3114* వ రోజు...........

 పర్యావరణ ధ్వంసకమవుతూ - కేవలం ఒక్కసారికి మాత్రమే పనికి వచ్చే ప్లాస్టిక్కులు తక్షణమే ఆపేద్దాం!

8 వ మే మాసం - 2024 వేకువ శ్రమ సమాచారం - @3114*

         బుధవారం వేకువ 4.20 కే విజయాకాన్వెంట్ గేటు ఎదుట కొందరు కార్యకర్తల హాజరీ! అప్పటికింకా ప్రధాన రహదారి మీద సైతంకానరాని వాహన రద్దీ! తెరుచుకోని టీ - కాఫీ దుకాణాలు!

         ఆ నిశ్శబ్ద వాతావరణాన్ని చెదరగొట్టుతూ ఒక వంక మైకు నుండి చైతన్య గీతలహరి, కార్యకర్తల మాటల – కత్తి – గొర్రుల వంటి పనిముట్ల సవ్వడి. కొద్ది నిముషాల్లో వచ్చి చేరిన మిగతా కార్యకర్తలతో ఊపందుకొన్న స్వచ్ఛ కార్యకలాపాలు!

         మొదటి కార్యకర్తల బృందం దృష్టికి ఎండిన డ్రైను మురుగు మట్టి గుట్ట వచ్చింది. చాలమందికా గుట్ట పాత గుడ్డల, ప్లాస్టిక్ కవర్ల, ఎండు పుల్లల పుట్ట! దాన్ని ఓపిగ్గా విడగొట్టితే వచ్చింది కొంత మట్టి, ట్రాక్టర్ ని అక్కడికి మళ్లించడమూ, ఆరుగురు ఆ మట్టిని ట్రాక్కులో నింపడమూ, అది గంగులవారిపాలెం వీధి రోడ్డు అంచుల గుంటల వద్దకు చేర్చడమూ – అంతా గంటలో ముగిసింది!

         ఐదారుగురు కాన్వెంట్ దక్షిణాన ప్రభుత్వాస్పత్రి దిశగా తమ కష్టాన్ని ప్రయోగించారు. ముఖ్యంగా చండ్ర వికాస కేంద్ర ప్రహరీ ప్రక్కన ఉన్న డ్రైను గురించి చెప్పుకోవాలి. ఈ 10 ఏళ్లలో ఆ మురుగు కాల్వ కష్టించదల చుకొన్న కార్యకర్తల్ని ఏనాడూ నిరాశపరచలేదు! ఈపూట కూడ డిప్పల కొద్దీ వ్యర్ధాల్ని అది వాలంటీర్ల కందించింది!

         నలుగురైదుగురు మాత్రం ప్రక్కచూపులు చూడకుండ తిన్నగా ఆస్పత్రి వీధి దాటి బెజవాడ బాటలో దక్షిణంగా పనిచేశారు! అక్కడున్న తాత్కాలిక హోటలూ - షాపూ వ్యర్ధాలతో బాటు - పిచ్చి, ముళ్ల మొక్కలూ గంటన్నరకు పైగా వాళ్లకి పని కల్పించాయి!

         6:20 సమయంలో మాత్రం విద్యా సంస్థ ద్వారం ఎదుట అందరూ చేరి జాస్తి జ్ఞానప్రసాదు ననుసరించి స్వచ్ఛ సుందరోద్యమ నినాదాలందుకొన్నారు.

         రేపటి వేకువ కూడ ఇదే బెజవాడ రోడ్డులో మరొకమారు కలవాలని నిర్ణయించుకొన్నారు!

         విశ్రాంత పోలీస్ ఉన్నతోద్యోగి శ్రీ బత్తిని శ్రీనివాసులు, IPS గారి సతీమణి ఉమాదేవి గారి ఆన్లైన్ బదిలీ 5,000/- ల విరాళానికి స్వచ్ఛ సుందర కార్యకర్తల ధన్యవాదములు.  

   అంకితులు మన చల్లపల్లికి – 86

తలశిల శ్రీనివాస్ అనే డ్రైవింగ్ స్కూల్ టీచరు

రామానగరం నుండీ కోమలానగర్ దాకా

రకరకాల శ్రమదానం ప్రకటించిన విజ్ఞుడు

ఎందుకిపుడు శీతకన్ను వేశాడో చెప్పుడు!

- ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త     

   08.05.2024