1860 * వ రోజు....

          

ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వేటినీ వాడం!

 

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం – 1860* వ నాటి దృశ్యాలు.

 

ఈ ఆదివారం నాటి వేకువ 4.00- 6.20 నిముషాల నడుమ విజయవాడ మార్గంలోనే – చిన్న కార్ల బాగు చేతల షెడ్డు నుండి నారాయణ రావు నగర్ ముఖ ద్వార వీధి వరకు 30 మంది స్వచ్చ కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్న గ్రామ బాధ్యతలు నెరవేరినవి. నిన్నటి విజయవంతమైన ద్విముఖ సామాజిక (204 వ నెల వైద్య శిబిర, గ్రామ) బాధ్యతల నేపధ్యంలో నేటి కార్యకర్తల ముఖాలలో ఆనందం ప్రతిఫలించింది!

 

గ్రామం లోని 3 భిన్న ప్రాంతాలలో జరిగిన గ్రామ స్వచ్చ-సుందరరీకరణ కృషి ఇలా ఉంది:

 

- నిన్నటి ప్రభుత్వాసుపత్రి దారి లోని మిగులు మట్టిని ట్రాక్టర్ లో నింపి, అవసరమైన చోట్లకు చేర్చి రోడ్ల ప్రక్క గుంటలు పూడిక.

 

- వ్యవసాయ శాఖ, నీటి పారుదల శాఖల భవనాల ప్రహరీ గోడలకు గత నాల్గు రోజులుగా రంగులు పూసిన చోట స్వచ్చ-సౌందర్య స్ఫోరక నినాదాలు వ్రాయడం, ఒక స్వచ్చ కళాకారిణి, ఆమె 10 ఏళ్ల కూతురు, రంగు రంగుల-అందమైన బొమ్మలు వేయడం-అదీ డ్రైను మురుగును దాటుకొని పోయి, ఇరుకులో నిలబడి!

 

- ఇక 20 మందికి పైగా గొర్రులతో, చీపుళ్లతో, కత్తులతో దారికిరువైపుల తుక్కును లాగి, చెట్లను అందగించి, పాదుల గడ్డిని, కలుపును తొలగించి, వ్యర్ధాలన్నిటిని డిప్పలతో సేకరించి, ట్రాక్టర్ లో నింపి. డంపింగ్ కేంద్రానికి చేర్చడం.

 

- ఇది కాక ఇద్దరు నీళ్ల బండితో రోడ్లన్నీ తిరుగుతూ వేలాది మొక్కలకు నీరందించడం.

 

పరిశీలకులకు ఇదొక గ్రామ స్వచ్చ-శుభ్ర-సుందరీకరణ బాధ్యతా యజ్ఞం కాక, మరేమిటి?

 

తేనీటి సేవానంతర సమీక్షా సమావేశంలో అడుసుమిల్లి పద్మావతి గారు అప్పుడప్పుడు తన శ్రమదాన విరామానికి విచారించి, వీధులను భాగాలుగా విభజించి- గ్రామ వార్డు వాలంటీర్ ను బాధ్యుడిగా చేస్తే మన కృషికి ప్రయోజన కరంగా ఉంటుందనే సూచన చేసి, తన ఊరి స్వచ్చ-శుభ్ర-సౌందర్య సంకల్ప నినాదాలను ముమ్మారు గట్టిగా ప్రకటించడంతో6.45 నిముషాలకు మన ఆనందప్రదమైన కృషి ముగిసింది.

 

రేపటి బాధ్యతల కోసం గ్రామ ముఖ్య కూడలిలో కలుద్దాం!

 

        గతం గతః

వికారాల నా గ్రామం వెగటు పుట్టు నిర్వేదం

ప్రతి దారీ దుర్గంధం-బాహ్య విసర్జన నిలయం

అదొకప్పటి గతం గతః – స్వచ్చోద్యమ ఆరంభం

“శ్రమ మూల మిదం జగత్” అనే స్వచ్చోద్యమ సందేశం!

 

     నల్లూరి రామారావు

స్వచ్ఛ సుందర చల్లపల్లి కార్యకర్త,

సభ్యులు - మనకోసం మనం ట్రస్టు,

ఆదివారం – 15/12/2019

చల్లపల్లి.