1859* వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1859* వ నాటి సామాజిక బాధ్యతలు.

 

ఈనాటి వేకువ 4.00 – 6.30 నిముషాల మధ్య కస్తూర్బాయి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జరిగిన స్వచ్చంద శ్రమ దానంలో పాల్గొన్న చల్లపల్లి స్వచ్చ సైనికులు 26 మంది.

 

17 సంవత్సరాల – 204 వ నెల వైద్య శిబిరం విజయవాడ రోడ్డు లోని విజయా కాన్వెంట్ ఆవరణలో నేడు జరుగుతున్నందున మన దైనందిన స్వచ్చంద శ్రమదానం కూడ ఆ సమీపంలోనే ఏర్పాటు చేయడమైనది. అటు వైద్య శిబిరం ఆవరణలోనూ, ఇటు ప్రభుత్వాసుపత్రి మార్గంలోనూ ఉభయత్రా స్వచ్చ సైనికుల లభ్యత కోసమే ఈ ఏర్పాటు.

 

ఇందులో సగం మందికి పైగా యథావిధిగా దారికి రెండు ప్రక్కల గడ్డిని, పిచ్చి, ముళ్ల కంపలను, ప్లాస్టిక్ తదితర తుక్కును గొర్రులతో, చీపుళ్లతో, కత్తులతో నరికి, లాగి , ఊడ్చి డిప్పలలోనికి ఎత్తి ట్రస్టు  ట్రాక్టర్ లో నింపి అక్కడికి సమీపంలో ఉన్న చెత్త కేంద్రానికి తరలించారు.

 

మిగిలిన వారు ప్రక్కనున్న పాఠశాలలో వైద్య శిబిరం ప్రారంభానికి ముందే చీపుళ్లతో గదులను ఊడ్చి, అవసరమైన పనులలో సహాయ పడి, తమ వంతు సామాజిక బాధ్యతను నెరవేర్చారు.

 

స్వచ్చ సైనికులైన ఇద్దరు డాక్టర్లతో సహా కొందరు కాంపౌండర్లు, నర్సులు, కొందరు ఉపాధ్యాయులు వైద్య శిబిరంలో ఉదయం 4.00 గంటల నుండే తలమునకలై ఉన్నందున ఈనాటి స్వచ్చ కార్యకర్తల సంఖ్య తగ్గిపోయింది.

 

 

హాస్పటల్ సీనియర్ ఉద్యోగిని లక్ష్మీ సెల్వం ఉత్సాహ భరితంగా ముమ్మారు ప్రకటించిన గ్రామ స్వచ్చ - శుభ్ర  సంకల్ప నినాదాలతో6.35 నిముషాలకు  నేటి మన గ్రామ ఋణం తీరింది.

 

రేపటి మన శ్రమదానం విజయవాడ మార్గంలోని 6 వ నంబరు పంట కాలువ దగ్గర ప్రారంభిద్దాం.

 

     నల్లూరి రామారావు,

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

శనివారం – 14/12/2019

చల్లపల్లి.