3113* వ రోజు...........

పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

7-5 తేదీ నాటి మరొక విడత రహదారి శుభ్రత - @3113*

         మంగళవారం వేకువ కూడ మళ్లీ అదే సమయపాలనతో - అదే NH 216 రహదారిలో కాసానగర్ – కళ్ళేపల్లి రోడ్ల మధ్య - 4+2 మంది కార్యకర్తలతో జరిగిన శ్రమదానంతో 150 గజాల దాక కనిపించిన శుభ్రత!

         కాకపోతే, నిన్నటి ప్రాత ముఖాలకు తోడు ఒక ఎడం చేతి వాటం వచ్చి కలిసి, పని కాస్త ఊపందుకొన్నది! ఐతే - మొత్తం ఈ ఆరు ముఖాలూ, వాటి తాలూకు శరీరాలూ, వాటిని కప్పిన బట్టలూ దుమ్మూ - బూదీ – చెమటల మిశ్రమంతో మారిపోయినవి! వేసవి ఉక్క ప్రతాపం మరి!

         అందుకే స్వచ్ఛ కార్యకర్తలు ఏనాడైనా - ముఖ్యంగా ఈ గ్రీష్మం తాకిడి రోజుల్లో తమ వెంట తెచ్చుకొన్న నీళ్ల సీసాలను ఖాళీ చేస్తూనే ఉంటారు!

         రహదారియొక్క లోతైన దక్షిణపు మార్జిన్లో కత్తులతో ముళ్ల మొక్కల పని పట్టుతున్నా - ఎండు గడ్డిని దంతెల్తో సమీకరిస్తున్నా - ఇతర పిచ్చి మొక్కల్ని నరికేస్తున్నా, పీకేస్తున్నా - దిక్కుమాలిన ప్రాత గుడ్డల్నీ, ఖాళీ ప్లాస్టిక్ సంచుల్నీ, రాష్ట్రంలో అద్భుత ప్రగతి సాధిస్తున్న మద్యం వాడకానికి గుర్తులైన మద్యం సీసాల్ని ఏరేస్తున్నా...... కార్యకర్తలది ఒకే దీక్ష – ఎంత క్లిష్ట వాతావరణంలోనైనా – తమ ఊరే కాదు - దగ్గరగా ఉన్న 7-8-9 రహదార్లు శుభ్రంగా ఉండాలనే!

         అసలేనాడైనా వీళ్లే ప్రతిఫలమాశించారు గనుక! తమ పన్లూ, తమ పేర్లూ ఊరంతటా – రాష్ట్రమంతటా మ్రోగిపోవాలని గాని, జాతీయ మీడియా ముఖచిత్రాలై పోవాలని గాని, గ్రామస్తులంతా క్యూలో నించొని అభినందించాలని గాని..... ఆకాంక్షిస్తే – అది తీరక నిరుత్సాహం ఉండేది! అబ్బే - ఇదంతా ఒక నిష్కామకర్మ - నిర్వికార సంకల్పం!

         ఆదివారపు కురదలా పనుల కోసం కార్యకర్తలందరం మరొక మారు బెజవాడ బాటలో విజయా కాన్వెంట్ దగ్గర కలుసుకోవలసి ఉన్నది!

   అంకితులు మన చల్లపల్లికి – 85

చల్లపల్లి తొలి దశలో శస్త్ర చికిత్సల నేర్పరి

ఎనభయ్యారేళ్లు నిండి - ఈ వైద్య శిఖామణి

లక్షలాది వ్యయంతో శ్మశాన పనులు తీర్చిదిద్ది

చీపురు కూడా పట్టిన శివప్రసాద దానగుణి!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   07.05.2024