3844* వ రోజు....

 పర్యావరణ ధ్వంసకమయిన – ఏకమాత్ర ప్రయోజనకరమైన ప్లాస్టిక్కులు ఇకనైనా మానేద్దాం!

రోహిణి కార్తె వాతా.వరణంలో రహదారి సుందరీకరణ – 3844*

               కారణమేదైనా ఈ సోమవారం (25.5.26) కార్యకర్తల సంఖ్య పొదుపు పాటింపబడి, 22 కే పరిమితమయింది. ఇటు కాసానగర్ చెరువు వద్దా, అటు NH216 చెక్ పోస్టుకు దక్షిణపు లోతు చోటుగా సంతృప్తికరంగానే పనులు ముగిశాయి!

               ఈ మధ్య చాల కాలం నుండి కార్యకర్తల తొలి బ్యాచ్చి, ఠంచనుగా 4.20 కే పనుల్లో దిగుతున్నది. వేసవి ప్రతాపం వల్ల ఏ కార్యకర్తా 6.00 తర్వాత పని ముగించాల్సిందే అనే నిర్ణయానుసారం 5:58 కే సజ్జా- ఆకుల ప్రసాదులు సైతం డ్రైను పని నిలుపు చేశారు.

               గత 8 రోజుల్నుండీ స్వచ్ఛంద సేవా విరహంలో ఉన్న మాలెంపాటి అంజయ్య గారే ఈ నాటి సమావేశంలో నినాద ప్రకటకుడు!

               చివరి ఫొటోలో 6.10 కే రోహిణీ కార్తె సూర్యుడి భగభగలు గమనించండి, టీవీల్లో, పత్రికల్లో మండుటెండల తీవ్ర హెచ్చరికల వేళ ఈ స్వచ్ఛ కార్యకర్తల చెత్త - దుమ్ము - పనులు తప్పవా అని ఆలోచించండి!

               నాగాయలంక రోడ్డుకు తూర్పు డ్రైన్ నిండా ప్లాస్టిక్ తుక్కులు సరే – ఎవరో నరికి వదిలేసిన తాటాకుల గుట్టల నడుమ చిక్కుకుపోయిన కస్తూరి విజయ్, కోడూరు - అంబటి, మాలెంపాటి ప్రయత్నాలనూ ఫోటోల్లో చూడండి! అక్కడే రోడ్డు మార్జిన్లోని ఎండు వరిగడ్డి పరకల్ని ఊడ్చి, ప్రోగులు చేస్తున్న అన్నపూర్ణ, నర్సు ఇందిరలు కనిపిస్తున్నారా?

               సింగిల్ యూజ్ ప్లాస్టిక్ లు ఏరే షణ్ముఖుల వారు రానందువల్ల నేనే నెమ్మదిగా ఆ పనికి పూనుకోవలసి వచ్చింది!

               ఎంత చెమట కారినా, ధూళితో కలిసి అది పేస్టుగా వంటికి అంటుకొన్నా చివరికి ఆ కష్టం ఫలించింది కదా! 50 గజాల N. లంక రోడ్డు అందంగా తయారయింది కదా! 6.15 కు తిరిగి ఆ రోడ్డు గుండా ఇళ్లకు వస్తుంటే చల్లగాలి శరీరాల సేద తీరుస్తుంటే - అప్పడు గుర్తొచ్చింది – కొసరాజు గారి (జయసింహ) సినిమా పాట –

- కష్టాలు కోర్చుకొన్ననే సుఖాలు దక్కునూ - సుఖాలు దక్కునూ

ఈ లోకమందు సోమరులూ ఉండకూడదూ - ఉండకూడదూ....” అనే వక్తిత్వ వికాస ప్రబోధగేయం!

               రేపటి శ్రమదానం కాసానగర్ చెరువు ఉత్తరపు కొసన మొదలు కానున్నది!

               పని సంస్కృతి పెరుగుగాక

ఈ సత్కృతి - ఈ సంస్కృతి ఎప్పటికీ నిలుచు గాక!

మనతో బాటు సమాజమున పని సంస్కృతి పెరుగుగాక!

గ్రామములూ - పట్టణములు క్రమ పరిణతి చెందుగాక!

చల్లపల్లి దేశానికి సరైన త్రోవ చూపు గాక!

- నల్లూరి రామారావు

   ఒక సీనియర్ స్వచ్ఛ కార్యకర్త

   25.05.2026