3111* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

      ఐదూ- ఐదూ- ఇరవైనాలుగు వేకువ శ్రమలీలలు- @ 3111*

        ఆదివారమైనందునేమో శ్రామికులు 35 మంది దాక రోడ్డెక్కారు. ఆ రోడ్డు బెజవాడ వైపుది- పదునొకండు గురైతే మరీ తొందరపడి4.16 కే విజయా కాన్వెంట్ గేటు ముందు క్రమ శిక్షణ తో వరుసలో నిలబడి కనిపించారు. ఆ తర్వాత ఇద్దరేసి, నలుగురేసి కార్యకర్తలు గబగబారావడమూచేతొడుగులేసుకోవడమూ, పనుల్లో దిగడమూ! చల్లపల్లి, పరిసర గ్రామాలకూ ఇదేం క్రొత్త సంగతి కాదు. కర్నాటకలో-  భాగ్యనగరిలో- అమెరికా తదితర దేశ విదేశాల్లో వాళ్లూ ఈ దృశ్య ఛాయాచిత్రాల్ని వాట్సాప్ లో చూస్తూ -ఆనందిస్తూ- లైకులు కొడుతుంటారు. ఇలా చల్లపల్లి వీధుల్నూడ్చేవాళ్ళు, చూసి సంబర పడేవాళ్లు కాస్త అరుదైనవాళ్లు- నేటి సమాజ పోకడలకు భిన్నమైన సత్య కాలపు వాళ్లు!  చాలమంది దృష్టిలో బతక చేతగాని వాళ్లూ- జాలిపడ దగిన వాళ్ళూనూ!       

        ఎందుకంటే ఈ గామ్రంలో రోజూ 30- 40 మంది తలా గంటన్నర చొప్పున ఊరు బాగుదల కోసం పదేళ్ళ నుండీ చేస్తున్న వీధి పారిశుద్ధ్య శ్రమ ఇప్పటికీ సగం మంది సొంతూరి వాళ్లకే  అర్థమైచావదు !

        సరే - ఎప్పట్లాగే ఈ కార్యకర్తలు విజయా కాన్వెంట్ వద్దకు వచ్చారు, మైకు తెరచి, తాము ఎంపిక చేసుకొన్న  శ్రమ జీవన చైతన్య గీతాలను వింటూ, 20 మంది దాక పాఠశాల ప్రహరీ  ప్రక్క డ్రైన్ లో దిగారు.

        అక్కడ వీళ్లకోసం ఎన్నో రకాల కాలుష్య నిధులు ఎదురు చూస్తున్నాయి మరి! సుమారు బండెడు వ్యర్థాల్ని  ఒడ్డు కెక్కించారు!  

        మెయిన్ రోడ్డుకు పడమరగా 2 వీధుల్నీ,  ఖాళీ స్తలాన్ని ఆరేడుగురు ఎంచుకొన్నారు. పంచాయతి కుళాయి నీటిలో తడిసిన చోట వాళ్లపని!  

        కాన్వెంట్ ముఖ ద్వారం ఎదుట లారీ కాటాల, మెకానిక్ షెడ్డుల ముందు శుభ్రపరిచిన కష్టం కొందరిది.

        ఇద్దరు చీపుళ్ళతో వీధి నూడ్చేశారు. వ్యర్థాల్ని మోసి, ఒక చోట కు చేర్చిన బాధ్యత నలుగురిది!

        6.20 కి కాటాల దగ్గర చేరి, చెప్పుకున్న కబుర్లను ల్యాబ్ రవీంద్ర గబాగబా చెప్పిన నినాదాలు ఆపేశాయి! నందేటి శ్రీనును మొహమాట పెట్టి “ ఒక సుందర స్వచ్ఛ ఉద్యమం ఒనగూర్చిన ఫలితాలెన్నో-

 - సాముహిక శ్రమదానంతో సమకూడిన మేలదేమిటో...” అనే పాట పాడించుకొన్నారు.

        కొద్ది విరామం తర్వాత బుధవారం మళ్ళీ విజయ కాన్వెంట్ వద్దనే కలుసుకోవాలని నిర్ణయం!

 అంకితులు మన చల్లపల్లికి – 82 & 83

రాధాకృష్ణ రాయపాటి - ధ్యాన ప్రక్రియల మేటి  

శ్రమ చర్యలలో కిరీటి - స్వచ్ఛోద్యమ ఘనాపాఠి

అతని జత రమావధూటి- ఆ ఇరువురి శ్రమల తోటి

ఊరి ముఖ్య వీధుల్లో ఒనగూడిన స్వచ్ఛథాటి!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

   05.05.2024