2019*వ రోజు....

 ఒక్కసారికి మాత్రమే పనికివచ్చే ప్లాస్టిక్ వస్తువులను వాడనేవద్దు.

స్వచ్ఛ సుందర చల్లపల్లి ఉద్యమం : 20 – 19* వ నాటి శ్రామిక రీతులు.

          4.01 – 6.00 నడుమ పాగోలు బాటలో – మహాబోధి పాఠశాల దరిదాపుల్లోనే నాలుగు విధాలుగా జరిగిన గ్రామహిత చర్యలలో 38 మంది కార్యకర్తలు వారి వారి పనితనాలను చూపించారు.

          కరోనా కష్టాన్ని, భయాన్ని కూడ మరిపిస్తున్న 44 డిగ్రీల మండు వేసవిలో ఇందరు తమ సొంత ప్రయోజనం కోసం కాక – ఉభయ గ్రామస్తుల మెరుగైన ప్రయాణ సౌకర్యం కోసం – రెండు గంటల చొప్పున కృషి చేయడమే ఒక వింత! నేను దగ్గరగా పరిశీలించిన ఏడెనిమిది మందికైతే - బట్టలన్నీ చెమటతో తడిసి, ముఖాలు, మోచేతుల నుండి బొటబొటా ముత్యాల్లాగా చెమట చుక్కలు రాలుతున్నాయి. పిండితే ఒంటి బట్టల్నుండి చెంబుడు చెమట నీళ్ళు వస్తాయని పించింది.

          చలికాలంలో తన చేనిలో మేడి పట్టి – నాగలి దున్నుతూ ఇలాగే చెమటలు కక్కుతున్న రైతును, ఎద్దులను చూసి, 80 ఏళ్ల నాడు – జాస్తి వేంకటనరసయ్య అనే ఒక కర్షక కవి (వినుకొండ -) తన సమకాలిక భావ కవులనుద్దేశించి –

         కవిత సింగారము కింత కన్న తగు ఘట్టము చూపెదవా కవీశ్వరా?” అని ఛాలెంజ్ చేస్తే –

సుద్దాల అశోక్ తేజ అనే నేటి కవి

          “టప - టప - టప – చెమట బొట్లు తాళాలై పడుతుంటే –

          పాట కూడ శ్రమతో పాటు పుటుతుందీ ...” అని విశ్లేషించాడు.

          ఏదేమైనా ఈ దైనందిన స్వచ్చోద్యమ శ్రమకారుల ఘర్మజలానికి – ధర్మ జలానికి

          ఖరీదు కట్టే షరాబులెవ్వరు? (శ్రీ శ్రీ)    

          అందమైన ఈ పాగోలు దారిని మరింత స్వచ్చ సుందరం చేసే ప్రయత్నంలో పాగోలు, చల్లపల్లి స్వచ్చ కార్యకర్తలు –

1) కొందరు పూల మొక్కల కుదుళ్లు సరిదిద్ది, కంపపాతి, పశువుల నుండి రక్షణ కల్పించారు.

2) కల్వర్టు ఉత్తరపు గోడను సుందరీకరణ బృందం వర్ణమయ చిత్ర రంజితం కావించింది.

3) ఆరుగురు ఖడ్గ ధారులు పాఠశాల కంచె దక్షిణ భాగపు గట్టు మీది నిన్నటి తరువాయి చిట్టడవిని చాల వరకు తొలగించారు. వేప మొక్కల్ని మాత్రం ట్రిమ్ చేసి వదిలారు.

4) పాగోలు శ్రమదాతలు రోడ్డు మలుపు దిశగా ఉభయ దిశలలోని గడ్డి, ఉత్తరేణి (ముళ్ళ గింజలు పట్టుకుంటే వదలవు) వంటి ముళ్ళ – పిచ్చి మొక్కల్ని, నానారకాల వ్యర్ధాలను నరికి, ఏరి, లాగి, పోగులు చేశారు.

5) చీపుళ్ళతో ఊడ్చి – రోడ్డు శుభ్రతకు మెరుగుదిద్దే వాళ్ళు దిద్దుతూనే ఉన్నారు.

          రానున్న రోహిణికార్తెలో స్వచ్చ కార్యకర్తలు ఇంత కన్న వేడిలో – ఉక్కలో కష్టించవలసిన సమయం రావచ్చు!

          - పాగోలు గ్రామస్తులు శ్రీకృష్ణ గారు తన పొలంలోని సొరకాయలను కార్యకర్తలకు పంచినందుకు కృతజ్ఞతలు!

          రేపు కూడ పాగోలు బాటలోని మహాబోధి దగ్గరే కలుద్దాం!

         సంప్లవిస్తూ సమగ్రతతో...

తన సుదీర్ఘోద్యమానుభవము – తనదు తాత్త్విక చింతనను – తన

స్వచ్చ –సుందర సంకల్పాలను రోజురోజుకు పదును పెడుతూ

స్వచ్చ గ్రామం వినిర్మిస్తూ – సంచలిస్తూ – సాహసిస్తూ

చల్లపల్లిని సంస్కరిస్తూ – స్వచ్చ సైన్యం సమగ్రంగా సాగిపోనుందా!

- నల్లూరి రామారావు

స్వచ్చ సుందర చల్లపల్లి కార్యకర్త మరియు మనకోసం మనంట్రస్టు బాధ్యులు,

శుక్రవారం 22/05/2020,

చల్లపల్లి.

పాగోలు రోడ్డులో