3112* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

        ఆరు-5-24 వ నాటి పరిమిత రెస్క్యూ పనులు - @ 3112*

        అది సోమవారం, ఆ చోటు 216 వ జాతీయ రహదారిలో కాసానగర్ దగ్గరగా, కార్యకర్తలైతే బొత్తిగా 3+2 మందే గాని బాటకు దక్షిణంగా లోతట్టున చెప్పుకోదగినంత పరిశుభ్రతను సాధించారు.

        అక్కడ ఎండు గడ్డి కొంత ఉన్నది గాని, మొండి- ముళ్ళ- పిచ్చి మొక్కలు మెండుగా ఉన్నవి. కత్తుల తో నరకవలసినవి నరికి, దంతెలతో లాగి ప్రోగులు పెట్టదగిన ఎండుతుక్కునూ, ప్లాస్టిక్ సరంజామానూఎండిన కొబ్బరి  బొండాలనూ  కుప్పలుగా పేర్చిన పనులే ఈ కొద్దిమందికి సంతృప్తిని కలిగించెను!

        కార్యకర్తల సంఖ్య తగ్గినా, దారినపోయే వాళ్లు విసిరే వ్యర్థాలు తక్కువ కాదు; గాలికి కొట్టుకొచ్చే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ తుక్కులకూ కొదవలేదు. ఇంకా 2 కిలో మీటర్ల జాతీయ రహదారి బారునా ఇలా శుభ్రం చేయడానికెన్ని రోజులు పడుతుందో అనే నిరాశా ఈ వాలంటీర్లకు లేదు.

        6.30 కల్లా గస్తీ గది దగ్గరకు చేరుకొని, BSNL నరసింహుడు ప్రకటించిన స్వచ్ఛ-శుభ్ర-సౌందర్య నినాదాలకు గట్టిగా బదులిచ్చి గాని వీళ్ళు ఇళ్లకు చేరుకోలేదు.

 అంకితులు మన చల్లపల్లికి – 84

చల్లపల్లి పుర దేవత సమకూర్చిన దాసరి

ద్వి చక్ర వాహన విక్రయ వ్యాపారపు గడసరి

స్వచ్చోద్యమ చల్లపల్లి సాహసాల తెంపరి

సామాజిక బాధ్యతలే శ్రీనివాసు ఊపిరి!

 

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త  

   06.05.2024