుట్టల నిలయం గేటు ఎదుట చేసిన పనిని చూసి తీరాలి. వీళ్ల శ్రమ ఫలితంగా వచ్చిన వ్యర్ధాలు 10 డిప్పలకు పైగా!

        బడి ప్రహరీ వెలుపల ఏడెనిమిది మంది చేసిన కాలుష్య వ్యతిరేక పారాట వీర విహరమంతా బాగా గుర్తుంచుకోదగ్గ శ్రామిక కథ! అందులో ముగ్గురైతే మట్టి గుట్టల అంచున కాలు నిల ద్రొక్కుకుంటూ బొత్తిగా దిక్కుమాలిన కలువునూ – తీగల్నీ ప్రాత సామాన్లనీ, దోమల ఉత్పత్తికి తప్ప దేనికీ పనికిరాని మొక్కల్నీ తొలగిస్తున్న తీరు ఒక స్వచ్ఛ – సుందరోద్యమకమనీయ దృశ్యం!

        పింగళి వెంకయ్య విగ్రహం ఎదుట కాల్వ నిండా మేట వేసి, గడ్డి పెరిగి, కొబ్బరి డిప్పల్లాంటి వ్యర్ధాలడ్డు పడిమురుగు నిలిచిపోతే - ఆ కంపుకూ ముక్కు పుటాలదిరిపోతే -  దాన్ని సరిదిద్దినది ఒక హెడ్ మాస్టరు మరొక విశ్రాంతోద్యోగి! అరగంట పాటు అ ‘తమాషా’ చూసినది ఒక లుంగీ వాలా.

        ఇక - పంటకాల్వ గట్టు వీధి సంగతి కొస్తే - ఇద్దరు మహిళలూ, ఐదుగురు కత్తుల – దంతెల కార్యకర్తలూ శ్రమించబట్టే – ఇవాల్టితో ఆ  నాలుగైదునాళ్ల ప్రయత్నం ఫలించింది. ఈ వీధి శుభ్రత, మురుగు కాల్వ దర్శనీయత ఎన్నాళ్లు నిలుస్తుందో చూడాలి!

        ఒక కార్యకర్త విసిరిన ప్లాస్టిక్ తుక్కు అటుగా వెళ్తున్న కారు ముందు పడితే విసుగునూ, కాస్త కోపాన్ని వెలిబుచ్చిన కారు యజమానీ,

        మృత శునక దహన దుర్వాసన దెబ్బకు వాంతి చేసుకున్న మహిళా - నేటి ప్రత్యేకతలు

        అన్నపూర్ణ గారు చివరి నిముషంలో తెచ్చి వడ్డించిన అల్పాహారాన్ని స్వీకరించడంలో నిస్సహాయులైన సగానికి పైగా కార్యకర్తలూ -

        రామానగర వాస్తవ్యుడైన రాజు గారి స్వచ్ఛ – సుందరోద్యమ నినాదాలు

        రేపటి వేకువ వీధి సపర్యల కోసం ఇదే రోడ్డులోని విజయా కాన్వెంటు వద్ద కలుసుకోవాలనే ప్రకటనా!

        అంకితులు మన చల్లపల్లికి – 81

తానొక చైతన్య ఝరి – తన మార్గం నభూతో!

తన వైద్యం పెను శిఖరం - వ్యాపారం పారీణం

‘మనకోసం మన ట్రస్టుకు మూల స్తంభం నేటికి

అన్నపరెడ్డి గురవారెడ్డి అసలగు ప్రేరణ మనకి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

   04.05.2024